National Turmeric Board | ఫలించిన పోరాటం,ఇందూరు పసుపు రైతుల కల సాకారం
నిజామాబాద్ లో దశాబ్దాల పసుపు రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు కల ఎట్టకేలకు సాకారమైంది. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అయింది.;
By : The Federal
Update: 2025-01-15 04:13 GMT
పసుపు సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం 18 ఏళ్లుగా సాగిన ఉద్యమం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. 2006వ సంవత్సరం నవంబర్ 27వతేదీన పసుపురైతుల పాదయాత్రతో పసుపుబోర్డు ఉద్యమం ప్రారంభమైంది.
- పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పసుపు రైతుల పక్షాన రైతు సంఘం నేతలు నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి విన్నపాలు చేశారు.
- పసుపు బోర్డు కోసం ఢిల్లీలో నాలుగు సార్లు పసుపు రైతులు ధర్నాలు చేశారు.
- 2014 లోక్ సభ ఎన్నికల్లో పసుపుబోర్డు డిమాండుతో 27 మంది పసుపు రైతులు పోటీ చేసి, నిరసన తెలిపారు.2019 లోక్ సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్ లో 183 మంది, వరణాసిలో 54 మంది పసుపు రైతులు పోటీ చేసి నిరసన తెలిపారు.
పసుపుబోర్డు కోసం పోరాటం
నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటు గతంలో ఎన్నికల అంశంగా మారింది. 2017 ఆగస్టు నెలలో అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతినిధి బృందంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. అనంతరం పసుపుబోర్డు ఎన్నికల అంశంగా మారింది.
- పసుపు బోర్డు ఏర్పాటు కోసం గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 178 మంది రైతులు పోటీ చేశారు. వరణాసి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సాక్షాత్తూ మోదీపై 30 మంది నిజామాబాద్ పసుపు రైతులు పోటీ చేసి పసుపుబోర్డు అంశాన్ని ఆయన దృష్టికి వచ్చేలా చేశారు.
- నిజామాబాద్ లో పసుపుబోర్డు తీసుకురాకపోతే తాను ఎంపీగా రాజీనామా చేస్తానని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ హామీ ఇస్తూ బాండ్ పేపరుపై రాసి ఇచ్చారు. 2019-2024 పదవీకాలంలో పసుపుబోర్డు ఏర్పాటు చేయలేక పోయారు.
- పసుపుబోర్డు ఎన్నికల అంశంగా మారింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఇస్తున్నట్లు పాలమూరు సభలో ప్రకటించారు. అప్పట్లో గెజిట్ ఇచ్చిన తర్వాత ఇన్నాళ్లకు నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డు ఏర్పాటైంది.
పసుపుబోర్డుతో ప్రయోజనాలెన్నో...
- నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మేలు జరగనుంది. పసుపు పంటపై పరిశోధనలు చేయడంతో పాటు కొత్త మార్కెట్ ఏర్పాటు కానుంది.
- పసుపులో కొత్త వంగడాలను కనిపెట్టేందుకు పరిశోధనలు చేయనున్నారు. దీంతో పాటు పసుపులో తెగుళ్ల నియంత్రణ, యాంత్రీకరణ, పసుపు మార్కెటింగ్, నాణ్యత మెరుగుదలకు ఈ బోర్డు ఉపకరించనుంది.
- పసుపుబోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభించనుంది. ఎగుమతులకు, పసుపు నిల్వ కోసం గోదాములు, మార్కెటింగ్, ప్రాసెసింగ్, పరిశోధనలకు మార్గం సుగమం కానుంది.
పసుపుబోర్డుకు నిధులేవి?
నిజామాబాద్ నగరంలో ఉన్న స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలోనే జాతీయ పసుపు బోర్డు అంటూ ప్లెక్సీ పెట్టి మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించినా, నిధుల ఊసు లేదు. పసుపుబోర్డు నిర్వహణ కోసం ఇంకా అధికారులు, ఉద్యోగులను నియమించలేదు. పసుపునకు డిమాండ్ పెరగాలంటే గోదాములు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాల్సి ఉందని పసుపురైతుల పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. 2025-26 కేంద్ర బడ్జెట్ లో అయినా జాతీయ పసుపు బోర్డుకు నిధులు కేటాయించాలని నర్సింహనాయుడు డిమాండ్ చేశారు.
పసుపు రైతులకు చరిత్రలో నిలిచిపోయే రోజు
జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు వల్ల ప్రపంచ మార్కెట్లో భారతీయ పసుపుకు విలువ పెరగనుందని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. పసుపు ఉత్పత్తిలో మరిన్ని ఆవిష్కరణలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు.మకర సంక్రాంతికి మోదీజీ పసుపుబోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయించి మరచిపోలేని బహుమతి ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు.