తొందరలోనే తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయపార్టీ ?

కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేసిందో లేదో వెంటనే కొత్తపార్టీ ఏర్పాటు ఖాయమనే టాక్ మొదలైపోయింది;

Update: 2025-03-02 05:09 GMT
Congress MLC Teenmar Mallanna

ఇపుడిదే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేసిందో లేదో వెంటనే కొత్తపార్టీ ఏర్పాటు ఖాయమనే టాక్ మొదలైపోయింది. తొందరలోనే తీన్మార్ బీసీల కోసం ప్రత్యేక రాజకీయపార్టీ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే కొంతకాలంగా మల్లన్న(Teenmar Mallanna) బీసీలకు మద్దతుగా విస్తృతంగా తెలంగాణ(Telangana) మొత్తం పర్యటిస్తున్నారు. అనేక వేదికలపైన బీసీలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. బీసీల కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురుతిరుగుతున్నాను అనేట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. తీన్మార్ కన్నా ముందునుండే బీసీ సంక్షేమం కోసం ప్రస్తుత బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య పోరాటాలు చేస్తున్నారు. అయితే రాజకీయంగా కృష్ణయ్యకన్నా తీన్మార్ చాలాకాలంగా యాక్టివ్ గా ఉన్నారు.

తీన్మార్ ఒక ఛానల్లో ‘తీన్మార్ న్యూస్’ ను చాలాకాలం ప్రజెంట్ చేశారు. తీన్మార్ న్యూస్ ద్వారానే తెలంగాణలో మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బాగా పాపులరయ్యారు. అందుకనే చింతపండు నవీన్ కాస్త తీన్మార్ మల్లన్నగా మారిపోయారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తీన్మార్ తన న్యూస్ లో కేసీఆర్(KCR) వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. ఈ కారణంగానే తీన్మార్ న్యూస్ కు క్రేజ్ వచ్చింది. అందుకనే మల్లన్న కూడా పాపులరయ్యారు. బాగా పాపులరయిన తర్వాత తనపాపులారిటీని రాజకీయంగా ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం తానే కొత్తగా తీన్మార్ పేరుతో యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు.

తన యూట్యూబ్ ఛానల్(YouTube) ద్వారా కేసీఆర్ వ్యతికంగానే కాకుండా తన ఆలోచనలను, బీసీల ఐక్యత, పోరాటాలు, రాజ్యాధికారం అంటు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈకారణంగానే తీన్మార్ మల్లన్నకు బీసీల నేతగా ప్రాధాన్యత దక్కింది. రెండుసార్లు ఎంఎల్సీగా, ఒకసారి ఎంఎల్ఏగా పోటీచేసిన మల్లన్న ఓడిపోయారు. చివరగా కాంగ్రెస్ లో చేరి మూడోసారి ఎంఎల్సీగా పోటీచేసి గెలిచారు. అయితే ఇండిపెండెంటుగా ఉండటం కన్నా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే తానుఎంఎల్సీగా గెలిచినవిషయాన్ని మల్లన్న మరచిపోయినట్లున్నాడు. అందుకనే గెలిచిన దగ్గర నుండి తాను అభ్యర్ధిగా పోటీచేయటం వల్లే కాంగ్రెస్ పార్టీ నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా గెలిచిందన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ ఎంఎల్సీగా ఉంటూనే పార్టీని, ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్ టార్గెట్ గా తీన్మార్ తరచూ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నాడు.

రేవంత్(Revanth) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్టును తగలబెట్టడం, మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని కాదని బీఎస్పీ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ప్రచారం చేశాడు. కులగణన రిపోర్టును తగలబెట్టడంతోనే పార్టీ క్రమశిక్షణ కమిటి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరింది. అయితే వివరణ ఇవ్వటానికి తీన్మార్ నిరాకరించటమే కాకుండా పార్టీని ధిక్కరించేట్లుగా మాట్లాడిన కారణంగానే పార్టీ సస్పెన్షన్ వేటువేసింది. తనపైన పార్టీ సస్పెన్షన్ వేటు వేయగానే తీన్మార్ మల్లన్న ఫ్రీ బర్డ్ అయిపోయారు.

