అవకాశం వస్తే మళ్ళీ హైదరాబాద్ వస్తా : మిస్ వరల్డ్ ఓపల్ సుచాత
మిస్ వరల్డ్ -2025 కిరీటాన్ని దక్కించుకున్న థాయ్ అందాలభామ ఓపల్ సుచాత హైదరాబాద్ నగరాన్ని మెచ్చుకున్నారు.అవకాశం వస్తే మళ్ళీ హైదరాబాద్ వస్తానని అందాల భామ చెప్పారు.;
By : The Federal
Update: 2025-06-01 16:05 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ హోటల్ ట్రిడెంట్ లో ఆమె మాట్లాడారు. మిస్ వరల్డ్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అందించిన మద్ధతుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అందమైన నగరమని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని మిస్ వరల్డ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో ఇంత అద్భుతమైన అనుభవం పొందడం నా జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకం అని ఆమె పేర్కొన్నారు.
థాయిలాండ్ దేశానికి మొట్టమొదటి మిస్ వరల్డ్ కిరీటం
థాయిలాండ్ దేశానికి ఇది మొట్టమొదటి మిస్ వరల్డ్ కిరీటమని,ఈ క్రౌన్ గెలుచుకోవడం నాకు గర్వకారణం మాత్రమే కాక,పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని ఓపల్ సుచాత తెలిపారు.‘నా దేశ ప్రజలతో పాటు, హైదరాబాద్‌లో తమ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను” అని ఆమె చెప్పారు.మిస్ వరల్డ్ ప్రకటించిన క్షణం ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని ఆమె చెప్పారు. లక్ష్యం నిర్ధారించుకొని కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారని ఆమె పేర్కొన్నారు.
బ్యూటీ విత్ పర్పస్ సేవా కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తా
తాను గత మూడేళ్లుగా థాయిలాండ్ లోబ్రెస్ట్ కాన్సర్ అవగాహనపై పని చేస్తూ ఫండ్ రైజింగ్ చేస్తున్నానని ఓపల్ సుచాత చెప్పారు. ఇక పై తన పర్పస్ ప్రాజెక్ట్ తో పాటు ఇతర కంటెస్టెంట్స్ పర్పస్ ప్రాజెక్ట్స్ పై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తానన్నారు. తాను మహిళా సాధికారత, సమస్యలపై పనిచేస్తానన్నారు. తన సేవాకార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించునున్నట్లు ఆమె పేర్కొన్నారు.
సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణ
తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరువలేనిదని, వారు చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మదిలో నిలిచిపోతాయని ఓపల్ సుచాత చెప్పారు. ఇక్కడి కళలు, సంప్రదాయాలు, డాన్స్, మ్యూజిక్ ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. రామప్ప, చార్మినార్ నిర్మాణం విస్తుపోయేలా చేసిందని ఇది కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం అని ఆమె అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో బాగుందని బాహుబలి సెట్ నచ్చిందని చెప్పారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ గొప్ప ఆవిష్కరణ అని మెచ్చుకున్నారు.
హైదరాబాద్ అనుభవం జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం
‘‘హైదరాబాద్‌లో గడిపిన ప్రతి క్షణం తనకు మాత్రమే కాదు, తన తోటి కంటెస్టెంట్స్‌కు కూడా మరచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. అవకాశం వస్తే మళ్లీ హైదరాబాద్ తప్పకుండా వస్తానని మిస్ వరల్డ్ ఒపల్ సూచత అన్నారు.ఎయిర్‌పోర్ట్‌లో దిగిన క్షణం నుంచే ప్రభుత్వం అందించిన హాస్పిటాలిటీ అద్భుతంగా ఉందన్నారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎంతో శ్రమించారని వారికి ధన్యవాదాలు తెలిపారు.