తెలంగాణ సర్కార్‌కు మరోసారి హైకోర్టు మొట్టికాయలు..
ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.
మద్యం దుకాణాల దరఖాస్తుల తేదీ పొడిగింపు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇష్టం వచ్చినట్లు తేదీలు పొడిగిస్తా, ఇష్టారాజ్యం చేస్తా అంటే చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. అబ్కారీ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల తేదీ అక్టోబర్ 18తో ముగిసింది. కానీ అప్పటికి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఆ తేదీని పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన డీ వెంకటేశ్వరరావుతో పాటు మరో నలుగురు మద్యం వ్యాపారులు.. ఈ పొడిగింపును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే న్యాయస్థానం అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం సరికాదని చెప్పింది. ఇలానే చేస్తే మొత్తం దరఖాస్తులను రద్దు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎలా..?
నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఎలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అసలు ఏ నిబంధన మేరకు గడువు పెంచారో చెప్పాలని జస్టిస్ తుకారాంజీ ప్రశ్నించారు. చెప్పని పక్షంలో లిక్కర్ షాపుల ఎంపికను నిలిపివేయాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా అసలు ప్రభుత్వం గడువు పెంచితే తప్పేంటి అని పిటిషనర్లను ప్రశ్నించారు. దరఖాస్తులు తీసుకోవద్దని ఎలా చెప్తారని అడిగింది. అయితే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఇరు వర్గాల వాదనలు న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈకేసులో వాదనలు ముగిసే వరకు లిక్కర్ షాపుల ఎంపిక ప్రక్రియను ఆపడమో, లేదా అక్టోబర్ 18ని కటాఫ్ తేదీగా తీసుకోవడమే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది..
మద్యం దుకాణాల దరఖాస్తు రుసుమును తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. అంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత డ్రాలో పేరు వచ్చినా రాకపోయినా ఈ నగదు తిరిగి రాదు. అదే రుసుముతో ఆగస్టు 20న రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్స్‌లకు దరఖాస్తులను కోరుతూ అబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణలను అక్టోబర్ 18 వరకు స్వీకరిస్తామని, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా లైసెన్స్ పొందేవారిని ఎంపిక చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తు రుసుము పెంచడంతో భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు.
గతేడాది 1.20 లక్షల దరఖాస్తులు వస్తే ఈ ఏడాది నిర్ణీత సమయం ముగిసే సమయానికి సుమారు 89,343వేల దరఖాస్తులే వచ్చాయి. దీంతో దరఖాస్తుల స్వీకరణ తేదీని 23 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా లక్కీ డ్రా జరగాల్సిన తేదీని 27కు మార్చింది. ఈ గడుపు పొడిగింపు నిర్ణయం తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టంలోని నిబంధన 12(5)కు విరుద్ధం. ఒక్కసారిగా తేదీని పెంచడంతో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమకు నష్టాన్ని మిగిల్చే అవకాశాలను పెంచాయని, లక్కీ డ్రాలో గెలిచే అవకాశాలు తగ్గించాయని పేర్కొన్నారు.
పొడిగింపుతో లాభం పెద్దగా లేదు..: ఏఏజీ
ఈ కేసులో ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్(AAG) ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. దరఖాస్తుల స్వీకరణ తేదీని అక్టోబర్ 18 నుంచి 23 వరకు పొడిగించడం వల్ల పెద్దగా వచ్చిన లాభం లేదని అన్నారు. ఆ సమయంలో కేవలం 5,793 దరఖాస్తులే వచ్చాయని, అక్టోబర్ 18 నాటికి మొత్తం 89,343 దరఖాస్తులు వచ్చాయని న్యాయస్థానానికి తెలిపారు. ‘‘గడుపు పెంచడం అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. పరిస్థితులను బట్టి గడువును పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దుకాణాల కేటాయింపుపై స్టే ఇవ్వొద్దు. మొత్తం ప్రక్రియపై స్టే విధిస్తే అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తుకారాంజీ.. తీర్పును రిజర్వ్ చేశారు.