అందుకనే తొందరలోనే బీసీలకోసం ప్రత్యేకంగా రాజకీయపార్టీ ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొంతకాలంగా బీసీలకోసమే ప్రత్యేకంగా రాజకీయపార్టీ ఉండాలనే డిమాండ్లు బీసీ సంఘాలు, నేతల నుండి పదేపదే వినబడుతున్నాయి. 2023 ఎన్నికలకు ముందు స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుండే బీసీ వాదన బాగా బలంగా వినబడుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లను బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు కూడా ప్రతిరోజు వినిపిస్తున్నారు. అందుకనే రాబోయే ఎన్నికఏదైనా సరే అభ్యర్ధుల గెలుపోటముల్లో బీసీలే కీలకమనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా బీసీ వాదన ప్రముఖంగా వినిపించింది.

మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్సీ సీట్లకు ఎన్నిక జరిగింది. అలాగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ సీటులో మరో టీచర్ ఎంఎల్సీ ఎన్నిక జరిగింది. ఈ మూడింటిలో మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎంఎల్సీ సీట్ల పోలింగ్ సందర్భంగా బీసీవాదన బలంగా వినబడింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులుగా రెడ్డి సామాజికవర్గం అభ్యర్ధులు నిలబడగా, బీఎస్పీ తరపున బీసీ అభ్యర్ధి పోటీచేశాడు. దాంతో పార్టీల రహితంగా బీసీలందరు బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు ఓట్లేసి గెలిపించాలని తీన్మార్ మల్లన్నతో పాటు చాలామంది బీసీ సంఘాల నేతలు పిలుపివ్వటమే కాకుండా బీఎస్పీ అభ్యర్ధి గెలుపుకు ప్రచారం కూడా చేశారు. అలాగే టీచర్ ఎంఎల్సీ అభ్యర్ధిగా పోటీచేసిన బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్యకు మద్దతుగా బీసీలను ఏకంచేసే ప్రయత్నాలు జరిగాయి. దీంతోనే ప్రస్తుతం తెలంగాణలో బీసీవాదన ఎంతబలంగా వినబడుతోందో అర్ధమవుతోంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే బీసీలకు ప్రత్యేక రాజకీయపార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని తీన్మార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వివిధ పార్టీల్లోని బీసీ నేతలు, బీసీల సంఘాల నేతలందరినీ ఏకంచేసి రాజకీయపార్టీ పెడితే గట్టి ప్రభావం ఉంటుందని తీన్మార్ అంచనా వేస్తున్నారు. బీసీలకోసం ప్రత్యేకంగా పార్టీ పెడితే రాజకీయంగా మిగిలిన పార్టీలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని అనేకమంది బీసీ సంఘాల నేతలు కూడా తీన్మార్ కు గట్టిగా చెబుతున్నట్లు సమాచారం. కాబట్టి తొందరలోనే రాజకీయపార్టీల్లోని బీసీల నేతలు, బీసీ సంఘాల్లోని నేతలే కాకుండా వివిధ రంగాల్లోని బీసీప్రముఖులతో తీన్మార్ భేటీ అవ్వాలనే యోచనలో ఉన్నారు. అందరితోను చర్చించి రాజకీయపార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని మల్లన్న ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయపార్టీ ఆలోచన స్ధానికసంస్ధల ఎన్నికల్లోపు తీసుకుంటారా లేకపోతే జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లోపు తీసుకుంటారా అన్నది చూడాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక సామాజికవర్గాన్ని బేస్ చేసుకుని పెట్టే పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది సందేహమే. ఎందుకంటే తెలుగురాష్ట్రాల్లో కులాధారంగా ఏర్పాటుచేసిన రాజకీయపార్టీలు సక్సెస్ అయిన దాఖలాలు లేవు. మరి చివరకు తీన్మార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News