శవశాల అతని రెండో ఇల్లు,అయినా చావెపుడూ సలీమ్‌ని భయపెట్టలేదు...
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మార్చూరీ..ఈ మార్చూరీలో 41 ఏళ్లుగా 60వేలకు పైగా శవాలకు పోస్టుమార్టం చేయడంలో టెక్నిషీయన్ సలీం సహకరించి రికార్డు సృష్టించారు.
By : Saleem Shaik
Update: 2024-07-02 03:12 GMT
శవం అనే మాట ఎవరికీ మంచి మాటకాదు,కనీసం శవాన్ని చూసేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. శవం చూస్తే కొందరికి వణుకు...మరికొందరికి కంపరం.... శవం మనిషి జీవితంలో ఒక ఖండించలేని వాస్తవం. అందుకే ఈ వాస్తవం భయానకంగా ఉంటుంది. అందుకే శవాన్ని సాధ్యమయినంత తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ సికింద్రాబాద్ కు చెందిన మహ్మద్ సలీం జీవితం 41 ఏళ్లుగా శవశాలలోనే గడిచింది. శవశాల టెక్నిషీయన్ గా ఒకటి కాదు రెండు కాదు 60 వేలకు పైగా శవాలను కోసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం చేసే డాక్టర్లకు ఆయన సహకరించి,రికార్డు నెలకొల్పారు.
చావంటే భయం లేదు...
శవాలను స్వీకరించడం, పోస్టుమార్టం కోసం కోయడం, ఆపై కుట్టి మృతుడి కుటుంబసభ్యుల రోదనల మధ్య ఆ శవాలకు వీడ్కోలు పలకడం మార్చూరీ టెక్నిషీయన్ గా మహ్మద్ సలీం రోజూ చేసే పని. శవాలమధ్య పొద్దుటి నుంచి సాయంకాలం దాకా గడుపుతారు. తునాతనకలైన శరీర భాగాల మధ్య ఉన్న ఏ శవమూ తనని చావు గురించి భయపెట్టలేదని సలీమ్ చెబుతున్నారు. అందుకే అంకితభావంతో 41 సంవత్సరాలు చావంటే భయం లేకుండా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశానని ఆయన ‘తెలంగాణ-ఫెడరల్’ కు చెప్పాడు.
ఇదీ గాంధీ ఆసుపత్రి మార్చూరీ...ఈ మార్చూరీకి ప్రతీరోజు పోస్టుమార్టం కోసం పదికి పైగా శవాలు వస్తుంటాయి.
- ఈ శవాల గది వద్ద మృతుల బంధువుల రోదనల మధ్య ఫోరెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో సీనియర్ మార్చూరీ టెక్నిషీయన్ మహ్మద్ సలీం చేతులకు డబుల్ గ్లౌజులు, తలకు టోపి, ముక్కుకు డబుల్ మాస్కు, ప్లాస్టిక్ బ్లూ కలర్ యాప్రాప్రాన్ ధరించి సర్జికల్ బ్లేడు, హ్యాండిల్ చేత్తో తీసుకొని ఛాతీ, ఉదరం వరకు కోశారు.
- ఆపై శరీరంలోపల ఉన్న ఊపిరితిత్తులు, గుండె, కడుపులోని పేగులు ఇలా అన్ని శరీర భాగాలను డాక్టరుకు చూపించగా, ఆయన రాసుకున్నారు.
- అనంతరం తల పై భాగాన్ని చిన్న రంపంతో కోసి లోపల నుంచి మెదడు తీసి వైద్యుడికి చూపించారు. డాక్టరు మెదడును ఫొటో తీసుకొని పరీక్షించారు.
- పోస్టుమార్టం అనంతరం కోసిన శరీర భాగాలను కడుపులో వేసి మళ్లీ కుట్టి వస్త్రంలో చుట్టి మృతుడి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
-ఇలా 41 ఏళ్ల పాటు 60వేలకు పైగా శవాల పరీక్షల్లో సాయం చేసిన సీనియర్ మార్చూరీ టెక్నిషీయన్ మహ్మద్ సలీం జూన్ 30వతేదీన పదవీ విరమణ చేశారు.
-క్రమశిక్షణ, అంకితభావంతో మార్చూరీలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన మహ్మద్ సలీం పదవీ విరమణ సందర్భంగా గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగం వైద్యులు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారాం, సిబ్బంది ఘనంగా సన్మానించి అతనికి వీడ్కోలు పలికారు. మార్చూరీలో రికార్డు సృష్టించిన మహ్మద్ సలీం కథా కమామీషు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి.
