బస్సు ప్రమాదానికి డ్రైవర్ చెప్పిన కారణం ఏమిటో తెలుసా ?

బస్సు, మోటారుసైకిల్ లో దేన్ని ఏది ఢీకొన్నా ప్రమాదానికి కారణమైతే మోటారుసైకిలే అని అందరు నిర్ధారించేశారు

Update: 2025-10-25 09:32 GMT
Kurnool bus accident

కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు అధికారులతో పాటు అందరు అనుకుంటున్న కారణానికి బస్సురెండో డ్రైవర్ భిన్నమైన వాదన వినిపించాడు. కర్నూలు(Kurnool bus accident) శివార్లలోని చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 20 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణం మోటారుసైకిల్ అని అందరికీ తెలిసిందే. అయితే బస్సు మోటారుసైకిల్ ను ఢీకొన్నదా లేకపోతే మోటారుసైకిలే బస్సును ఢీకొన్నదా అన్న విషయంలో ఇప్పటివరకు క్లారిటిరాలేదు. బస్సు, మోటారుసైకిల్ లో దేన్ని ఏది ఢీకొన్నా ప్రమాదానికి కారణమైతే మోటారుసైకిలే అని అందరు నిర్ధారించేశారు. బస్సు-మోటారుసైకిల్ ఢీకొన్నపుడు బైక్ మీదున్న శివశంకర్ ఎగిరి రోడ్డుకు అవతల పడిపోయి చనిపోయాడని ఉన్నతాధికారులతో పాటు అందరు భావించారు.

బస్సులో ఇద్దరు డ్రైవర్లున్నారు. ఒక డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అయితే రెండో డ్రైవర్ శివ. ప్రమాదానికి గురైనపుడు బస్సు నడుపుతున్నది లక్ష్మయ్య. ప్రమాదం జరగ్గానే మిరియాల పరారయ్యాడు. శివమాత్రం పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల విచారణలో రెండో డ్రైవర్ శివ వాదన అందరి అంచనాలకు వ్యతిరేకంగా ఉంది. అదేమిటంటే ప్రమాదస్ధలానికి బస్సు చేరుకునేటప్పటికే రోడ్డుపైన మోటారుసైకిల్ పడుందట. తాము యాక్సిడెంట్ స్పాట్ కు చేరుకునేముందే ఇంకేదో వాహనం మోటారుసైకిల్ ను ఢీకొన్నట్లు రెండో డ్రైవర్ చెప్పాడు. ఇంకేదో వాహనం ఢీ కొనటంతోనే బైకుమీదున్న యువకుడు ఎగిరి రోడ్డుపక్కన పడిపోవటాన్ని తాము గమనించామని కూడా చెప్పాడు.

అయితే దగ్గరకు వచ్చేంతవరకు రోడ్డుమీద పడున్న మోటార్ సైకిల్ ను లక్ష్మయ్య చూసుకోలేదని శివ చెప్పాడు. సడెన్ గా బైక్ కనిపించగానే ఏమిచేయాలో లక్ష్మయ్యకు తోచలేదు. సడెన్ బ్రేకులు వేస్తే ప్రమాదం జరిగే అవకాశముందన్న కారణంగానే లక్ష్మయ్య బస్సును మోటారుసైకిల్ మీదనుండి పోనిచ్చాడు. అయితే బైక్ బస్సుకింద ఇరుక్కుపోవటంతో ఎక్కువదూరం వెళ్ళలేకపోయినట్లు శివ పోలీసుల విచారణలో చెప్పాడు. తమ బస్సే గనుక మోటారుసైకిల్ ను గుద్దుంటే శివశంకర్ కూడా బస్సు కిందపడి నుజ్జునుజ్జయే వాడని శివ చెప్పాడు. విచారణలో శివ చెప్పింది విన్న తర్వాత ప్రమాదానికి కారణం ఏమిటనే విషయంలో పోలీసుల్లోనే అయోమయం మొదలైంది. ఏదేమైనా పోలీసులు లక్ష్మయ్యపైన కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Tags:    

Similar News