Kishan Reddy | ‘తెలుగును చిన్న చూపు చూస్తున్నారు’
తెలుగు భాష ప్రమాదంలో ఉందని, దానిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.;
తెలుగు భాష ప్రమాదంలో ఉందని, దానిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రానురాను తెలుగు కనుమరుగయ్యే పరిస్థితులు కనబడుతున్నాయని, భావితరాలు తెలుగు మర్చిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని మండిపడ్డారు. ఈ తరం యువతకు తెలుగు సంపూర్ణంగా రావడం లేదని, ప్రస్తుత భాష 30 శాతం తెలుగు, 70 శాతం ఆగ్లం మిక్స్‌డ్‌గా ఉందని తెలిపారు. తెలుగు ఎలాగైనా బతికించుకోవాలని, తెలుగు కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. వీటిలో కళాకారులు, ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ఈ వేడుకకు కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష సంకటంలో ఉందని వ్యాఖ్యానించారు.
‘‘ప్రపంచ తెలుగు సమాఖ్య సందర్భంగా వచ్చిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. తెలుగు భాష అత్యంత ప్రాచీన భాష. ఈ భాష గొప్పతనం ప్రపంచదేశాలకు తెలిసేలా తేటతేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా అని పాడతాం. తెలుగులో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత మధురమైన భాష తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణ దేవరాయలు ఊరికే అనలేదు. తెలుగు సాహిత్యానికి కేంద్రం ఎనలేని గౌరవమిచ్చింది. తెలుగు భాషను ఎందరో మహానుభావులు కొత్తపుంతలు తొక్కించారు. నిజాం కాలంలో మన భాష అణచివేతకు గురైంది. అప్పట్లు ఆంధ్ర మహాసభలు నిర్వహించి నిజాం వేసిన నిర్భంధాలను ముక్కలు చేశారు. కొంతమంది మన తెలుగు భాషను చులకనా, చిన్నచూపు చూస్తున్నారు. అది సరైన పద్దతి కాదు’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
‘‘పిల్లలో ప్రతిరోజూ బాల సాహిత్యం చదివించాలి. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోఢీకరించి భావితరాలకు అందించాలి. డిజిటల్ రంగంలో మాతృభాష అభివృద్ధి, సంరక్షణకు దోహదపడాలి. వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కథలు, వ్యాసాలు, కవిత, ఆడియో రూపాలలో కూడా అందుబాటులో ఉంటున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. కాబట్టి తెలుగును కనుమరుగు కాకముందే కాపాడుకోవాలి. కొత్త సాంకేతికత, కార్యక్రమాకులను మాతృభాషలోనే పెట్టాలి. వాడుక భాషలో కేవలం 30శాతమే తెలుగు ఉంది. మిగిలిన 70 శాతం ఇంగ్లీషే ఉంది. మనకు తెలియకుండానే తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పరాంతీయ భాష పరిరక్షణకు పెద్దల సహకారం కావాలి. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలి. కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి’’ అని కిషన్ కోరారు.