కామాటీగా చేరి మార్చూరీ టెక్నీషియన్‌గా...
‘‘నా పేరు మహ్మద్ సలీం, నాది సికింద్రాబాద్ లోని హస్మత్ పేట నా నివాసం. 1983వ సంవత్సరంలో కామాటీగా గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగం చేరాను. కామాటీగా కొన్ని రోజులు వార్డులు, ఆపరేషన్ థియేటర్లలో పనిచేశాను. ఆ తర్వాత నన్ను గాంధీ ఆసుపత్రి మార్చూరీలో టెక్నీషియన్ గా నియమించారు. మార్చూరీలో శవ పరీక్షలు చేయడానికి వైద్యులకు సహకారం అందించాను. శవాన్ని ఎలా కోయాలి? శరీరంలోపల ఉన్న శరీర భాగాలు, మెదడు, ఊపిరితిత్తులను ఎలా బయటకు తీసి చూపించాలనేది మొదట్లో నాకు వైద్యులు నేర్పారు. నాటి నుంచి ఉదయాన్నే ఏడు గంటలకు మార్చూరీకి వచ్చి దుస్తులు మార్చుకొని మార్చూరీ డ్రెస్ వేసుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు పనిచేశాను. ఇలా క్రమం తప్పకుండా అంకిత భావంతో నా విధులు నిర్వర్తించాను.’’
పోస్టుమార్టం ఎందుకు చేస్తారంటే...
‘‘నాచురల్ డెత్ కాకుండా అనుమానాస్పద స్థితిలో మరణించినా, ప్రమాదాల్లో మరణించినా వారి శవాలకు పోలీసులు, కోర్టుల అభ్యర్థన మేర మేం పోస్టుమార్టం చేస్తుంటాం. ఎవరైనా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించినా,ప్రమాదాల్లో మరణించినా, విషం తాగినా, రైలు కింద పడినా, ఆత్మహత్య చేసుకున్నా,నీటిలో మునిగి మరణించినా, హత్యకు గురైనా వారి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి, వైద్యులు అసలు మృతికి కారణాలను కనుగొంటారు. పాథాలజీ డాక్టర్ల పర్యవేక్షణలో సాగే శవ పరీక్షలో నేను టెక్నిషీయన్ గా సహకరించాను. నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా...లేదా ఎవరైనా విషం బలవంతంగా ఇచ్చారా అనేది పోస్టుమార్టంలో తెలుసుకోవచ్చు.’’
పోస్టుమార్టం ఎలా చేస్తారంటే...
‘‘అంబులెన్సులో మార్చూరీకి తరలించిన శవాన్ని రిజిస్టరులో నమోదు చేసుకొని ముందు ఏసీ బాక్సులో పెడతాం. ఆ తర్వాత వైద్యులు రాగానే శవాన్ని మార్చూరీ గదిలోని స్టీలు టేబుల్ పై ఉంచి, మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించి వాటిని డాక్టరుకు చెప్పి నమోదు చేపిస్తాను.అనంతరం భుజాల దగ్గర నుంచి రొమ్ముల మీదుగా మర్మాంగం దాకా శరీరాన్ని యూ లేదా వై ఆకారంలో కోస్తాను. చర్మం లోపల కండర భాగాన్ని తీసేస్తాను. శరీరంలోని ముఖ్యమైన భాగాలను బయటకు తీసి వైద్యులకు చూపిస్తాను. పుర్రె వెనుక భాగాన్ని ఒక చెవి నుంచి మరో చెవి వరకు కోసి తీస్తాను. పుర్రెను రంపంతో కోసి మెదడును బయటకు తీసి వైద్యుడికి చూపిస్తాను. వైద్యులు కేసును బట్టి శరీర భాగాల్లో పరీక్షలు చేస్తారు.వైద్యులు అనుమానం ఉన్న భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తారు. ఫోరెన్సిక్ నిపుణులు శరీర భాగాలను పరీక్షించి మృతికి అసలు కారణాలను కనుగొంటారు. పోస్టుమార్టం అయిపోయాక మళ్లీ తీసిన భాగాలను ఉదరం లోపల పెట్టి కుట్టేస్తాను.ఇలా శవ పరీక్ష మూడు గంటలపాటు చేస్తాం.బాడీలో ప్రతీ అవయువాన్ని,ఎముకలని పరీక్షిస్తాం. చిన్న శరీర భాగాల ముక్కలను ల్యాబ్ కి పరీక్ష కోసం పంపిస్తాం.’’
