అద్దంకి దయాకర్‌ను నిలదీసిన నిరుద్యోగులు..
ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించిన నిరుద్యోగులు.;
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌గా భారీ షాక్ తగిలింది. బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. తమకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయంటూ నిలదీశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాటిని ఎందుకు నెరవేర్చడం లేదు? అని అద్దంకి దయాకర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన బోనాల వేడుకలకు అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఆయనను చూసిన నిరుద్యోగులు వెంటనే చుట్టుముట్టారు. ప్రశ్నల వర్షం కురిపించడం ప్రారంభించారు. తమకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని అడిగారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు
‘‘ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. పైగా నిరుద్యోగులే నోటిఫికేషన్‌లు వద్దు.. మేము ప్రిపేర్ కాలేకున్నామని నిరుద్యోగులే ధర్నా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు. ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఎందుకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఒక్కసారిగా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు. అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచింది. నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలపై, వారి కలలపై నీళ్లు చల్లుతోంది’’ అంటూ మండిపడ్డారు నిరుద్యోగులు.
55వేల ఉద్యోగాల మాటేంటి..!
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు అందించిన ఘతన తమ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తమ తరహాలో ఉద్యగాలను భర్తీ చేసిన ప్రభుత్వం మరేదీ లేదని కూడా అన్నారు. ‘‘మోదీ.. సీఎం, పీఎంగా ఉంటూ గుజరాత్‌లో ఒక్క సంవత్సరంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మేము నియామక పత్రాలు అందించాం’’ అని రేవంత్ అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు ఇస్తే.. ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు నిరసన బాట పడుతున్నారు? అనేది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.
విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తున్నారు. ఉద్యోగాలు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్పడమే తప్ప.. నిరుద్యోగులు మాత్రం తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పట్లేదని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు వరుస నోటిఫికేషన్లు వేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే.. నిరుద్యోగులు మాత్రం ఎక్కడ నోటిఫికేషన్లు? అని ప్రశ్నిస్తున్నారు. విశ్లేషకులు కూడా ఇదే మాట అంటున్నారు. ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పడమే తప్ప.. వాటి భర్తీకి చర్యలు చేపట్టడం లేదని, అది ఎందుకో చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగం.. పరిష్కారం లేని సమస్య: రేవంత్
అయితే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగాన్ని పరిష్కారం లేని సమస్యగా ఆయన అభివర్ణించారు. ‘‘తెలంగాణలో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగ సమస్య సమసిపోదు. దీని తీవ్రతను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. దీంతో 2 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయినా లక్ష మంది నిరుద్యోగులుగానే మిగులుతున్నారు’’ అని రేవంత్ చెప్పారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, పలు పరిశ్రమలతో చర్చలు చేస్తున్నామని చెప్పారు. కానీ ఆ చర్చలు ఎక్కడి వరకు వచ్చాయో మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. అందుకే నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.