కేకే తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకం, ఎందుకంటే...

కేకే‌గా గుర్తింపు పొందిన కే కేశవరావుని రాజకీయాల్లో ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అయితే, ఎవరూ ఆయన్ని విస్మరించలేరు కూడా. ఇపుడాయనే తెలుగు నాట అత్యంత సీనియర్ పొలిటీషన్

Update: 2024-03-31 03:36 GMT
ఎంపీ కేశవరావు, జనబలం, ధనబలం లేకుండా 6 దశాబ్దాలుగా రాజకీయాల్లో...ఏమిటా రహస్యం

హైదరాబాద్ : 13 ఏళ్ల తీర్థయాత్ర ముగిసిందని భారత రాష్ట్రసమితి మాజీ సెక్రెటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు.

మూడు రోజుల కిందట బీఆర్ ఎస్ కు గుడ్ బై చెపి కాంగ్రెస్ లోకి వస్తున్న నేపథ్యంలో తాను పార్టీమారేందుకు ఇచ్చుకున్న కేకే సంజాయిషీ. కేకే వయసు 85 సంవత్సరాలు. 55 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్నారు. పదమూడేళ్ల కిందట తెలంగాణకోసమని చెప్పి టీఆర్‌ఎస్ లో చేరారు.
ఇక కనుచూపుమేరలో ఓటమి లేదని భావించిన భారత రాష్ట్ర సమితి  (బీఆర్ ఎస్) మొన్న 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, అధినేత కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్ )మ్యాజిక్ పనిచేయకపోవడం కేకే కళ్లారా చూశారు
అంతేకాదు,  మరణ శయ్య మీద ఉందని అంతా భావించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సారిగా అనూహ్యంగా విజృంభించి బీఆర్ ఎస్ ను మట్టి కరిపించడంతో అందరికళ్లు బైర్లు కమ్మాయి. ఇందులో కేకే కూడా ఉన్నాడు. ఇక బీఆర్ ఎస్ పనయిపోయిందని అనుకున్నాడు కేకే.
ఆయనకు మనకు కాంగ్రెస్ గతం మళ్లీ కళ్ల ముందు కదిలింది. అది  ‘అయ్యో, అది  నా మాతృసంస్థ అనిపించింది. ఇది పచ్చి అవకాశవాదమే. అనుమానమే లేదు, కేకే కూడా ఆయారామ్ గయారామ్ లా జాబితాలో చేరిపోయాడు. అయినా సరే, కేకే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. తెలుగు రాజకీయాల్లో రెండు అక్షరాలతో పాపులర్ అయిన పేరు ఇదొక్కటే. గిట్టని వాళ్లుకూడా కేకేని అభిమానించకుండా ఉండటం కష్టం. ఎందుకంటే, తెలుగు రాజకీయాల్లో నాలుగు బరువైన పుస్తకాలు చదవిన వ్యక్తి అయనే. తెలుగులో ఉర్దూలో ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడగలిగేవాళ్లలో  ఆయననొక్కరు. ఒక్కొక్క సారి ఆయన మాట్లాదేమీ అర్థం కాదు. ఆయనకు ఉన్న లోతైన పరిజ్ఞానం ఆయనతో కూర్చుని మాట్లాడితేనే తెలుస్తుంది. కెేకే అహంకారం లేని అర్డినరీనెస్ ప్రతిరూపం.
కేసీఆర్ లాగా కేకే అరవై వేల పుస్తకాలు చదవివుండకపోవచ్చు. అయితే, చరిత్ర, తత్వ శాస్త్రం చదువుకున్నాడు. అందుకే ఎఫుడైనా అర్థవంతంగా మాట్లాడి తే చక్కగా మాట్లాడతాడు. జనబలం ధన బలం ఏమీ లేకపోయినా దాదాపు అయిదారు దశబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఏదో ఒక పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. పార్టీలు మారినా కేకేని పక్కన బెట్టడం కష్టం. అందుకే ఇపుడు కూడా కేకే మంచి వార్త అయ్యాడు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వయంగా కేకే నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కేకే గురించి రెండుముక్కల్లో చెబితే... కేకే ని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అదే సమయంలో ఆయన్ని ఎవరూ విస్మరించలేరు.

కేకేను కలిసిన రేవంత్


 ఇపుడు బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వస్తున్నపుడు బీఆర్ ఎస్ లో తన13 సంవత్సరాల తీర్థయాత్ర ముగిసిందని అన్నారు.

