18 ఏళ్ల పోరాటం ఫలించింది...ఎట్టకేలకు దివ్యాంగుడికి న్యాయం

తెలంగాణలో ఓ వికలాంగుడు 18 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు...దివ్యాంగుడి దయనీయమైన గాథ.;

Update: 2025-09-02 02:47 GMT
దివ్యాంగుడు కర్నాటి రామకృష్ణ దయనీయమైన గాథ

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన వికలాంగ యువకుడు కర్నాటి రామకృష్ణ న్యాయం కోసం 18 సంవత్సరాలుగా పోరాడి ఎట్టకేలకు విజయం సాధించారు. దివ్యాంగుడైన రామకృష్ణ 18 ఏళ్ల న్యాయపోరాటం, అతని దయనీయమైన గాథ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.


దివ్యాంగుడి దయనీయమైన గాథ
‘‘నా పేరు కర్నాణి రామకృష్ణ. నా స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ.నాకు సోకిన పోలియో వ్యాధితో కాలికి అంగవైకల్యం ఏర్పడింది. నా తండ్రి కర్నాటి నాగేశ్వరరావు 2007వ సంవత్సరంలో కొత్తగూడెం పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేస్తూ మరణించారు. దీంతో 21 ఏళ్ల వయసులో నా తల్లి కర్నాటి రాణి, తమ్ముడు కోటేశ్వరరావును పోషించడం కోసం కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాను. నాకు కారుణ్య నియామకం కోసం అర్హత, అంగవైకల్యం ఉన్నప్పటికీ నా దరఖాస్తును అధికారులు, ప్రభుత్వం పదేపదే తిరస్కరించింది.



 ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినా...

నా తమ్ముడు కోటేశ్వరరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటే వికలాంగుడైన నేను ఏమీ చేయలేక కారుణ్య నియామకం కోసం 18ఏళ్లుగా పోరాడాను. వికలాంగుడినైన నాకు తన తండ్రి మృతితో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాను. దీంతో 2013వ సంవత్సరంలో నాకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా నాకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.

ప్రజాదర్బార్ లో వినతి
నాకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఇచ్చినా ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ప్రజాదర్బారులో సీఎం ఎ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశాను. నా వినతిని సీఎం కార్యాలయం పరిశీలించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు పంపించింది. తెలంగాణ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అధికారులు ఆఫీసు సబార్డినేట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నా 18 ఏళ్ల పోరాటం ఫలించింది...
కారుణ్య నియామకం కోసం నేను 18 ఏళ్లుగా సాగించిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సురక్షితమైన భవిష్యత్తును ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కుటుంబానికి ఈ నియామకంతో ఉపశమనం లభించింది’’అంటూ దివ్యాంగుడు కర్నాటి రామకృష్ణ తన దయనీయమైన గాథను వివరించారు.


Tags:    

Similar News