ఇదీ తెలంగాణ రైతుల ఘనత..సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్ట్
ఆరుగాలం కష్టించి పనిచేసి వరి ధాన్యం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలిపిన అన్నదాతలకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అభినందనల వర్షం కురిపించారు.
By : The Federal
Update: 2024-11-17 11:24 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 153.00 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి రైతులు దేశంలోని అగ్రగామిగా నిలిచారు. పంజాబ్ రాష్ట్రాన్ని అధిగమించి, తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. గత ఏడాది 65.94 లక్షల ఎకరాల్లో వరిపంట వేయగా 144.8 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండింది.
- కాంగ్రెస్ ప్రభుత్వం వరి సన్న రకాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతన్నలు సన్న రకాల సాగువైపు మొగ్గు చూపించారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజనులో 25.05 లక్షల ఎకరాల్లో వరి సన్నరకాలు సాగు చేశారు. ఈ ఏడాది రైతులు అనూహ్యంగా 40.44 లక్షల ఎకరాల్లో వరి సన్నరకాలు పండించారు.15.39 లక్షల ఎకరాల్లో అధికంగా రైతులు సన్న రకం వడ్లను పండించారు.
- గత ఆరేళ్లుగా వరి ఉత్పత్తిని పరిశీలిస్తే అనూహ్యంగా 153.00 లక్షల టన్నులకు చేరింది. 2019వ సంవత్సరంలో 89.76 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, దాదాపు ఆరేళ్లలో రెట్టింపు దాకా పెరిగింది.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్టులో ఆదివారం పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా…కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది’’ అని సీఎం పేర్కొన్నారు.
‘‘ఇది తెలంగాణ రైతుల ఘనత…వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం…తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం…ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది’’అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
వరి సాగు విస్తీర్ణంతో పాటు ఉత్తత్తి పెరిగింది : తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణలో 220 రకాల వరి ధాన్యం సాగులో ఉండగా, ఇందులో సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందని మంత్రి పేర్కొన్నారు. సన్న రకం వరి ధాన్యం పండించిన రైతుల ఖాతాల్లో క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అందిస్తుందని అధికారులు చెప్పారు.