గాంధీభవన్ లో ‘గాంధియన్’

తెలంగాణ కాంగ్రెస్ లో బీబీ (బుకె, భజన) కల్చర్ వద్దంటున్నది. ఇంతకీ మీనాక్షి నటరాజన్ ఎవరు?;

Update: 2025-03-02 08:11 GMT
Telangana In charge Meenakshi Natarajan

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో టాక్ ఆప్ ది టాపిక్ ఏమిటో తెలుసా ? కొత్తగా నియమితులైన మీనాక్షి నటరాజనే(Meenakshi Natarajan). తెలంగాణ ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి శుక్రవారం హైదరాబాదు వచ్చారు. మీనాక్షి వచ్చిన సందర్భంగా పార్టీ ఆఫీసు గాంధీభవన్లో(Telangana Gandhi Bhavan) విస్తృతస్ధాయి సమావేశం జరిగింది. ఆసమావేశంలో సీనియర్లకు వార్నింగులు, మార్గనిర్దేశం, ఏకతాటిపై నడవాల్సిన అవసరం, ప్రభుత్వం, పార్టీసమన్వయంతో పనిచేయాల్సిన అవసరం లాంటి అనేక అంశాలను స్పష్టంగా చెప్పారు. మీనాక్షి మాట్లాడిన తీరు, వ్యక్తిత్వంపై నేతలు, క్యాడర్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. తనరూటే సపరేటు అన్నట్లుగా మీనాక్షి వ్యవహరించారు. మీనాక్షి అంటే అసలు, సిసలు గాంధేయవాదానికి ప్రతిరూపంగా పార్టీలో చర్చ జరుగుతోంది. గాంధేయవాదాన్ని బలంగా నమ్ముతారు కాబట్టే అంత సింపుల్ గా ఉంటారని పార్టీలో టాక్.


ఇందులోభాగంగానే ఢిల్లీ(Delhi) నుండి ఆమె రైలులో హైదరాబాదు(Hyderabad)కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నస్ధాయి నేతలుకూడా హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళలాంటే విమానంలోనే వెళుతున్నారు. అలాంటిది అధికారంలో ఉన్నపార్టీకి ఇన్చార్జి, మాజీ ఎంపీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి అత్యంత సన్నిహిత కోటరిలో కీలకమైన మీనాక్షి రైలులో రావటం ఏమిటి ? మరీ చీపుగా. పైగా రైలులో దిగిన ఆమె తన బ్యాగేజీని తానే మోసుకుని రైలుస్టేషన్ బయటకు వచ్చారు. మీనాక్షి దృష్టిలో పడటానికి వందలసంఖ్యలో సీనియర్ నేతలు రెడీగాఉన్నారు. వారిలో చాలామంది ఆమె బ్యాగేజీని మోయటానికి సిద్ధంగా ఉంటారు. అయినా సరే ఎవరికీ ఆమె అవకాశం ఇవ్వకుండా తన బ్యాగేజీని మోసుకున్నారు.


ఇన్చార్జి దిగారంటే ఫైవ్ స్టార్ హోటల్లోనే బసచేసేవారు. ఇంతకుముందు ఇన్చార్జీలుగా పనిచేసిన వారు లైఫ్ స్టైల్ ఎలాగుండేదో, ఎంత ఆర్భాటంగా ఉండేవారో నేతలందరికీ బాగా పరిచయమే. అలాంటిది మీనాక్షి చాలా సింపుల్ గా దిల్ ఖుష్ అతిథిగృహంలో దిగారంటే ముందుగా చాలామంది నేతలు నమ్మలేదు. కానీ గెస్ట్ హౌస్ కే వెళ్ళి ఆమెను రేవంత్(Revanth), మంత్రులు వెళ్ళి కలిసారు కాబట్టి నమ్మక తప్పలేదు. రైల్వేస్టేషన్ కు కూడా ప్రోటోకాల్ ప్రకారం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ తో పాటు ప్రోటోకాల్ చూసే నేతతో పాటు మరో ఐదుగురిని మాత్రమే రమ్మని స్పష్టంగా చెప్పారు. ఈవిషయాన్ని ఢిల్లీలో బయలుదేరే ముందే బొమ్మకు మీనాక్షి చాలా క్లియర్ గా చెప్పారు. అందుకనే తెలంగాణ ఇన్చార్జి వస్తే రిసీవ్ చేసుకునేందుకు పట్టుమని పదిమంది నేతలు కూడా కనబడలేదు. ఇంతకుముందు పనిచేసిన ఇన్చార్జీలు విమానాశ్రయానికి వచ్చినపుడు వందల సంఖ్యలో నేతలు, క్యాడర్ కనబడేవారు.


తెలంగాణ ఇన్చార్జిగా నియమించగానే మీనాక్షి పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma Mahesh) కు ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. అదేమిటంటే గాంధీభవన్లో కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు అన్నింటినీ తొలగించేయమని. అప్పటివరకు పార్టీ ఆఫీసులో సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధితో పాటు రేవంత్, బొమ్మ తదితరుల కటౌట్లుండేవి. మీనాక్షి చెప్పింది ఏమిటంటే సోనియా, ఖర్గే, రాహుల్ కటౌట్లు తప్ప పార్టీ ఆపీసులో నాలుగోనేత కటౌట్ కనబడకూడదని చెప్పటంతో రేవంత్ తో కలిపి అందరి కటౌట్లు తీయించేశారు. విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడినపుడు నేతలు తన భజనమానేసి పార్టీ, ప్రభుత్వం గురించి జనాల్లో విస్తృతంగా ప్రచారంచేయటంపై దృష్టిపెట్టాలని చెప్పారు.


