తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతుంది?
గురుకులాల్లో 886 మంది విషాహారం తిని అస్వస్థత, 48 మంది విద్యార్థుల మృతి;
By : Saleem Shaik
Update: 2025-08-01 02:28 GMT
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 111 మంది విద్యార్థులు విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి కూడా అయిన సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు.
- జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెంలలో హాస్టల్ విద్యార్థులు విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారు.హుస్నాబాద్ బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికాయి.
- గురుకుల పాఠశాలల్లో తమకు పట్టెడన్నం, తాగునీళ్ల కోసం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా జిల్లా కలెక్టరు కార్యాలయానికి వెళ్లిన విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు.
తెలంగాణలో 886 ఫుడ్ పాయిజనింగ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో (Telangana Gurukul schools)ఫుడ్ పాయిజనింగ్ కేసులపై (Eating poisoned food) జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission) కన్నెర్ర చేసింది.గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు.తెలంగాణ రాష్ట్రంలోని 1,023 గురుకుల పాఠశాలల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 886 విషాహార సంఘటనలు జరిగాయి. వందలాది మంది విద్యార్థులు పుడ్ పాయిజనింగ్ కు గురై ఆసుపత్రుల్లో చేరారు.చదువుకోవాలనే ఉన్నతాశయంతో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరి విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు.
48 మంది గురుకుల విద్యార్థుల మృతి
గురుకుల పాఠశాలల్లో విషాహారం తిని, పాము కాట్లకు గురై 48 మంది విద్యార్థులు మరణించారు. దీనిపై నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని కోరింది.ఈ కేసులో ఐదు గురుకుల పాఠశాలల కార్యదర్శులను నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై ఏం చేస్తున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలదీసింది.
బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలు
చదువుకొని అభివృద్ధిలోకి వస్తాడని తమ పిల్లల్ని గురుకుల పాఠశాలతో చేర్పిస్తే విషాహారం తిని మృత్యువాత పడ్డాడని, పాము కాటుకు గురై చనిపోయాడని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.తెలంగాణలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అనుమానిత ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 800 మందికి పైగా పిల్లలు అనారోగ్యానికి గురైనట్లు వచ్చిన నివేదికలను దర్యాప్తు చేసి వివరణాత్మక నివేదికను సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల శిబిరం సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
109 కేసులపై ఎన్ హెచ్ ఆర్సీ విచారణ
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రెండు రోజుల ఓపెన్ హియరింగ్, క్యాంప్ సిట్టింగ్‌ను హైదరాబాద్‌లో చేపట్టి 109 కేసులపై విచారణ జరిపింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 109 కి పైగా మానవ హక్కుల ఉల్లంఘనల కేసులను విచారణకు స్వీకరించింది.కమిషన్ 9 కేసుల్లో సిఫార్సు చేసిన రూ. 49.65 లక్షల్లో, రూ. 22.50 లక్షలు తెలంగాణ ప్రభుత్వం బాధితులకు చెల్లించింది. మిగిలిన రూ. 27.15 లక్షలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది.జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్, సభ్యులు, జస్టిస్ (డాక్టర్) బిద్యుత్ రంజన్ సారంగి,విజయ భారతి సయాని కేసులను విచారించారు. సెక్రటరీ జనరల్ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (దర్యాప్తు) ఆర్.పి. మీనా, రిజిస్ట్రార్ (లా) జోగిందర్ సింగ్ , కమిషన్ అధికారులు హాజరయ్యారు.
ఎన్నెన్నో కేసులపై విచారణ
ఎన్ హెచ్ ఆర్సీ ఓపెన్ హియరింగ్ సందర్భంగా కమిషన్ పలు కేసులను విచారించింది. ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల కారణంగా పిల్లల మరణం, నివాస ప్రాంతాల్లో వీధికుక్కల బెడద పెరగడం, అగ్నిప్రమాదంలో మరణించడం, పులుల దాడుల కేసులు, గిరిజన మహిళల అక్రమ రవాణా, గిరిజన కుటుంబాలను బలవంతంగా బహిష్కరించడం, ప్రాథమిక మానవ సౌకర్యాల నిరాకరణ, అత్యాచారం వంటి మహిళలపై నేరాలు, పిల్లలపై నేరాలు, పోలీసు దురాగతాలు, ఆత్మహత్య మరణాలు, దళిత బంధు పథకం నిధుల దుర్వినియోగం, కుటుంబ పెన్షన్ కేసులు, ప్రాథమిక పాఠశాలలు లేకపోవడం, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్,పోషకాహార లోపం కేసులు, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై కమిషన్ దర్యాప్తు చేసింది.
గురుకులాల్లో కలుషిత ఆహారమా?
అందాల పోటీల్లో ప్లేటు భోజనానికి లక్ష రూపాయలు చెల్లించి,గురుకులాల్లో మాత్రం విద్యార్థులకు కలుషిత ఆహారం ఇస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు మార్చడం అంటే గురుకులాల పిల్లలను పొట్టన పెట్టుకోవడమా అని ఆయన ప్రశ్నించారు.బీసీ హాస్టల్లో ఇంకా బెడ్‌షీట్స్ రాలేదని, కాస్మోటిక్ బిల్లులు రాలేదని, కొన్ని హాస్టళ్లలో ఇంకా విద్యార్థులకు బట్టలు కూడా రాలేదని ఆయన ఆరోపించారు.