OTT Murder |ఓటీటీ ప్రేరణతో జరిగిన హత్యేనా ? పేపర్ పై రాసుకుని చోరీచేసిన బాలుడు
నేరాలుచేసి తప్పించుకునే విధానాలను ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీసుల్లో చూసి తెలుసుకున్నాడు;
ప్రస్తుతసమాజంలో ఓటీటీ కంటెంట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. ఓటీటీ(OTT) కారణంగా జనాలకు ఎంత కాలక్షేపం జరుగుతోందో అంతేస్ధాయిలో నష్టాలు కూడా ఎదురవుతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే హైదరాబాద్(Hyderabad) కుకట్ పల్లిలో సహస్ర(Sahasra Murder Mystery) అనే బాలిక హత్యకేసును శుక్రవారం పోలీసులు ఛేందించారు. అసలేం జరిగిందంటే ఐదురోజుల క్రితం కుకట్ పల్లి 6వ తరగతి చదువుతున్న సహస్ర దారుణ హత్యకు గురైంది. ఎంతదారుణం అంటే బాలికఒంటిపై 20 కత్తిగాట్లున్నాయి. మెడపైన, గొంతుమీద, కడుపులో ఎక్కడబడితే అక్కడ పొడిచి చంపేశాడు. చిన్నపిల్లను ఇంతదారణంగా చంపింది ఎవరు ? చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నది ఇంట్లో వాళ్ళకు, చుట్టుపక్కల వాళ్ళతో పాటు పోలీసులకు కూడా అంతుపట్టలేదు.
అయితే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా హంతకుడిని పట్టుకునేందుకు ఒక ఇంటకి పోలీసులు వెళ్ళారు. ఇంట్లోకి ప్రవేశించి హంతకుడిని పట్టుకున్న పోలీసులకు పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే సహస్రను హత్యచేసింది 10వ తరగతి చదువుతున్న బాలుడు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినపుడు విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే చోరి ఎలా చేయాలి ? ఏదైనా అడ్డంకులు వస్తే ఎలాగ తప్పించుకోవాలి ? అనేఅంశాలను ఒక పేపర్ మీద రాసుకున్నాడు. దొంగతనం చేయటం, తప్పించుకోవటాన్ని పిల్లాడు పేపర్ పైన స్టెప్ బై స్టెప్ రాసుకున్న విధానం చూసి పోలీసులకు షాక్ కొట్టినట్లయ్యింది.
పోలీసుల సమాచారం ప్రకారం విచారణలో పిల్లాడు ఏమిచెప్పాడంటే సహస్ర ఇంటికి ఆనుకునే హంతకుడి ఇల్లుంది. తనింట్లో వాళ్ళు అడిగినంత డబ్బును ఇవ్వటంలేదు. బేకరీలకు వెళ్ళాలి, క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, సినిమాలకు వెళ్ళాలి, హోటళ్ళకు మిత్రులతో కలిసివెళ్ళి జల్సాలు చేయాలన్నది పిల్లాడి కోరికలు. అందుకు తల్లి, దండ్రులు డబ్బులు ఇవ్వటంలేదు. అందుకని ఎక్కడైనా దొంగతనం చేస్తే ఈజీగా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకున్నాడు. దొంగతనం ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని, నేరాలుచేసి తప్పించుకునే విధానాలను ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీసుల్లో చూసి తెలుసుకున్నాడు. అందుకనే ఎక్కడ దొంగతనం చేయాలనా అని ఆలోచించాడు. పక్కనే పెద్దఇంటిని పెట్టుకుని ఇంకెక్కడో దొంగతనం చేయాల్సిన అవసరం ఏముందని అనుకున్నాడు.
