కన్నవారు కానరాక తల్లడిల్లుతున్న తెలంగాణ స్వీడన్ అమ్మాయి
ఇప్పటికి ఐదుసార్లు వరంగల్ జిల్లాలో పర్యటించినా కన్న తల్లి, దండ్రుల జాడ మాత్రం తెలుసుకోలేకపోయింది.;
కన్నప్రేమ గొప్పదా..పెంచిన ప్రేమగొప్పదా ? అనే ప్రశ్న అనాధిగా వినబడుతునే ఉంది. ఇదే అంశాన్ని చాలా సినిమాలో కూడా చూసే ఉంటాము. నిజానికి కన్న ప్రేమా గొప్పదే, పెంచిన ప్రేమ కూడా గొప్పదనే చెప్పాలి. ఇపుడిదంతా ఎందుకంటే పేగుబంధం తెలుసుకునేందుకు స్వీడన్(Sweden) యువతి బీ సంధ్యారాణి అల్లాడిపోతోంది. ఎక్కడో స్వీడన్ అమ్మాయి పేగుబంధం కోసం అల్లాడుతుంటే మనకేమి సంబంధం అనే అనుమానం రావచ్చు. కాని స్వీడన్ అమ్మాయి మూలాలు తెలుగురాష్ట్రాల్లో అందులోను తెలంగాణ(Telangana)లో ఉన్నాయి. అందుకనే ఆ అమ్మాయి వరంగల్(Warangal) జిల్లాలోని తన తల్లిదండ్రుల జాడ తెలుసుకునేందుకు తల్లడిల్లిపోతోంది. ఇప్పటికి ఐదుసార్లు వరంగల్ జిల్లాలో పర్యటించినా కన్న తల్లి, దండ్రుల జాడ మాత్రం తెలుసుకోలేకపోయింది. బరువెక్కిన హృదయంతో ఈనెల 21వ తేదీన లండన్(London) కు తిరిగి వెళ్ళిపోతోంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే బీ సంధ్యారాణి తల్లి, దండ్రులు బీ. రాజ్ కుమార్, విజయది వరంగల్లోని శివనగర్ ప్రాంతం. బ్రతుకుతెరువుకోసం 1987 ప్రాంతంలో వరంగల్ నుండి హైదరాబాద్ లోని ప్రేమ్ నగర్ కు చేరుకున్నారు. తండ్రి ఒక పరాస్ బార్ లో పనిచేసేవాడు. వీళ్ళకు ఒక పాప పుడితే సంధ్యారాణి అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత తల్లి చనిపోయింది. బిడ్డకు సుమారు రెండున్నర ఏళ్ళున్నపుడు తండ్రి మరో అమ్మాయి అనసూర్యను వివాహం చేసుకున్నాడు. మూడు మాసాల తర్వాత ఏమైందో ఏమో ఎవరికీ తెలీదు రాజ్ కుమార్ రెండో భార్యతో పాటు కూతురును కూడా వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. అతని జాడకోసం ఎంతవెతికినా కనిపెట్టలేకపోయారు. రాజ్ కుమార్-అనసూర్యకు వివాహం చేసింది కే. రామయ్య. రామయ్య ఎవరంటే నిజాం కాలేజీలో తోటమాలిగా పనిచేసేవాడు. మొదటిభార్య చనిపోయిందని రాజ్ కుమార్ చెబితే తనమరదలు అనసూర్యను ఇచ్చి వివాహం చేశాడు రామయ్య.
రెండోభార్య, కన్నకూతురును వదిలేసి రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడో ఎంత వెతికినా తెలీలేదు. దాంతో కూతురును తీసుకుని అనసూర్య బావ రామయ్య ఇంటికి చేరింది. అయితే అప్పటికే భార్య, నలుగురు బిడ్డలున్న రామమ్య మరదలు, సంధ్యారాణిని పోషించలేకపోయాడు. అందుకనే సంధ్యారాణిని రామయ్య హైదరాబాద్, విజయనగర్ కాలనీలో ఉన్న ‘‘గిల్డ్ ఆఫ్ సర్వీసెస్ సేవా సమాజం, బాలికా నిలయం’’లో వదిలిపెట్టేశాడు. ఇదంతా జరిగింది ఎప్పుడంటే 1987, అక్టోబర్లో. బాలికానిలయంలో చేరేనాటికి సంధ్యారాణి వయసు సుమారు రెండున్నర సంవత్సరాలుంటుంది. కొద్దిరోజులకు స్వీడన్ నుండి పిల్లలు లేని లిండ్ గ్రెన్ హ్యన్స్ మార్టిన్ జొహన్నస్ దంపతులు ఇండియా పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ చేరుకుని పైన చెప్పిన బాలికా సదన్ కు వెళ్ళారు.
పిల్లలు లేని వాళ్ళు ఎవరినైనా దత్తత తీసుకోవాలని అనుకున్నారు. వెంటనే బాలికా సదన్ నిర్వాహకురాలు మంజులా అయ్యంగార్ ను కలిసి మాట్లాడారు. బాలికాసదన్లో ఉన్న సుమారు మూడేళ్ళ పాప సంధ్యారాణిని దత్తత తీసుకోవాలని అనుకున్నారు. ఇందుకు అవసరమై దత్తత కార్యక్రమానికి అనుసరించాల్సిన నియమాలను పూర్తిచేశారు. లిండ్ గ్రెన్ దంపతులు సంధ్యారాణిని చట్టబద్దంగా దత్తత తీసుకుని స్వీడన్ కు వెళ్ళవచ్చని సిటి సివిల్ కోర్టు అడిషినల్ చీఫ్ జడ్జ్ ఎంజే విజయవర్ధనరావు 1988 అక్టోబర్ 4వ తేదీన అనుమతిచ్చారు. కోర్టు అనుమతితో లిండ్ గ్రెన్ దంపతులు సంధ్యారాణిని తీసుకుని స్వీడన్ కు వెళ్ళిపోయారు.
ఇదంతా జరిగింది ఎప్పుడంటే 36 ఏళ్ళ క్రితం. దత్తత తల్లి, దండ్రులతో స్వీడన్ వెళ్ళిపోయిన సంధ్యారాణి అక్కడే చదువుకుని పెరిగి పెద్దదయ్యింది. ఇపుడు ఆ అమ్మాయి ‘‘లండన్ వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటి’’లో ఉద్యోగం చేస్తోంది. 2006 ప్రాంతంలో ఒకసారి స్వీడన్లో చదువుతున్నపుడే ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. అందులో తాను ఇండియాలోని వరంగల్లో పుట్టినట్లు, బాలికాసదన్ లో చేరినట్లు, అక్కడినుండి లిండ్ గ్రెన్ దంపతులు దత్తత చేసుకుని స్వీడన్ కు తీసుకొచ్చినట్లు తెలుసుకున్నది. ఇదేవిషయాన్ని తల్లి, దండ్రులను అడిగినపుడు వాళ్ళు కూడా జరిగిందంతా సంధ్యారాణికి వివరించారు. అంతా వివరించిన లిండ్ గ్రెన్ దంపతులు కూతురును ఇండియాకు వెళ్ళవద్దని, కన్న తల్లి, దండ్రుల కోసం వెతకవద్దని కూడా చెప్పారు.
అయితే పెంపుడు తల్లి,దండ్రుల మాటవినకుండా సంధ్యారాణి తన కన్న తల్లి, దండ్రుల కోసం వెతకాలని నిర్ణయించుకుంది. ఇక్కడే పేగుబంధం ఎంతటి బలమైనదో అర్ధమవుతోంది. తన కన్న తల్లి, దండ్రులు వరంగల్ లో ఉన్నారని తెలుసుకున్నాక సంధ్యారాణి ఊరికే కూర్చోలేకపోయింది. ఇందులో భాగంగానే తనకు అవకాశం వచ్చినపుడల్లా ఇండియాకు చేరుకుని వరంగల్లో పర్యటించేది. ఇప్పటికి ఐదుసార్లు వరంగల్ కు చేరుకుని అన్నీచోట్లా వాకాబుచేసింది. ఎంత వాకాబుచేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. తన పుట్టుపూర్వోత్తరాలు ఏవీ దొరకలేదు. ఇపుడు ఐదోసారి వరంగల్ కు చేరుకుని మళ్ళీ శోధన మొదలుపెట్టింది. ఈసారి తన కన్న తల్లి, దండ్రులది పద్మశాలి సామాజికవర్గం అని మాత్రం తెలుసుకున్నది. అందుకనే వరంగల్ లోని పద్మశాలి సామాజికవర్గం సంఘం నేత శామంతుల శ్రీనివాస్ ను కలిసింది.
శ్రీనివాస్ కూడా సంధ్యారాణి మూలాలు తెలుసుకునేందుకు ఎంతప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు. పద్మశాలి సామాజికవర్గంలోని ఎంతమందిని కలుసుకున్నా సంధ్యారాణి పూర్వోత్తరాలు తెలుసుకోవటం సాధ్యంకాలేదు. కారణం ఏమిటంటే సంద్యారాణి ఇనిషియల్ బీ అని మాత్రమే తెలుసు. కాని బీ అనేది ఇంగ్లీషు అక్షరం. ఇంగ్లీషు Bతో మొదలయ్యే తెలుగు ఇంటిపదాలు చాలాఉన్నాయి. అలాంటి ఇంటిపేర్లున్న చాలామంది దగ్గరకు సంధ్యారాణిని శ్రీనివాస్ తీసుకుని వెళ్ళారు. అయితే తమ బంధువులు, తెలిసిన వాళ్ళల్లో ఎవరూ స్వీడన్ దంపతులకు దత్తత వెళ్ళినట్లు బీ ఇంటిపేరుతో ఉన్న కుటుంబాల వాళ్ళు చెప్పలేకపోయారు. సంధ్యారాణి ఇంటిపేరు బీ ఇనిషియల్ కు పూర్తి ఇంటిపేరు కనిపెట్టగలిగితే బంధువుల్లో ఎవరైనా దొరికే అవకాశాలున్నాయి.
పేగుబంధాన్ని తెలుసుకోవాలి : సంధ్యారాణి
ఇదేవిషయాన్ని తెలంగాణ ఫెడరల్ తో సంధ్యారాణి మాట్లాడారు. సంధ్యారాణి ఏమన్నారంటే ‘‘తన కన్న తల్లి, దండ్రులు ఎవరో తెలుసుకునేందుకే వరంగల్ ప్రాంతంలో పర్యటిస్తున్న’’ట్లు చెప్పారు. ఇప్పటికి ఐదుసార్లు పర్యటించినా ఎలాంటి సమాచారం తెలుసుకోలేకపోయి’’నట్లు చెప్పారు. స్వీడన్లో చదువుకుని పెద్దయిన తర్వాత లండన్ లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ‘‘తాను పద్మశాలి సామాజికవర్గానికి చెందినట్లు మాత్రమే తెలిసింద’’న్నారు. ‘‘బీ అనే ఇనిషియల్ కాకుడా పూర్తి ఇంటిపేరు తెలియకపోవటం వల్లే తల్లి,దండ్రులు లేదా బంధువులను కనిపెట్టలేకపోతున్న’’ట్లు చెప్పింది. ‘‘అవకాశం వచ్చినపుడు మళ్ళీ వరంగల్ కు వస్తానని, తల్లి, దండ్రుల వివరాలను తెలుసుకుంటా’’నని ఎంతో నమ్మకంతో చెప్పింది. 16 ఏళ్ళుగా తన తల్లి, దండ్రుల కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. తన తండ్రి జీవించి ఉన్నారో లేదో కూడా తెలీదన్నారు. తన తల్లి చనిపోయినట్లుగా విన్నట్లు తెలిపారు.
సంధ్యారాణికి సాయం: పవార్
‘‘కన్న తల్లి,దండ్రులను వెతకటంలో సంధ్యారాణికి తాను సాయంచేస్తు’’న్నట్లు పూనేలోని లాయర్ అంజలి పవార్ తెలంగాణ ఫెడరల్ కు చెప్పారు. పూనేలోని అడాప్టీ రైట్స్ కౌన్సిల్ లో లాయర్ పవార్ డైరెక్టర్ గా ఉన్నారు.
ఇంటిపేరు తెలీకపోతే కష్టం: శ్రీనివాస్
ఇదే విషయాన్ని శ్రీనివాస్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘బీ అనే ఇనిషియల్ కు పూర్తి ఇంటిపేరు తెలియకుండా పూర్వీకులను పట్టుకోవటం చాలా కష్టమ’’న్నారు. ‘‘బీ అక్షరంతో మొదలయ్యే ఇంటిపేర్లు తమలో చాలా ఉన్నాయ’’ని అన్నారు. ‘‘సంధ్యారాణితో కలిసి సామాజికవర్గంలోని ఎంతమంది పెద్దలను కలిసినా ముందుగా అందరు ఇంటిపేరు ఏమిట’’ని ప్రశ్నించినట్లు తెలిపారు. ‘‘సంధ్యారాణికి ఇంటిపేరు తెలీకపోవటం, రికార్డుల్లో కూడా ఇంటిపేరు కాకుండా బీ అనే అక్షరం మాత్రమే ఉండటంతో ఆమెకు సంబంధించిన వాళ్ళని కనుక్కోవటం కష్టమైంద’’ని చెప్పారు.