మూర్తి హత్యలో కాల్ డేటానే కీలకమా ?
రాష్ట్రంలో సంచలనంసృష్టించిన రాజలింగంమూర్తి హత్యకు కారణాలను పోలీసులు బయటపెట్టారు.;
రాష్ట్రంలో సంచలనంసృష్టించిన రాజలింగంమూర్తి హత్యకు కారణాలను పోలీసులు బయటపెట్టారు. భూపాలపల్లికి చెందిన సామాజికకార్యకర్త రాజలింగంమూర్తి(Rajalingam Murthy) మూడురోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. అనేక ప్రజాసమస్యలపై తరచూ పోరాటాలు చేస్తున్న మూర్తి హత్య తెలంగాణలో సంచలనం సృష్టించింది. మూర్తి హత్యకు కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish)తో పాటు మాజీఎంఎల్ఏ గండ్ర వెంకటరమణారెడ్డే కారణమని మూర్తి భార్య సరళ, కూతురు ఆరోపించటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatirteddy Venkatareddy) తదితరులు కూడా మృతుడు భార్య ఆరోపణలకు మద్దతుగానే మాట్లాడటంతో రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కిపోయింది.
అయితే హత్యకు సంబంధించి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం వివరించారు. ఎస్పీ చెప్పిందాని ప్రకారం మూర్తి హత్యకు భూ వివాదమే ప్రధాన కారణం. హత్యలో ఏడుగురు కీలకపాత్రదారులుగా గుర్తించినట్లు కూడా చెప్పారు. ఏ1 రేణికుంట్ల సంజీవ్, ఏ2 పింగిలి సీమంత్, ఏ3 మోరె కుమార్, ఏ4 కొత్తూరి కుమార్, ఏ5 రేణికుంట్ల కొమురయ్య, ఏ6 దాసరపు కృష్ణ, ఏ7 రేణికుంట్ల సాంబయ్యల వివరాలను చెప్పారు. భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఏ 8 కొత్త హరిబాబు, ఏ9 పుల్ల నరేష్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. హత్యకు సంబంధించిన లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఖరే చెప్పారు. నిందితుల నుండి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైకులు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపారు. హత్యకు ఇద్దరు రెక్కీచేయగా, నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ ఆరుమంది పరారీలో ఉన్న ఇద్దరితో ఫోన్లో టచ్ లో ఉన్నట్లు కాల్ డేటాలో గుర్తించినట్లు చెప్పారు.
కాళేశ్వరం(Kaleswaram), మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావు కోట్లాదిరూపాయల అవినీతికి పాల్పడినట్లు మూర్తి పెద్ద పోరాటమే చేశారు. ప్రజాధనాన్ని కేసీఆర్, హరీష్ దోచుకున్నారనే ఆరోపణలతో మూర్తి పై ఇద్దరిపైన పోలీసుస్టేషన్లో 2023 అక్టోబర్లో ఫిర్యాదు చేశాడు. అయితే మూర్తి ఫిర్యాదు ప్రకారం కేసీఆర్, హరీష్ పై కేసులు నమోదుచేయటానికి పోలీసులు నిరాకరించటంతో వెంటనే భూపాలపల్లి కోర్టులో ప్రైవేటు కేసువేశాడు. కేసును విచారించిన కోర్టు కేసీఆర్, హరీష్ తో పాటు ఇంజనీర్లకు నోటీసులు జారీచేసింది. ఎప్పుడైతే భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీచేసిందో వెంటనే కేసీఆర్, హరీష్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. తర్వాత పరిణామాల్లో ఇదే కేసు భూపాలపల్లి కోర్టు నుండి హైకోర్టుకు మారింది.
మొన్నటి గురువారం హైకోర్టు తీర్పుచెప్పాల్సుండగా బుధవారం రాత్రి మూర్తి హత్యకు గురయ్యాడు. దాంతో కోర్టు తీర్పుచెప్పటానికి నిరాకరించింది. ఫిర్యాదుదారుడే హత్యకు గురైన తర్వాత ఇక కేసువిచారణ, తీర్పు అవసరంలేదని భావించింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం అభ్యంతరం చెప్పారు. మూర్తి హత్యకు గురైనా ఫిర్యాదుపై జరిగిన విచారణలో తీర్పు చెప్పాల్సిందే అని వాదించారు. విషయం ఎటూ తేల్చకుండా కోర్టు విచారణను వాయిదావేసింది. మూర్తి హత్యకేసులో పట్టుబడిన నిందుతుల ఫోన్ల కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులకు కీలకమైన నెంబర్లతో టచ్ లో ఉన్నట్లుగా సమాచారం దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.