బెట్టింగ్ యాప్ ప్రకటనలు హైదరాబాద్ మెట్రో రైల్లో ఎందుకు మాయమైపోయాయి ?
మెట్రోరైలులో అంటించిన వివిధ బెట్టింగ్ యాప్ ప్రకటనలను హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం తొలగించేసింది;
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై పోలీసుల దెబ్బ హైదరాబాద్ మెట్రో రైలు మీద కూడా పడినట్లుంది. మెట్రోరైలులో అంటించిన వివిధ బెట్టింగ్ యాప్ ప్రకటనలను హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం తొలగించేసింది. యాప్ లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదుచేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్షర్లను విచారిస్తున్న పోలీసులు కొందరు సినీ సెలబ్రిటీలకు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకున్న వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మంచులక్ష్మీ(Manchu Lakshmi), ప్రణీత, నిధీ అగర్వాల్(Nidhi Agarwal), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj) తదితరులున్నారు. వీళ్ళపైన పోలీసులు 318(4), 112r/w 49తో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 3(ఏ), 4:2008, సమాచార చట్టం సెక్షన్ 66 డీ ప్రకారం కేసులు నమోదుచేసి విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు.
ఇప్పటికే 11 మంది ఇన్ఫ్ల్యుయెన్షర్లలో కొందరిని పోలీసులు విచారణ చేయగా యాంకర్ శ్యామల కోర్టులో కేసు దాఖలుచేశారు. పోలీసుల విచారణ నోటీసును ఆమె కోర్టులో చాలెంజ్ చేశారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ మెట్రో రైలు హడావుడిగా ప్రకటనలను తొలగించేసింది. ప్రతిరోజు మెట్రో రైళ్ళల్లో(Hyderabad Metro Rail) లక్షలాదిమంది ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళంతా చూస్తారన్న ఉద్దేశ్యంతోనే బెట్టింగ్ యాప్(Betting Apps) నిర్వాహకులు మెట్రో రైలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నారు. మెట్రో రైళ్ళ బయటా, లోపలంతా బెట్టింగ్ యాప్ ల కు సంబందించిన ప్రకటనలే కనబడేవి. అలాంటిది శుక్రవారం ఉదయం నుండి చాలా మెట్రోల్లో బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన ప్రకటనలను యాజమాన్యం తీసేసింది.
గురువారం అర్ధరాత్రి చివరి ప్రయాణం అయిన తర్వాత రైళ్ళన్నీ మెట్రో స్టేషన్లకు చేరుకుంటాయి. అర్ధరాత్రి 12 గంటలకు స్టేషన్లకు చేరుకున్న రైళ్ళు మళ్ళీ ఉదయం 6 గంటలకు పరుగులు మొదలుపెడుతాయి. గురువారం మెట్రోలో ఉన్న బెట్టింగ్ యాప్ ప్రకటనలు శుక్రవారం ఉదయానికి మాయమైపోవటం ఆశ్చర్యంగా ఉంది. విషయం ఏమిటని ఆరాతీస్తే గురువారం అర్ధరాత్రి స్టేషన్లకు చేరుకున్న మెట్రో రైళ్ళలో బెట్టింగ్ యాప్ ల ప్రకటనలను యుద్ధప్రాతిపదికన యాజమాన్యం తీయించేసింది. యాప్ లను ప్రమోట్ చేసినందుకు ఇన్ఫ్ల్యుయెన్షర్లకు, సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు జారీచేసినట్లే మెట్రో యాజమాన్యానికి కూడా నోటీసులు జారీచేశారా అన్న విషయం తెలీలేదు. లేకపోతే సామాజిక బాధ్యతగా యాజమాన్యమే తనంతట తానే బెట్టింగ్ యాప్ లను తొలగించేసిందా అన్నది అర్ధంకావటంలేదు.
సామాజిక బాధ్యతను యాజమాన్యం ఫీలవటం తక్కువనే చెప్పాలి. నిజంగానే మెట్రో యాజమాన్యానికి సామాజిక బాధ్యత ఉంటే అసలు బెట్టింగ్ యాప్ ల ప్రకటనకు అనుమతించేదే కాదు. ఇంతకాలం యధేచ్చగా మెట్రోల్లో కనిపించిన బెట్టింగ్ యాప్ పోస్టర్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయంటే కేసుల భయంతోనే అని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇదే విషయమై వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా మెట్రో రైల్ అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు.