కావేరీ బస్సు భగ్గుమనడానికి ఆ 234 స్మార్ట్ ఫోన్లే కారణమా?
రూ.46 లక్షల విలువైన ఈ ఫోన్లను బుక్ చేసిన ఆ వ్యాపారి ఎవరు?
By : The Federal
Update: 2025-10-25 07:37 GMT
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్‌లోకి వందలాది మొబైల్ ఫోన్లు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇవి పేలడం వల్ల కూడా ప్రమాద తీవ్రత పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. భారీ ప్రాణ నష్టానికి ఈ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీలు కూడా కారణమై ఉండవచ్చునని ఫోరెన్సిక్ బృందాలు చెబుతున్నాయి.
‘తొలుత బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్రవాహనం ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 234 స్మార్ట్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఒక్కసారిగా పేలింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు’ అని ఘటన స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి.
ఈ మొబైల్ ఫోన్ల పార్శిల్ బెంగళూరులోని ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు చేరాలి. అక్కడి నుంచి కస్టమర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేయాల్సి ఉంది.
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో మొత్తం 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో మోటార్ సైక్లిస్ట్ కూడా చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా ఈ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 234 స్మార్ట్‌ఫోన్ల సరుకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా మొబైల్ ఫోన్ల పై భాగాన్ని ప్లాస్టిక్‌తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమైంది.
ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ప్రకారం, ఆ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లే మంటలు మరింత వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని ఆవహించాయి. అందువల్లే 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారని తేలింది.
రూ.46 లక్షల విలువైన మొబైల్ సరుకు..
ఈ 234 స్మార్ట్‌ఫోన్ల విలువ సుమారు రూ.46 లక్షలు. వీటిని హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి మంగనాథ్ అనే వ్యక్తి పార్సిల్‌గా పంపించారు. ఈ సరకు బెంగళూరులోని ఈ–కామర్స్ సంస్థకు చేరాలి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, బస్సులో మంటలు చెలరేగినప్పుడు బ్యాటరీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ పీ. వెంకటరమణ కథనం ప్రకారం స్మార్ట్ ఫోన్ల పేలుళ్లతో పాటు బస్సులోని ఎయిర్‌కండీషనింగ్ వ్యవస్థకు ఉపయోగించిన ఎలక్ట్రికల్ బ్యాటరీలు కూడా పేలాయి. వేడి పెరగడంతో బస్సు కింది భాగంలోని అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని ఆయన తెలిపారు.
మొదట మంటలు బస్సు ముందు భాగంలోనే ఇంధన లీకేజీ వల్ల చెలరేగాయని చెప్పారు. ఒక మోటార్‌సైకిల్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో పెట్రోల్ చిమ్మి, వేడి లేదా స్పార్క్ కారణంగా మంటలు రగిలి, క్షణాల్లో బస్సు మొత్తాన్ని మంటలు ఆవరించాయని వివరించారు.
నిబంధనలకు విరుద్ధంగా సరకు రవాణా
ప్రయాణీకుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాలను సరకు రవాణా కోసం వాడేస్తున్నాయి. వాటిని లగేజీ క్యాబిన్‌లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడంవల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది.