కరూర్ బాధితులను పరామర్శించిన ‘టీవీకే’ చీఫ్ విజయ్
విమర్శలు గుప్పించిన అధికార డీఎంకే
By : The Federal
Update: 2025-10-27 07:46 GMT
నెల క్రితం టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పది మంది పిల్లలు సహ, 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తరువాత తొలిసారిగా టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మహాబలిపురంలో బాధిత కుటుంబాలను కలిశారు.
ఇందుకోసం తమిళగ వెట్రీ కజగం(టీవీకే) ఒక రిసార్ట్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ పార్టీ 50 గదుల బుక్ చేసుకుంది. తద్వారా విజయ్ మృతుల కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకుని తన సంతాపాన్ని తెలియజేశారు.
డీఎంకే విమర్శలు..
కరూర్ బాధిత కుటుంబ సభ్యులకు విజయ్ కప్పులు(టీ లేదా కాఫీ) అందజేసినట్లు కనిపిస్తోంది. టీవీకే దిండిగల్ ఈస్ట్ యూనిట్ అని చెప్పుకునే హ్యాండిల్, విజయ్ కుటుంబాలకు వైద్యం, విద్యతో సహ అన్ని ఖర్చులను పార్టీ భరిస్తుందని హమీ ఇచ్చినట్లు ఎక్స్ లో పోస్ట్ చేసింది.(ఈ ఫొటోల స్వతంత్రను ది ఫెడరల్ ధృవీకరించలేదు)
తొక్కిసలాట తరువాత బాధితులను అలాగే రోడ్ పై వదిలేసి ఒక నెలపాటు వారి కుటుంబాలను కూడా సందర్శించలేదని విజయ్ పై విమర్శలు చెలరేగాయి. అయితే అంతకుముందు వర్చువల్ సమావేశంలో కుటుంబాలతో మాట్లాడారు. స్వయంగా సందర్శనకు విజయ్ రావడానికి ప్రయత్నించినప్పటికీ ఆయనకు సాధ్యం కాలేదు.
‘‘బాధిత ప్రజలు విజయ్ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆయనను కలుస్తున్నారు. విజయ్ వారి ఇళ్లకు వెళ్లి వారి గురించి శాంతింపజేసే మర్యాద లేదు. విజయ్ రాజకీయాలు వేరు. ఆయన ఇంటి నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజల వద్దకు వెళ్లాలని కోరుకోవడం లేదు’’ అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది..
సెప్టెంబర్ 27 న జరిగిన తొక్కిసలాటలో కనీసం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన 41 మందిలో 18 మంది మహిళలు, 15 మంది పురుషులు, ఐదుగురు యువతులు, ఐదుగురు బాలురు ఉన్నారు. బాధితుల్లో 34 మంది కరూర్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఇద్దరు ఈరోడ్, తిరుప్పూర్, దిండిగల్ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఒకరు సేలం జిల్లాకు చెందినవారు ఉన్నారు.
తొక్కిసలాటపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని, దర్యాప్తు స్వతంత్రంగా నిష్పాక్షికంగా జరిగేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని కూడా జస్టిస్ జేకే మహేశ్వరీ, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖేశ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామకృష్ణన్ లతో కూడిన ప్రత్యేక సీబీఐ బృందం దర్యాప్తు ప్రారంభించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు మొత్తం రూ. 4.87 కోట్ల పరిహారం జారీ చేసినట్లు తెలిపారు. అంతకుముందు విజయ్ మాట్లాడుతూ.. తమ పార్టీ బాధితుల కుటుంబాలకు రూ. 20 లక్షల బదిలీ చేసిందని అన్నారు.