మద్యం ముట్టను...
శవాలను కోసే వారు మద్యం తాగి ఆ పని చేస్తుంటారని సాధారణంగా జనం అనుకుంటారు, కానీ తాను అసలు మద్యమే తాగనని వృత్తి ధర్మంపై అంకిత భావంతో విధులు నిర్వర్తించాను.అసలే ప్రమాదాలు, ఆత్మహత్యల వల్ల మృతుడి కుటుంబసభ్యులు పరేషాన్ లో ఉండి రోదిస్తుంటారు.మృతుడి కుటుంబసభ్యులకు పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసి వారికి శవాన్ని అందించడానికి మేం కృషి చేస్తుంటాం. నీళ్లలో మునిగిన శవాలు కుళ్లి పోయి వస్తుంటాయి. మరికొన్ని శవాలు పురుగులు పట్టి వస్తుంటాయి. కొన్ని మృతదేహాల నుంచి వాసన కూడా వస్తుంటుంది. అయినా శవాలను నీళ్లతో శుభ్రంగా కడిగి శవపరీక్షల కోసం శరీర భాగాలను కోస్తాం.
శవపంచనామాలో పోలీసులకు సహకరించాను...
‘‘పంచనామాలో పోలీసులకు నేను సహకారం అందించాను. శవాలపై ఎక్కడెక్కడ గాయాలున్నాయి? శవం గురించి పోలీసులకు చెబుతుంటాను. గుర్తుతెలియని శవాలు కూడా మా మార్చూరీకి వస్తుంటాయి. అలాంటి శవాలను మార్చూరీ గదిలోని బాక్సుల్లో భద్రపరుస్తుంటాం. గాంధీ ఆసుపత్రి వైద్యులు, పోలీసులు అందరి సహకారంతో నేను మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించి పదవీ విరమణ చేయడం నాకు ఆనందదాయకంగా ఉంది.’’
డ్యూటీ అనంతరం...
శవపరీక్లల అనంతరం మార్చూరీ గదిని ఫినాయిల్ తో శుభ్రంగా కడుగుతాం.డ్యూటీ ముగిశాక మార్చూరీలోని స్నానాల గదిలో వేడినీళ్లతో స్నానం చేస్తాను. చేతులను రెండు,మూడు సార్లు డెటాల్ సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటాం. డ్యూటీ డ్రెస్ వదిలేసి ఇంటి దుస్తులు వేసుకొని ఇంటికి వెళతాం. నేను మార్చూరీలో ఎన్ని శవాలను కోసినా ఇంటికి వెళితే అవన్నీ మర్చిపోయి భార్య పిల్లలతో సంతోషంగా గడిపాను.
ఆధ్యాత్మిక చింతనలోనే...
‘‘నాకు భార్య ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద అబ్బాయి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. మా రెండో అబ్బాయి బీటెక్ చదివి ఎంఎస్ కోసం లండన్ పంపించాను. మూడో కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను,’’ అంకితభావంతో విధి నిర్వహించి సంతోషంగా, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేశానని సలీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. విధి నిర్వహణ వల్ల నేను ప్రార్థనలు చేయలేక పోయానని, ఇక నుంచి మక్కా యాత్రకు వెళ్లి వచ్చాక అయిదు పూటలా నమాజ్ చేస్తూ భావి జీవితం ఆధ్యాత్మిక చింతనలో గడపాలనుకుంటున్నానని సలీం వివరించారు.
శభాష్ సలీం : గాంధీ ఆసుపత్రి వైద్యులు
41 ఏళ్ల పాటు గాంధీ మార్చూరీలో ఎలాంటి తప్పులు చేయకుండా అంకితభావంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించిన మహ్మద్ సలీంను గాంధీ వైద్యులు అభినందించి ఘనంగా వీడ్కోలు పలికారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు, మార్చూరీ విభాగాధిపతి కృపాల్ సింగ్, ఫోరెన్సిక్ వైద్యులు, గాంధీ పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు సలీంను ప్రశంసించారు. పదవీ విరమణ చేసిన సలీంకు మెమోంటోలు అందించి, శాలువలు, బొకేలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. 41 ఏళ్ల మార్చూరీ సర్వీసులో సలీం 60వేలకు పైగా శవపరీక్షలకు సహకరించారని వైద్యులు కొనియాడారు.శవశాల అతని రెండో ఇల్లు,అయినా చావెపుడూ సలీమ్‌ని భయపెట్టలేదు...