ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందా ?

దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీవర్గీకరణ అంశాన్ని సోమవారం నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది;

Update: 2025-04-14 09:51 GMT
Revanth receiving SC Categorization report

దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీవర్గీకరణ అంశాన్ని సోమవారం నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది. ఎస్సీవర్గీకరణ విషయంలో ఎస్సీల్లోని మాలలు, మాదిగలు చెరో వాదన వినిపిస్తుండటంతో గతంలోని ఏ ప్రభుత్వాలు కూడా వర్గీకరణ చేయాలనే విషయంలో పెద్దగా చొరవచూపించలేదు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాల, మాదిగల్లో ఒకరికి కోపం చేయకపోతే మరొకరికి ఆగ్రహం అన్నట్లుగా ఉండేది పరిస్ధితి. పైగా అప్పట్లో ఈ అంశం కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండేది. 2023 ఎన్నికల సమయంలో నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీవర్గీకరణ చేస్తుందని హామీఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై నిర్ణయం రాష్ట్రప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రింకోర్టు 2024, ఆగస్టు 1వ తేదీన తీర్పిచ్చింది. దాంతో ఎస్సీవర్గీకరణ వివాదం కేంద్రప్రభుత్వం నుండి రాష్ట్రాలకు బదిలీ అయ్యింది.

సుప్రింకోర్టు తీర్పును అవకాశంగా తీసుకున్న రేవంత్ వెంటనే ఎస్సీవర్గీకరణ కసరత్తు మొదలుపెట్టేశాడు. దేశం మొత్తంమీద ఎస్సీవర్గీకరణను మొదటగా తెలంగాణలోనే అమలుచేస్తామని అసెంబ్లీలో ప్రకటించాడు. ప్రకటించినట్లుగానే వర్గీకరణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశాడు. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్ గా మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుతో ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి షమీమ్ అక్తర్ ను ప్రభుత్వం ఎస్సీవర్గీకరణపై అభిప్రాయాలు సేకరించేందుకు నియమించింది. వర్గీకరణ కసరత్తులో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండానే ప్రభుత్వం షమీమ్ అక్తర్ కమిటీని ఏర్పాటుచేసింది.

2024, నవంబర్ 11వ తేదీన బాధ్యతలు తీసుకున్న ఏకసభ్య కమీషన్ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఎస్సీ సంఘాల నేతలు, ఎస్సీ సామాజికవర్గంలోని మేథావులు, విద్యావేత్తలతో సమావేశాలు నిర్వహించి వర్గీకరణపై అనేక సూచనలు, సలహాలు తీసుకున్నది. 82 రోజులు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో పర్యటించిన జస్టిస్ షమీమ్ పెద్ద రిపోర్టే తయారుచేశారు. తన నివేదికను 2025, ఫిబ్రవరి 3వ తేదీన మంత్రివర్గ ఉపసంఘానికి అందించారు. నివేదికను పరిశీలించిన ఉపసంఘం క్యాబినెట్ కు సమర్పించింది. ఎస్సీవర్గీకరణ నివేదికపై చర్చించిన క్యాబినెట్ తర్వాత అసెంబ్లీలో మార్చి 18వ తేదీన ప్రవేశపెట్టి చర్చించింది. అసెంబ్లీ, శాసనమండలిలో సుదీర్ఘచర్చల తర్వాత ఉభయసభలు నివేదికను ఆమోదించాయి. తర్వాత వర్గీకరణ బిల్లుతో పాటు అసెంబ్లీ తీర్మానం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు చేరింది. ఈనెల 9వ తేదీన గవర్నర్ ఎస్సీవర్గీకరణ బిల్లును ఆమోదించారు. దానికి అనుగుణంగానే సోమవారం సాయంత్రం రేవంత్ ప్రభుత్వం ఎస్సీవర్గీకరణ ఉత్తర్వులు జారీచేయబోతోంది.

ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. ఈ 15 శాతాన్ని ప్రభుత్వం తాజాగా మూడురకాలుగా వర్గీకరించింది. వర్గీకరణకు ఎస్సీల్లోని ఉపకులాల సామాజిక, ఆర్ధిక, విద్యాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరించింది. గ్రూప్ 1 లోకి సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన ఉపకులాలు 15 ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ 15 ఉపకులాల జనాభా 3.288 శాతం ఉంది కాబట్టి 1 శాతం రిజర్వేషన్ కేటాయించింది. గ్రూప్ 2 లో పై రంగాల్లో మధ్యస్తంగా లబ్దిపొందిన ఉపకులాలు 18 ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. 62.748 శాతం జనాభా ఉన్న ఈ 18 ఉపకులాలకు 9 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని నిర్ణయించింది. ఇక గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన ఉపకులాలు 26 ఉన్నట్లు గుర్తించింది. అందుకనే ఈ 26 ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్ అమలుచేయబోతున్నది. ఉద్యోగ నియామకాల్లో గ్రూప్ 1 కి నోటిఫై చేసిన, భర్తీ చేయని ఖాళీలను తర్వాత గ్రూప్ 2 అభ్యర్ధులతో భర్తీచేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. అయితే గ్రూప్ 2 లో కూడా భర్తీకాని ఖాళీలను గ్రూప్ 3 లోని అభ్యర్ధులతో భర్తీచేస్తారు. మూడు గ్రూపుల్లో కూడా తగిన అభ్యర్ధులు లేనపుడు ఆ పోస్టులను క్యారీఫార్వార్డ్ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మొదటి జీవో రేవంత్ కే

సాయంత్రం విడుదల అవనున్న జీవో మొదటి కాపీని రేవంత్ రెడ్డికి అందించబోతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ ఉత్తమ్ ప్రకటించారు. ఎస్సీల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడుందన్నారు. ఇందులో భాగంగానే ఎస్సీవర్గీకరణ చేసినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 నుండి 17.5 శాతానికి పెరిగినట్లు చెప్పారు. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా తాము రిజర్వేషన్లు పెంచే అవకాశంలేదన్నారు. అందుకనే 2026లో జరగబోయే జనగణన ఆధారంగా ఎస్సీల రిజర్వేషన్ను 15 నుండి 17.5 శాతానికి పెంచబోతున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. ఏదేమైనా దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించిన క్రెడిట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందనటంలో సందేహంలేదు.

Tags:    

Similar News