తెలంణాణ అసెంబ్లీలో ‘వాటర్ వార్’ కేసీఆర్ సర్కార్ ను కడిగేసిన కాంగ్రెస్

రేపు కేసీఆర్ నల్లగొండ సభ.. ఇవాళే అసెంబ్లీలో కృష్ణా జలాలపై రచ్చ.. రేపు వాటర్ ప్రాజెక్టుల సందర్శన.. పార్లమెంటు ఎన్నికల ముందర తెలంగాణలో వాటర్ వార్..

Update: 2024-02-12 07:45 GMT
గ్రాఫిక్స్ ఇమేజ్

"20వ శతాబ్దపు యుద్ధాలు ