తెలంగాణలో రక్షాబంధన్ వేళ ‘వృక్షాబంధన్’ మహోద్యమం, న్యూట్రెండ్
తెలంగాణలో విద్యార్థులు వృక్షాబంధన్ పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు.;
By : Saleem Shaik
Update: 2025-08-09 02:37 GMT
అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచిన రక్షాబంధన్ (Rakshabandhan) వేళ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 1400 పాఠశాలల విద్యార్థులు వృక్షాబంధన్ (Vrikshabandhan)కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ నగరానికి చెందిన వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పలు పాఠశాలల్లో చెట్లను రక్షించండి...పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టారు. చెట్లకు రాఖీలు కట్టడమే కాకుండా ఆయా చెట్లను విద్యార్థులు ఆలింగనం చేసుకొని పరవశించారు. ప్రకృతితో బంధం ఏర్పరచుకునేందుకు వృక్షాబంధన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని బండి ప్రకృతి అనే కళాశాల విద్యార్థిని ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
చెట్లను రక్షించేందుకే...
మొక్కలు నాటక పోయినా, ఉన్న చెట్లను నరకకుండా పరిరక్షించాలనే ఆశయంతో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని (Telangana) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను భాగస్వాములను చేసి వృక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టామని హైదరాబాద్ నగరానికి చెందిన వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వందేమాతరం రవీందర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రక్షాబంధన్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో చెట్లకు రాఖీలు కట్టడమేకాకుండా చెట్లను ఆలింగనం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు ప్రకృతికి మధ్య అనుబంధం ఏర్పడేలా చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 35 శాతం ఉన్న అడవులు రోజురోజుకు తగ్గుతున్నాయని వందేమాతరం రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న చెట్లను పరిరక్షించుకునేందుకే రాఖీపౌర్ణమి వేళ వృక్షాబంధన్ పేరిట కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టామని ఆయన వివరించారు.
ఛత్తీస్‌గడ్ రాష్ట్రం స్ఫూర్తితో...
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ వృక్షాబంధన్ పేరిట చెట్లకు రాఖీలు కట్టే కార్యక్రమం ఆరంభమైంది. హరిత గ్రామాలుగా మార్చేందుకు ప్రజల భాగస్వామ్యం కల్పించేలా చేపట్టిన వృక్షాబంధన్ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రక్షాబంధన్ వేళ శనివారం వృక్షాబంధన్ కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టారు. గతంలో ఈ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలోనూ చేపట్టారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం స్ఫూర్తితో వృక్షాబంధన్ కార్యక్రమాన్ని తెలంగాణలోనూ చేపట్టారు. ఈ ఏడాది ఈ కార్యక్రమం కొత్త ట్రెండ్ గా మారింది.
చెట్లను కాపాడతామని ప్రతిజ్ఞ
రక్షా బంధన్ తరహాలో చెట్లను కాపాడతామని, మరిన్ని చెట్లను నాటుతామని పాఠశాల, కళాశాల విద్యార్థులు శనివారం ప్రతిజ్ఞ చేశారు.ఈ సంవత్సరం 'రక్షాబంధన్'లో భాగంగా 'వృక్షాబంధన్' జరుపుకుంటూ విద్యా సంస్థల్లోని విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టారు.తెలంగాణలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల విద్యార్థులు గత రెండు రోజులుగా చెట్లను రక్షించడానికి తమ సంకల్పాన్ని ప్రదర్శించారు.1970వ సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లో చేపట్టిన చిప్కో ఉద్యమంలో చెట్లను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి చెట్లకు రాఖీలు కట్టారు. హరితహారంలో భాగంగా వివిధ సంస్థల్లో నాటిన మొక్కలను రక్షించడం ఈ వృక్షాబంధన్ కార్యక్రమం లక్ష్యం అని వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు.
చెట్లకు రాఖీలు కట్టినవేళ...
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని మీర్జాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయం, నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ప్రభుత్వ నగర కళాశాల, సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు శుక్రవారం చెట్లకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (CGR),వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగింది. తెలంగాణలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు 13 జిల్లాల్లోని 20 గ్రామాలు వృక్షాబంధన్‌లో పాల్గొన్నాయని వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధి ఆర్ వెంకటేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.‘‘విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సంబంధాన్ని ఏర్పర్చడంతోపాటు రాఖీలు కట్టడం ద్వారా చెట్లతో సంబంధాన్ని ఏర్పరచడం వృక్షాబంధన్ కార్యక్రమం ఉద్దేశ్యం’’ అని వెంకటేష్ పేర్కొన్నారు.