కులం, డబ్బు, ప్రాంతం వీటితో తెలుగు రాజకీయాల్లో నడుపుతుంటారు నేతలు. ఇవేవీ కాకుండా నాలుకతో రాజకీయాల్లో రాణించి ఏకైక నాయకుడు కేకే. ఆయనకు ఉన్న ఆస్తంతా నాలుకే.
అందుకే చక్కగా ‘ నా తీర్థయాత్ర ముగిసింది. ఇంటికొచ్చాను,’ అని తన కాంగ్రెస్ లో చేరడానికి సంజాయిషీ ఇచ్చారు.
రాజ్యసభ టికెట్టిచ్చి,కూతుర్ని మేయర్ ని చేసి, కొడుక్కి మరో పదవి ఇచ్చినా, కేసీఆర్ గత 13 మూడేళ్ల లో కేకే నోటికి బీగం వేశారు. నాలుక కదలకుండా చేశారు. పార్టీ రాజకీయాలమీదే కాదు, కేకే ఇష్టమయిన ఏ విషయం మీద మాట్లాడకుండా చేశారు. నోటితో బతికే వాడిని నోరు మూసుకోమని చెప్పారు. సెక్రెటరీ జనరల్ ని చేసి మాట్లాడొద్దన్నారు. కాకపోతే, ప్రతి పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ పక్కన ఒక సీటేసి, మాట్లాడకండా కూర్చోమన్నారు. మాటలతో బతికే కేకే కి ఇంతకంటే శిక్ష ఏముంటుంది. అందుకే చెడ్డ పేరుస్తుందని తెలిసినా సరే కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక కేకే మాట్లాడతారు. సెక్యులర్ రాజకీయాల మాటలు హైదరాబాద్ లో వినబడతాయి.
“కాంగ్రెస్ పార్టీ తనకు ఎవరికీ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చింది, కానీ తెలంగాణ ఏర్పాటులో జరిగిన ఆలస్యంతో నా కుమారుడు విప్లవ్ కుమార్ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ పునర్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ లో చేరాను,' అని ఆయన పేర్కొన్నారు.”
ఆయన పార్టీని మారిన సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా...
తెలంగాణ రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు కె.కేశవరావు...పరిచయం అక్కర్లేని పేరు.వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన కేశవరావు హైదరాబాద్ బద్రుకా కళాశాలలో, ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ వరకు చదివారు. అనంతరం ఉపాధ్యాయుడిగా, ఇంగ్లీషు జర్నలిస్టుగా పనిచేశారు. మూడు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన కేశవరావు తెలంగాణ ఆవిర్భావం ఆలస్యమవుతున్నదని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాని తెలంగాణ రాష్ట్ర సమతి (అప్పటి బిఆర్ ఎస్) ప్రాబల్యం పెరగడం, కాంగ్రెస్ కు భవిష్యత్తు కనిపించకపోవడం వల్లే ఆయన పార్టీ మారారని అందరికి తెలుసు. కేసీఆర్ ఆయన్ని పార్టీ సెక్రటరీ జనరల్ ని చేసి రాజ్యసభ టికెట్ ఇచ్చి ఢిల్లీకి పంపారు.
2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ , తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య పొత్తు కుదిరేందుకు కేకే బాగా కృషి చేశారు. 2013 జూన్ రెండో తేదీన ఆయన మరొక ఇద్దరు ఎంపిలు జి వివేకానంద, మందా జగన్నాథంలతో కలసి హైదరాబాద్ లో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్ లో టిఆర్ ఎస్ చేరారు. తాము తెలంగాణ ఏర్పాటుకు మే 31 గడువు పెట్టామని, కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక రాష్ట్రం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోనందున తాము పార్టీ వీడుతున్నామని సభలో కేకే హర్షధ్వానాల మధ ప్రకటించారు. అదే కేకే చివరి ప్రకటన. ఆతర్వాత ‘తీర్థయాత్ర ముగిసింది,’ ప్రకటన దాకా ఆయనను కెసిఆర్ నోరు మెదపనీయలేదు. ఆయన్నే కాదు, టీఆర్ ఎస్ లో చేరిన వెంటనే మొదట చేసే నోటికి తాళం వేయడమే.దాన్నుంచి కేకే బయటపడ్డారు. ఆయన 85 సంవత్సరాల వయసులో  ఆయన వాక్ స్వాంతంత్రం తిరిగి పొందుతున్నారు.

కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇస్తూ గుడ్ బై చెప్పిన కేకే


అసలు మొదట కేకే, మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే విషయం నెల రోజుల క్రితమే వెలుగుచూసింది. హైదరాబాద్ నగర మేయర్ అయిన గద్వాల విజయలక్ష్మీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినపుడు ఆమె కాంగ్రెస్ తీర్థం స్వీకరించనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందే నగర డిప్యూటీ మేయర్ శ్రీలత, మరో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయరు విజయలక్ష్మీతోపాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

కేకే ఘర్ వాససీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావును మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అంతే కేకే ఘర్ వాపసీకి తెర లేచింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమవుతుందని కేకే ప్రకటించడంతో కేసీఆర్ ఆయనపై కన్నెర్ర చేసి ఫామ్ హౌస్ కు రమ్మని కేకేకు హుకుం జారీ చేనినట్లు తెలిసింది. దీంతో కేకే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయన్ను కలిసి వచ్చాక, తాను బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కేకే ప్రకటించారు. సంచలనం రేపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లోకి రావడం తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని కేకే వ్యాఖ్యానించారు.

చేరికలపై కేకే సీఎంతో చర్చ
బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన కేకే తన కుమార్తె, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీతో కలిసి కాంగ్రెస్ తీర్థం స్వీకరిస్తున్న కేకే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు, బీఆర్ఎస్ నుంచి నాయకుల చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి చర్చించారు. దీంతో మరింతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయిందని భావిస్తున్నారు.

ఫక్తు తెలంగాణ వాదిని...
తాను ఫక్తు తెలంగాణ వాదినని గతంలో కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణను ఏర్పాటు చేశానని కేకే చెప్పారు. 42 మంది ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు.  1998 వ సంవత్సరం నుంచి తెలంగాణ పోరాటం మొదలైందని, తాను కాంగ్రెస్ వార్ గ్రూపులో సభ్యుడిగా పనిచేశానన్నారు.

సోదరిపై విప్లవ్ కుమార్ విమర్శలు
మేయర్ అయిన తన సోదరి విజయలక్ష్మిపై విప్లవ్ కుమార్ విమర్శలు గుప్పించారు. కేకే పార్టీ ఫిరాయించడంపై అతని కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు విప్లవ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్నపుడు 85 ఏళ్ల వయసులో ఉన్న తన తండ్రి పార్టీ మారడంపై విప్లవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారాలనే యోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు తన సోదరి విజయలక్ష్మీ చెప్పడం బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన మేయర్ పదవికి రాజీనామా చేశాకే పార్టీ మారాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన కుటుంబాన్ని విభజించాడని విప్లవ్ ఆరోపించారు.


Tags:    

Similar News