పార్టీలో వ్యక్తిపూజ ఎంతగా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. పదవులు, టికెట్లు కావాలని కోరుకునే నేతలు అధినేతలను సంతృప్తి పరిచేందుకు శక్తివంతన లేకుండా ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే అధినేతలు, ఇన్చార్జిల పర్యటనల్లో కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుచేస్తుంటారు. ఇలాంటి నేతల్లో ఎక్కువమంది తమకు వ్యక్తిగతంగా జరిగే లాభంగురించే ఆలోచిస్తారు. పార్టీ ఎలాగపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మీనాక్షి మాట్లాడుతు తన దృష్టిలో పడేందుకు నేతలు భజనచేయద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. విస్తృతస్ధాయి సమావేశంలో తాను క్లుప్తంగా మాట్లాడటమే కాకుండా మాట్లాడే అవకాశం కొద్దినేతలకు మాత్రమే ఇచ్చారు. సమావేశంలో ఎక్కువభాగం ద్వితీయశ్రేణి నేతలే మాట్లాడారు. గతంలో కీలకనేతలు మాట్లాడేసి సమావేశాన్ని ముగించేసేవారు. అయితే మీనాక్షి మాత్రం గతానికి భిన్నంగా ఎక్కువ సమయం ద్వితీయశ్రేణి నేతలు మాట్లాడేందుకే అవకాశం ఇచ్చారు.


చివరగా పార్టీకి, వ్యక్తిగతంగా రేవంత్ కు పంటికిందరాయిలా తయారైన తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ వేటులో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఎంతటి నేతైనా సరే పార్టీలైన్ దాటి వ్యవహరించేందుకు లేదని సస్పెన్షన్ వేటుతో మీనాక్షి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది. పార్టీలో ఉన్నపుడు పార్టీ లైనుకు కట్టుబడి ఉండాలని ఇన్చార్జి స్పష్టం చేసినట్లయ్యింది. వారంలో ఆరురోజులు పార్టీగురించే పనిచేస్తారు. శనివారం మాత్రం పూర్తిగా మౌనవ్రతమే. అంటే ఆరురోజుల నేతల మీటింగులతో బిజీగా గడిపే మీనాక్షి ఒక్కరోజు మౌనవ్రతం పాటిస్తారు.

మీనాక్షి నేపధ్యం ఏమిటి ?

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లా బిర్లాగ్రామ్ మండలంలోని నాగ్దా గ్రామంలో జన్మించారు. ఇండోర్ లోని దేవి అహ్లియ యూనివర్సిటీ నుండి 1994లో బయోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నారు. అలాగే 2002లో లా డిగ్రీ కూడా చేశారు. విద్యార్ధి దశనుండే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)లో చురుకుగా పాల్గొనేవారు. అందుకనే 1999-2002 మధ్యలో ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2002-2005 మధ్య మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్(Youth Congress) అధ్యక్షురాలిగా పనిచేశారు. మీనాక్షి సేవలను గుర్తించిన రాహుల్ ఈమెను 2008లో అఖిలభారత కాంగ్రెస్ కమిటి(ఏఐసీసీ)(AICC) కార్యదర్శిగా నియమించారు. 2009 ఎన్నికల్లో మందసౌర్ నుండి ఎంపీగా పోటీచేసి గెలిచారు. మీనాక్షి గెలుపు మధ్యప్రదేశ్ తో పాటు కాంగ్రెస్ లో పెద్ద సంచలనమైంది. ఎందుకంటే 1971 నుండి మందసౌర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందే లేదు. తన ప్రత్యర్ధి బీజేపీ కీలకనేత లక్ష్మీనారాయణ పాండే మీద 30 వేల ఓట్ల మెజారిటితో మీనాక్షి గెలిచారు. మళ్ళీ 2014, 19 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో రెండుసార్లు పోటీచేసి బీజేపీ అభ్యర్ధి సుధీర్ గుప్తా చేతిలో ఓడిపోయారు.


రెండు ఎన్నికల్లో ఓడిపోయిన మీనాక్షిని రాహుల్ గాంధి తన వ్యక్తిగత బృందంలో చోటిచ్చారు. రాహుల్ కు మీనాక్షి అంటే గుడ్డినమ్మకం. వ్యక్తిగత ప్రయోజనాలకన్నా పార్టీ ప్రయోజనాలకే మీనాక్షి పెద్దపీట వేస్తారన్న నమ్మకం రాహుల్ గాంధీలో చాలా ఎక్కువుంది. మొన్నటివరకు ఇన్చార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షీపై ఏఐసీసీకి చాలా ఫిర్యాదులు అందాయి. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారన్న నమ్మకంతోనే రాహుల్ ప్రత్యేకించి ఏరికోరి మీనాక్షిని తెలంగాణకు ఇన్చార్జిగా నియమించారు. మొదటి పర్యటనలోనే మీనాక్షి తన సింప్లిసిటీని ఆచరణలో చూపించారు. నేతలకు మార్గనిర్దేశం కూడా చేశారు. ఈనెలలోనే ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాల ఎంపికలో మీనాక్షి ముద్రేమిటో ఏమిటో తేలిపోతుంది.

Tags:    

Similar News