టికెట్ ఇస్తామంటే కూడా వెళ్లిపోతారా! ఇదేం తీర్రాబయ్?

రాలిపోతున్న 'గులాబీ' రేఖల్ని ఎలా కట్టడి చేయాలి? ఉన్న మార్గం ఏమిటీ, టికెట్లు ఇస్తామన్నా వెళ్లిపోతున్న వారిని ఆపడం ఎలా? తలలు పట్టుకున్న బీఆర్ఎస్ త్రయం..

Update: 2024-02-19 13:00 GMT
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు

సరిగ్గా నాలుగు నెలల కిందట కళకళలాడిన బీఆర్ఎస్ లో ఇప్పుడేం జరుగుతోంది. ఇప్పటివరకు భుజాలెగరేసిన నేతలందరూ ఇప్పుడెందుకు మెహం చాటేస్తున్నారు?, ఇంతకీ గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?, సీటు ఇస్తామన్నా ఎందుకు పార్టీలు మారుతున్నారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరక్క పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదలు రెండు, మూడుస్థానాల్లో ఉన్న కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్ రావు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క ఓటమితోనే ఇంతగా కుంగిపోవాలా, పవర్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయా?

ఏదైతేనేం.. గులాబీ పార్టీకి ఎంపీల టెన్షన్ పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎంపీలు పార్టీలో ఉంటారా? కొత్తదారులు వెతుక్కుంటారా అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల బరిలో ఉంటారనుకుంటున్న నేతలు మెల్లమెల్లగా పార్టీ నుంచి దూరమవుతున్నారు. సీటు ఇస్తామన్నా పోటీకి వెనుకాడుతున్నారు. ఇప్పటికే పార్టీలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో మిగిలిన ఎంపీల్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది పార్టీ మారతారు అన్న చర్చ జోరుగా జరుగుతుంది.

పార్టీని ఎందుకు వీడుతున్నారు?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ పార్టీని వీడిపోయే వారి సంఖ్య ఎక్కువైంది. లోక సభ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు టార్గెట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ వైపు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల ఏజెండాతోనే ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయంతో పార్లమెంట్ ఎన్నికల బరిలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలో ఎలాంటి పదవులు లేని నేతలతో పాటు సిట్టింగ్ ఎంపీలు కాకుండా సాగుతున్న పలువురు కూడా జాతీయ పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం గులాబీ పార్టీని ఆత్మ రక్షణలో వేస్తోంది.

9మందిలో ఎంతమంది మిగులుతారో...

ప్రస్తుతం 9 మంది సిట్టింగ్ ఎంపీలు గులాబీ పార్టీకి ఉండగా.... పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ ఇప్పటికే హస్తం గూటికి చేరుకున్నారు. సిట్టింగ్ ఎంపిగా ఆయన పార్టీని వీడడంతో.... కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఏ మేరకు ప్రాధాన్యత దక్కుతుందన్న దానిపై స్పష్టత రాలేదు. అయినా మరి కొంత మంది నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 8 మంది పార్లమెంట్ సభ్యుల్లో చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం మహబూబాబాద్ ఎంపీలు జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఒకరిద్దరు ఎంపీలు సిట్టింగ్ ఎంపి స్థానాలు కాకుండా కొత్త స్థానాల్లో అవకాశం కల్పించిన పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని జాతీయ పార్టీల అగ్రనేతల ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ సోదరుని తనయుడు హస్తం పార్టీలో చేరిపోవడంతో ఆస్థానంలో కూడా గులాబీ పార్టీ కొత్త నేతను వెతికే అవకాశం కనిపిస్తుంది.

తెరపైకి మరికొన్ని కొత్త పేర్లు...

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రతిపాదనలో ఉన్న టి రాజయ్య కూడా పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగింది. దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని పార్టీ పరిశీలిస్తోంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నా.... పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి హస్తం పార్టీ నుంచి చేవెళ్ల నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతుండడంతో.... వలసలకు ఎలా చెక్ పెట్టాలన్న యోచనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలన్న లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News