ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఇక వారికీ ప్రాక్టికల్స్
ఇంటర్ పరీక్షల విధానాల్లో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షలకు అధికారులు సన్నాహాలు షురూ చేశారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్, టైమ్ టేబుల్ వంటి వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆమోదంతో ఇంటర్ మీడియట్ బోర్డు.. పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా ఈసారి ఇంటర్ మీడియాట్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. దాంతో పాటు ప్రాక్టికల్స్, పరీక్షల్లో చేస్తున్న మార్పులను ఆయన వివరించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3న ప్రారంభమవుతాయని తెలిపారు. ‘‘ఇకపై ఇంటర్ తొలి సంవత్సరంలో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్‌లో ఉన్నట్లు గానే ప్రాక్టికల్స్‌ను ఇతర భాషల్లో కూడా నిర్వహిస్తాం. ప్రాక్టికల్స్ నిర్వహణ పాత విధానంలోనే జరుగుతుంది’’ అని అయన చెప్పారు.
‘‘ఈసారి తెలంగాణ వ్యాప్తంగా 9.50లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. సీఎం ఆదేశాలతో డిజిటల్ కంటెంట్‌లోకి ప్రతి చాప్టర్‌ను మారుతుస్తున్నాం. ఇంటర్ సిలబస్‌లో దాదాపు 12 ఏళ్ల తర్వాత మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో మొత్తం ఆరు మార్పులు తీసుకొచ్చాం. ప్రతి సబ్జెక్ట్‌ను 80:20 నిష్పత్తిలో విభజిస్తున్నాం. గణితశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సిలబస్‌ను మారనున్నాయి’’ అని వెల్లడించారు. NCERT సబ్జెక్ట్ కమిటీ సూచనల ప్రకారం ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ఆదిత్య వివరించారు. సిలబస్ మార్పులో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు భాగస్వాములవుతారని చెప్పారు.
‘‘డిసెంబర్ 15 నాటికి కొత్త సిలబస్‌ను తెలుగు అకాడమీకి అందిస్తాం. కొత్త సిలబస్‌తో పాటు క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ కూడా ఉంటుంది. ఈ కొత్త సిలబస్ పుస్తకాలు ఏప్రిల్ ఆఖరి వారంలో అందుబాటులోకి వస్తాయి. ప్రాక్టికల్స్ విషయంలో కామర్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సు తీసుకురానున్నాం. 2026 నుంచి ఏసీఈ గ్రూప్ ప్రారంభమవుతుంది. అకౌంటెనసీ గ్రూప్‌కు చెందిన అంశాలపై కమిటీని ఏర్పాటు చేయనున్నాం’’ అని చెప్పారు.