మిస్టరీగా మారిన గుల్జార్ హౌజ్ ప్రమాదం

ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏవన్న విషయంలో ఫైర్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు ఎవరి వాదనకు వారు కట్టుబడున్నారు;

Update: 2025-05-20 13:50 GMT
Gulzar fire accident mystery

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్(Gulzar Houz Area) ఏరియాలో అగ్నిప్రమాదం జరిగి 48 గంటలు దాటిపోయినా ప్రమాదం జరిగిన కారణం మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏవన్న విషయంలో ఫైర్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు ఎవరి వాదనకు వారు కట్టుబడున్నారు. పై రెండుశాఖల ఉన్నతాధికారుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవటంతోనే ప్రమాద కారణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి మాట్లాడుతు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం(Fire Accident) జరిగిందని గట్టిగా చెబుతున్నారు. అయితే విద్యుత్ శాఖలో ఓల్డ్ సిటీ ప్రాంతానికి సంబంధించిన అధికారులతో పాటు చీఫ్ ఇంజనీర్ చక్రపాణి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని వాదిస్తున్నారు.

ఇంతపెద్ద ప్రమాదం జరిగిందంటేనే షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అర్ధమైపోతోందన్న నాగిరెడ్డి వాదనను విద్యుత్ శాఖ ఉన్నతాధికారి చక్రపాణి కొట్టిపారేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కాలేదనేందుకు చక్రపాణి వాదన ఏమిటంటే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు మాడిపోయుండాలని అంటున్నారు. గ్రౌండ్ లెవల్లో బోర్డుకు బిగించిన మీటర్లు, వైర్లు ఎక్కడా కాలిన లేదా మాడిపోయిన ఆనవాళ్ళు లేవంటున్నారు. కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందన్న వాదనను చక్రపాటి అంగీకరించటంలేదు. ఇదేసమయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. అందుకనే పోలీసు శాఖ తరపున క్లూస్ టీమ్ వచ్చి పరిశీలిస్తుందని అంటున్నారు. నిజానికి ఇపుడు క్లూస్ టీమ్ వచ్చి చేసేది కూడా పెద్దగా ఏమీఉండదు. ఎందుకంటే బాధితులను రక్షించేందుకు, స్పృహతప్పిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక శాఖ, వైద్యశాఖ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, స్ధానికులు పై రెండస్తుల్లో తిరిగారు.

జరిగిన ప్రమాద తీవ్రత ఏస్ధాయిలో ఉందంటే ఇప్పటికీ ఫైర్, పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటిలోపలకు వెళ్ళలేకపోతున్నారు. ఇంటిలోపలంతా అంతటి వేడి అలుముకునుంది. అందుకనే చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా తాత్కాలికంగా ఖాళీచేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇపుడు ఇంకో విషయం బయటపడింది. అదేమిటంటే మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న 8 గదుల్లో 14 ఏసీలున్నట్లు స్ధానికులు చెబుతున్నారు. 8 గదులకు 14 ఏసీలు ఎందుకు పెట్టుకున్నారన్న విషయం ఎవరికీ అర్ధంకావటంలేదు. ఏసీలన్నీ పేలిపోయి వాటిల్లోని గ్యాస్ బయటకు రావటంతోనే దాన్నిపీల్చి నిద్రలోని వాళ్ళు అలాగే శాశ్వతనిద్రలోకి వెళ్ళిపోయారా అన్నది అర్ధంకావటంలేదు. ఇదేసమయంలో ఉదయం 5.30 గంటల ప్రాంతంలోనే ఇంట్లో పనిచేసే నలుగురు పనివాళ్ళు పొగలు రావటాన్ని గమనించి తమను తాము రక్షించుకునేందుకు ఇంట్లోని వాళ్ళకు చెప్పకుండానే పారిపోయారనే వార్త మరోటి ప్రచారం జరుగుతోంది. వీటిల్లో ఏది నిజమో కూడా అర్ధంకావటంలేదు. మొత్తంమీద ప్రమాద కారణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News