ముగ్గురు యువకులకు శిరోముండనం..ఒకరి ఆత్మహత్యా యత్నం

పోలీసుశాఖలోని ఉన్నతస్ధాయిలోని అధికారులు ఫ్రెండ్లీ పోలీసు అని పదేపదే చెబుతున్నా కిందిస్ధాయి పోలీసులు మాత్రం జనాలతో చాలా దురుసుగా ప్రవర్తిస్తునే ఉన్నారు.

Update: 2024-10-19 07:40 GMT
Telangana Police

పోలీసుశాఖలోని ఉన్నతస్ధాయిలోని అధికారులు ఫ్రెండ్లీ పోలీసు అని పదేపదే చెబుతున్నా కిందిస్ధాయి పోలీసులు మాత్రం జనాలతో చాలా దురుసుగా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఇపుడు విషయం ఏమిటంటే నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల గ్రామంలో ముగ్గురు యువకులకు పోలీసులు శిరోముండనం(గుండుగీయించటం) చేయించటం సంచలనంగా మారింది. అవమానానికి తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేయటంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. చిన్న గొడవలో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకుని ఓవర్ యాక్షన్ చేయటమే ఈ వివాదానికి మూలకారణమైంది.

అసలు ఏమి జరిగిందంటే జిల్లాలోని లింగాలలో పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బందికి ముగ్గురు యువకులకు చిన్నపాటి గొడవైంది. గొడవ జరుగుతుండగానే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. రెండువర్గాల మధ్య గొడవను సర్దిచెప్పాల్సిన పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి యువకులను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళారు. పెట్రోల్ బంకు సిబ్బందితో యువకుల గొడవ చివరకు పోలీసులు-యువకుల గొడవగా మారిపోయింది. దాంతో పోలీసులు యువకులను బలవంతంగా స్టేషన్ కు తీసుకెళ్ళారు. స్టేషన్ కు తీసుకెళ్ళిన తర్వాత ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి యువకులతో బాగా దారుసుగా వ్యవహరించాడు. ఈ సమయంలోనే యువకులు తమ క్రాఫ్ ను సరిచేసుకున్నారట. తాను క్లాసు సీరియస్ గా క్లాసు పీకుతుంటే యువకులు నిర్లక్ష్యంగా క్రాఫ్ సరిచేసుకుంటారా ? అని ఎస్ఐకు మండిపోయింది.

దాంతో వెంటనే ముగ్గురు యువకులను ఎస్ఐ కూర్చోబెట్టి బలవంతంగా గుండుగీయించాడు. గుండుగీయించటమే కాకుండా నోటికొచ్చినట్లు తిట్టాడు. శిరోముండనం చేయించిన విషయం బయట ఎవరితో అయినా చెబితే జాగ్రత్త అంటు బెదిరించి తిట్టి పంపేశాడు. ఎస్ఐ బెదిరింపులతో పాటు శిరోముండనం చేయించినందుకు ముగ్గురిలో నితీష్ అనే యువకుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉరివేసుకున్నాడు. వెంటనే నితీష్ ను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. యువకుడు ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ముగ్గురికి పోలీసుస్టేషన్లో శిరోముండనం చేయించిన విషయం వెలుగులోకి రావటంతో కుటుంబసభ్యులతో పాటు జనాలంతా పోలీసులపై భగ్గుమంటున్నారు. మరి విషయం బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News