మియాపూర్ లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
ఐదు రోజుల వ్యవధిలో రిజ్వాన్, హన్సికలు ఒకే తీరులో బలవన్మరణాలు;
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదో తరగతి విద్యార్థి హన్సిక తను నివాసముంటున్న బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవడం తీవ్ర కలకలం రేగింది. తన కూతురు ఆత్మహత్యకు తోటి విద్యార్థి రిజ్వాన్ తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం కారణమని హన్సిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు .
మియాపూర్ జన ప్రియ అపార్ట్ మెంట్ ఐదో అంతస్థులో ఉండే బిజక్ నాయక్ , చిన్మయి నాయక్ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె హన్సిక (15) మాధవ్ నగర్ లో ప్రయివేటు స్కూల్ లో పదో తరగతి చదువుతోంది. గురువారం పరీక్షరాయడానికి హన్సిక పాఠశాలకు వెళ్లింది. ఫీజు కట్టని కారణంగా హన్సికను పాఠశాలలోకి అనుమతించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటికి వచ్చిన హన్సిక బిల్డింగ్ పై నుంచి దూకేసింది. తీవ్ర రక్త స్రావంతో ఆస్పత్రిలో చేరిన హన్సిక చనిపోయింది.
ఈ ఘటన జరిగిన ఐదు రోజుల క్రితమే హన్సిక క్లాక్ మేట్ షేక్ రిజ్వాన్ (15) తను నివాసమున్న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రిజ్వాన్ , హన్సిక సన్నిహితంగా ఉండేవారు. నిత్యం వీరిరువురు చాటింగ్ చేసుకుంటున్న విషయాన్ని క్లాస్ టీచర్ పసిగట్టి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. రిజ్వాన్ తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ పిలిపించి మాట్లాడుతున్న సమయంలో రిజ్వాన్ కు విషయం తెలిసింది. మనస్థాపంతో రిజ్వాన్ స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రిజ్వాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి హన్సిక తండ్రితో వెళ్లింది. రిజ్వాన్ కుటుంబ సభ్యులు హన్సికను తిట్టినట్టు నాయక్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్టుగానే నువ్వు బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపో అని రిజ్వాన్ తల్లిదండ్రులు దూషించినట్టు నాయక్ చెబుతున్నారు.
ఇది జరిగిన ఐదు రోజుల వ్యవధిలో తన కూతురు హన్సికను పాఠశాల యాజమాన్యం రానివ్వకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందినట్లు నాయక్ పేర్కొన్నారు.ఇంటికి వచ్చినప్పటి నుంచి తన కూతురు ముభావంగా ఉంటూనే ఐదో అంతస్థుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుందని నాయక్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు ఒకే క్లాస్ మెట్స్ కావడం ఇద్దరు కూడా ఒకే తరహాలో బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవడం చర్చనీయాంశమైంది.