‘మూసీ ప్రక్షాళన ఓ దోపిడీ దందా’
ప్రభుత్వం అంచనాలను పెంచి ఢిల్లీకి మూటలు మోస్తోందన్న కేటీఆర్.;
కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తున్న మూసీ ప్రక్షాళన అంతా ఒక దోపిడీ దందా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును అబద్ధపు ప్రాజెక్ట్‌ల పేరిట ఢిల్లీకి తరలిస్తున్నారంటూ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారని, మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశారని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం దానిని పక్కనబెట్టి.. కొత్త ప్లాన్ పేరుతో అంచనాలను అమాంతం పెంచేసి సరికొత్త దోపిడీకి పాల్పడిందంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా గోదావరి నీళ్లను హైదరాబాద్ కి దగ్గర్లోని కొండపోచమ్మ సాగర్ కి తెచ్చింది కెసిఆర్ ప్రభుత్వం. కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేట చెరువుకి గోదావరి నీళ్లను తేవడానికి 2022 లోనే ₹ 1,100 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం ఇచ్చింది కెసిఆర్ ప్రభుత్వం. మూసి నదికి చేరే 2000 MLD మురికి నీటిని శుద్ధి చెయ్యడం కోసం మొత్తం 36 STPల (Sewerage Treatment Plant) నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది కెసిఆర్ ప్రభుత్వం’’ అని చెప్పారు.
‘‘5 కిలోమీటర్స్ మూసి లో నాగోల్ ప్రాంతంలో సుందరీకరణ చేసింది, మూసి నది ఒడ్డున ఉప్పల్ భాగాయత్ లో శిల్పారామం ఏర్పాటు చేసింది కెసిఆర్ ప్రభుత్వం. మొత్తం రంగమంతా కెసిఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి, ₹ 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, DPR తయారు చేస్తే స్కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ ని ₹ 1,50,000 ఒక లక్ష యాభై వేల కోట్లకు పెంచి తెరలేపిన మహా దోపిడీని ముమ్మాటికీ ఎండగడుతాం . మీరు చెయ్యబోతున్న ప్రజా ధనం దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటాం’’ అని హెచ్చరించారు.
‘‘ఢిల్లీకి మూటలు పంపుతూ పదవిని కాపాడుకోవడానికే మీరు పడుతున్న తాపత్రయం, దానికి నగర అభివృద్ధి అనే అందమైన ముసుగు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒక వైపు నోరు తెరిస్తే కాళేశ్వరం కూలిపోయింది అని పచ్చి అబద్దాలు చెబుతూ మరోవైపు అదే కాళేశ్వరం లో అంతర్భాగం అయిన కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీటిని తీసుకుంటాం అని చెప్పడం కూడా విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారు.