మునుగోడు మద్యం షాపులకు భారీగా తగ్గిన దరఖాస్తులు
అక్కడ రాజగోపాల్ రెడ్డి చెప్పిందే రాజ్యాంగమా
నల్గొండ జిల్లా మునుగోడు లిక్కర్ అమ్మకాల మీద శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆంక్షలు విధించిన ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆయన ఆ మధ్య నియోజకవర్గంలోని మద్యం షాపులకు ప్రకటించిన సొంత నియమాలు ప్రకటించారు. దీనితో 2025-27 సంవత్సరాలకు లిక్కర్ షాపుల నిర్వహణకు దాఖలైన దరఖాస్తుల సంఖ్య 37 శాతం తగ్గాయి. తన హెచ్చరికలు ఫలించడంతో రాజగోపాల్ రెడ్డి మద్యం షాపుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.
నియోజకవర్గంలోని 29 మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య గత టెండర్లతో పోల్చుకుంటే తగ్గాయి. మరొకవైపు రాజగోపాల్ రెడ్డి అనుచరులు నియోజకవర్గంకు నిధులు ఇవ్వకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండికొడతాం అంటూ సామాజిక మాధ్యమాల్లో హెచ్చరికలను సైతం జారీ చేశారు.
2005-2007 మద్యం షాపుల అనుమతులకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో మునుగోడు నియోజకవర్గం చివరి స్థానంలో ఉందని చెప్పవచ్చు.
రాజగోపాల్ లిక్కర్ నియాలు
తన నియోజకవర్గంలో మద్యం షాపులు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలని రాజగోపాల్ రెడ్డి అక్టోబర్ పద్నాలుగున ఆదేశాలు జారీ చేశారు. సిటింగ్ రూమ్ లకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేర్చిన విషయం గుర్తు చేస్తూ తన నిర్ణయం దానికి అనుకూలంగానే ఉందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఆయన గత ఏడాడే బెల్టుషాపులను మూసేయించారు. ఊరికి దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.
ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సైతం తన నియోజకవర్గంలోని మద్యం షాపులకు టెండర్లు వేయవద్దని హెచ్చరించారు. మద్యం దుకాణాలకు నియోజకవర్గంలోని మండలాలకు చెందిన వ్యాపారులే టెండర్లు వేయాలని ఆయన నియమం పెట్టారు.
బెల్ట్ షాపులు లేని గ్రామాల అభివృద్ధికి 5 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తానని ప్రకటించాడు. ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అదనంగా ప్రజల ఆరోగ్యం కోసం ఇవి తన సొంత నిబంధనలు అని ఆయన బాహటంగా స్పష్టం చేశారు.
ఇవన్నీ కలుపుకొని మునుగోడు నియోజకవర్గంలోని మద్యం షాపులకు టెండర్లను తగ్గించాయని చెప్పవచ్చు.
2003-2005 సంవత్సరాలకు గాను మద్యం షాపులకు దాఖలైన దరఖాస్తుల సంఖ్య 1,499, అవి 2025-27 సంవత్సరాలకు 932 తగ్గాయి. ఒక్క గట్టుపల్ మద్యం షాపుకు మినహా మరి ఏ ఇతర మద్యం షాప్ కు 23 మించి దరఖాస్తులు రాలేదు. ఇది రాజగోపాల్ రెడ్డి హెచ్చరికల ప్రభావాన్ని చెప్పకనే చెబుతుంది.
మునుగోడు నియోజకవర్గం లోని మద్యం షాపు లకు ఎక్సైజ్ శాఖ స్వీకరించిన దరఖాస్తులు:
తన హెచ్చరికలు కొంతవరకు ఫలించిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మద్యం షాపుల విషయంలో తనదైన దూకుడుతో ముందుకు పోయే అవకాశం మెండుగా ఉంది. అవసరమైతే ఎక్సైజ్ శాఖ కమిషనర్ తో మాట్లాడతానని, తన ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేయవద్దని స్థానిక ఎక్సైజ్ అధికారులకు ఆయన చెప్పారు. ఇది మద్యం షాపుల యజమానులకు జీర్ణించుకోలేని అంశంగా తయారయింది. ఈ నిబంధనలు అమలు అయితే తమకు నష్టాలే తప్ప, లాభాలు వచ్చే అవకాశం లేదని లిక్కర్ షాప్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి నిబంధనలపై ప్రభుత్వ అధికారుల నుండి సైతం ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. ఎందుకంటే, రాజగోపాల్ రెడ్డిని ఎదిరించడం చాలాకష్టం. ఈ నిర్ణయాలు ప్రభుత్వానికి ఇబ్బంది కరమే అయినా, ప్రజల్లో మద్దుతు కూడగట్టే విషయమే. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించాారు. అధిష్టానం కూడా హామీ ఇచ్చింది. తొలినుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న నాయకుడు ఆయన. అందువల్ల ఆయనకు మంత్రి పదవి ఇచ్చి రేవంత్ కొరివితో తల గోక్కోలేడు. అయితే, తెలివిగా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఒక కుటుంబానికి ఒకే మంత్రి పదవి నియమం ముఖ్యమంత్రి అమలు చేసేశాడు. ఇది రాజగోపాల్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. అందుకే నియోజకవర్గం తానే రాజు అన్నట్లు వ్యవహారిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు ఈ నియోజకవర్గంలో పర్యటించకపోవడానికి కూడా ఇదే కారణం అని చెబుతారు.