కాషాయ కార్యకర్తలను చితక బాదిన పోలీసులు

నాలుగురోజుల క్రితం రాత్రిపూట దేవాలయంలోకి గుర్తుతెలీని వ్యక్తి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసంచేశాడు.

Update: 2024-10-19 11:22 GMT
Police lathi charge Hindu Associations cadre

 సికింద్రాబాద్, మోండా మార్కెట్ ప్రాంతంలో ముత్యాలమ్మ దేవాలయం ఉంది. నాలుగురోజుల క్రితం రాత్రిపూట దేవాలయంలోకి గుర్తుతెలీని వ్యక్తి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసంచేశాడు. విషయం తెలుసుకున్న స్ధానికులు వెంటనే పెద్దఎత్తున నిరసన తెలిపారు. బీజేపీ ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి తన మద్దతుదారులతో దేవాలయం వద్దకు చేరుకుని నానా గోలచేశారు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాషాయం కండువాలు వేసుకున్న అనేక మంది ఆలయం గల్లీలోకి ప్రవేశించి ఉద్రిక్త వాతావరణ సష్టించడంతో పోలీసులు లాఠీ చేశారు. 

సీన్ కట్ చేస్తే శనివారం మధ్యాహ్నం నుండి దేవాలయం దగ్గరకు పెద్దఎత్తున బిజెపి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్యకర్తలు చేరుకున్నారు. దేవాలయం దగ్గర ఏమి జరుగుతోందో చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు అర్ధంకాలేదు. దీనికి కారణం ఏమిటంటే రెండురోజుల క్రితమే విగ్రహం ధ్వంసంచేయటంలో కీలకమన్న ఆరోపణలపై పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని పోలీసులు సరిగా విచారించటంలేదనే ఆరోపణలతో హిందుసంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన తెలపటానికి దేవాలయం దగ్గరకు చేరుకున్నారు. వేలాదిమంది కార్యకర్తలు ఒకచోటకు చేరుకున్న విషయం తెలియగానే పోలీసుబలగాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. అనుమతిలేకుండా ఇంతమంది అక్కడ గుమిగూడదని చెప్పిన పోలీసులు అందరినీ అక్కడినుండి వెళ్ళిపొమ్మని చెప్పారు.

అయితే పోలీసులు ఎంతచెప్పినా అక్కడినుండి కదలని కార్యకర్తలు పోలీసులపైనే ఎదురుతిరిగారు. దాంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటలు మొదలయ్యాయి. తోపులాటలతో లాభంలేదని అర్ధమైన పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. ఎప్పుడైతే పోలీసులు లాఠీఛార్జికి దిగారో వెంటనే ఈ సంఘాల కార్యకర్తలు కూడా చేతికి దొరికిన కర్రలను తీసుకుని తిరగబడ్డారు. దాంతో పోలీసులు కార్యకర్తలపై విచక్షణా రహితంగా లాఠీఛార్జీ చేశారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు ఇరగదీశారు. దాంతో కార్యకర్తలంతా దేవాలయం ప్రాంతం నుండి ఒక్కసారిగా పరుగు అందుకున్నారు. అయినా వదిలిపెట్టని పోలీసులు వెంటాడి మరీ చచ్చేట్లు చావకొట్టారు. దాంతో ముత్యాలమ్మ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్దితులు చోటుచేసుకున్నాయి.

Tags:    

Similar News