ఎందుకంటే సహస్ర తమ్ముడితో కలిసి ప్రతిరోజు హంతకుడు క్రికెట్ ఆడుతుంటాడు కాబట్టి ఈఇంటికి తరచు వెళ్ళే అలవాటుంది. కాబట్టి సహస్ర ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నాడు. ఐదురోజుల క్రితం బాలిక తల్లి, దండ్రులు ఇంటినుండి బయటకు వెళ్ళటంచూశాడు. వెంటనే సహస్ర ఇంట్లో చొరబడి దొంగతనం చేయాలని అనుకున్నాడు. హంతకుడి అదృష్టం ఇంటి తలుపులు తీసి ఉండటంతో వెంటనే ఇంట్లోకి దూరాడు. ఇల్లంతా తిరిగి పూజగదిలో డబ్బుండటాన్ని గమనించాడు. వెంటనే పూజగదిలోకి దూరి లెక్కపెడితే రు. 80 వేలుంది. వెంటనే దాన్ని తీసుకుని పూజగదిలో నుండి బయటకు వచ్చాడు.
అయితే హంతకుడు ఊహించని విషయం ఏమిటంటే ఇంట్లో సహస్ర ఉంది. స్కూలుకు సెలవు కావటంతో ఆరోజు బాలిక ఇంట్లోనే ఉంది. హంతకుడిని చూసి వెంటనే బాలిక గట్టిగా అరిచింది. వెంటనే హంతకుడు ఒక్కసారిగా బాలిక మీదకు దూకి గట్టిగా కొట్టాడు. కిందపడిన బాలిక మరింత గట్టిగా అరిచింది. దాంతో వెంట తెచ్చుకున్న కత్తితో హంతకుడు బాలికను ఇష్టం వచ్చిన చోట్ల పొడిచేశాడు. అన్ని పోట్లు పొడిచినా అనుమానం వచ్చిన హంతకుడు చివరగా సహస్ర గొంతును కత్తితో కోసేశాడు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కాసేపు అక్కడే ఉండి మెల్లిగా బయటకు వచ్చాడు. ఇంటి బయటకు వచ్చినా వెంటనే వెళ్ళకుండా హంతకుడు బయటే కాసేపు నక్కి కూర్చున్నాడు. బాలిక అరుపులను ఎవరైనా విన్నారా ? వస్తున్నారా అన్న అనుమానంతోనే హంతకుడు ఇంటిముందే కాసేపు నక్కి కూర్చున్నాడు.
తర్వాత హంతకుడు బయటకు వెళ్ళిపోయి ఏమీ ఎరగనట్లే మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకోవటం మొదలుపెట్టాడు. తర్వాతెప్పుడో ఇంటికి వచ్చిన తల్లి, దండ్రులు కూతురు రక్తపుమడుగులో పడివుండటాన్ని గమనించి షాక్ తిన్నారు. తర్వాత పోలీసులకు సమాచారం వెళ్ళటం, వాళ్ళు రంగప్రవేశంచేయటం అంతా రొటీన్ గా జరిగిపోయింది. ఐదురోజులుగా ఎన్ని ఆధారాల కోసం వెతికినా పోలీసులకు ఏమీ దొరకకపోవటంతో హత్యకేసు మిస్టరీగా తయారైంది. అయితే ఊహించని రీతిలో శుక్రవారం పోలీసులకు ఒక సమాచారం అందింది.
అదేమిటంటే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోలీసులకు ఫోన్ చేసి హంతకుడు ఎవరో తనకు తెలుసని చెప్పాడు. ఐదురోజుల క్రితం తాను ఏమిచూశాడో వివరించాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెప్పిందాని ప్రకారం హంతకుడు సహస్ర ఇంట్లోకి వెళ్ళటం చూశాడు, కాసేపటి తర్వాత బయటకు రావటమూ చూశాడు. అదే విషయాన్ని పోలీసులకు వివరించాడు. దాంతో పోలీసులు ఈరోజు ఉదయం హంతకుడు ఇంటికి వెళ్ళి గట్టిగా విచారించటంతో అన్నీ విషయాలను బాలుడు బయటకు చెప్పేశాడు. దాంతో హత్యకేసు మిస్టరీ విడిపోవటంతో విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు ఒక్కసారిగా షాకయ్యారు.