ఆరునెలలు కాల్పుల విరమణ పాటిస్తున్నాం, మావోయిస్టు పార్టీ ప్రకటన
ఒకవైపు భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కాగా, మరో వైపు మావోయిస్టులు ఆరు నెలల పాటు తాము కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించారు.;
By : The Federal
Update: 2025-05-08 18:28 GMT
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు గాలింపును తీవ్రం చేయడంతో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఆరు నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తామని పీపుల్స్ వార్ అధికార ప్రతినిధి జగన్ పేరిట గురువారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో శాంతి చర్చల కమిటీతో శాంతి చర్చలు జరపాలని పీపుల్స్ వార్ డిమాండ్ చేసింది. కగార్ ఆపరేషన్ ను రద్దు చేసి శాంతి చర్చలు జరపాలని తాము డిమాండ్ చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిందని, సీపీఐ కగార్ ఆపరేషన్ రద్దు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో శాంతి చర్చలు జరపాలని తీర్మానం కూడా చేసిందని జగన్ గుర్తు చేశారు.
శాంతి చర్చల డిమాండ్ హర్షించదగింది...
తమతో శాంతి చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకురాలు కవిత డిమాండ్ చేయడం హర్షించతగిందని జగన్ పేర్కొన్నారు. శాంతి చర్చలు జరపాలని మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరుతున్న నేపథ్యంలో తాము వారి ప్రయత్నాలకు సానుకూలంగా ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని మావోయిస్టులు ప్రకటించారు.
పహెల్ గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని భారత త్రివిధ దళాలు చేపట్టాయి. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలను భారత దళాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో పాక్ కవ్విస్తూ దాడులకు తెగబడింది. దీంతో భారత్ పాక్ దాడులను తిప్పికొట్టింది. గురువారం రాత్రి నుంచి భారత్, పాక్ దేశాల సైనికుల దాడుల నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైంది.