తప్పు అంగీకరించి క్షమాపణలు చెప్పిన కవిత

అమరవీరుల కుటుంబాల తరపున గతంలో తాను గట్టిగా కొట్లాడలేకపోయినట్లు అంగీకరించారు.

Update: 2025-10-25 06:53 GMT
Kalvakuntla kavitha

ఇంతకాలానికి అదీ అవసరం వచ్చింది కాబట్టి కల్వకుంట్ల కవిత అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పుకున్నారు. శనివారం ఉదయం కవిత(Kavitha) జనంబాట(Janambata) కార్యక్రమం మొదలైంది. ఈసంరద్భంగా నగరంలోని అమరవీరుల స్ధూపం దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఇన్నేళ్ళ తన రాజకీయంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా పోరాడలేకపోయినట్లు అంగీకరించి క్షమాపణలు చెప్పుకున్నారు. ‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తాను క్షమాపణలు కోరుకుంటున్నాన’’ని అన్నారు. అమరవీరుల కుటుంబాల తరపున గతంలో తాను గట్టిగా కొట్లాడలేకపోయినట్లు అంగీకరించారు.

అందుకనే ఇపుడు ప్రతి కుటుంబానికి పరిహారంగా కోటిరూపాయలు ఇవ్వాలని డిమండ్ చేశారు. జాగృతి ఆధ్వర్యంలో మొదలైన జనంబాటలో అందరినీ కలుస్తానని చెప్పారు. 33జిల్లాల్లో అన్నీవర్గాలను కలుసుకోబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులైనట్లు చెప్పారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలను నెరవేర్చటంలో ఎంతముందుకు వెళ్ళామో అందరు ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది అమరులైనట్లు అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అమరుల కటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయినట్లు కవిత అంగీకరించారు.

580 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పారు. ఉద్యమకారులకు ఎంఎల్ఏ, ఎంపీ, ఎంఎల్సీ సీట్లు, కొన్ని ఎంపీపీ, జడ్పీటీసీ టికెట్లు వచ్చినట్లు తెలిపారు. కాని అమరుల కుటుంబాలకు అందరికీ అనుకున్న మేర న్యాయంచేయలేకపోయినట్లు చెప్పారు. తాను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగినట్లు తెలిపారు. ఉద్యమకారుల కుటుంబాలన్నింటికీ న్యాయం జరిగేవరకు కొట్లాడలేకపోయినందుకే ఇపుడు బహిరంగక్షమాపణ చెబుతున్నట్లు కవిత వివరించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు, బీఆర్ఎస్ నుండి కవిత బయటకు వచ్చేంతవరకు కవితకు అమరుల కుటుంబాలు గుర్తుకురాలేదు. కేసీఆర్, కేటీఆర్ తో విభేదించి పార్టీని థిక్కరించి కవిత సస్పెండ్ అయి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సొంతంగా రాజకీయాల్లో తనఉనికిని చాటుకోవటానికి కవిత తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగమే ఇపుడు జనంబాట పేరుతో రాష్ట్ర పర్యటన. జనంబాట కార్యక్రమం లేకపోతే ఇపుడు కూడా కవిత అమరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పుకునేవారు కాదు.

తెలంగాణ ఉద్యమకాలంలో అమరులకుటుంబాలకు కేసీఆర్ చాలా హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిల్లో ఎన్నినెరవేర్చారన్న విషయం కవితకు బాగా తెలుసు. అలాగే అమరుల కుటుంబాల్లో తొమ్మిదిన్నరేళ్ళ అధికారంలో కేసీఆర్ ఒక్కళ్ళని కూడా దగ్గరకు రానీయలేదు. అప్పట్లో కవిత కూడా అమరుల కుటుంబాలకు మద్దతుగా ఒక్కసారికూడా మాట్లాడలేదు. ఇపుడు రాజకీయంగా సొంతకుంపటి పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి జనాల మద్దతుకోసమే అమరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పుకున్నారు. అమరుల కుటుంబాలకు పరిహారంగా కోటిరూపాయలు డిమాండ్ చేసిన కవిత అప్పట్లో ఎందుకు తన తండ్రి కేసీఆర్ ను అడగలేదో సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News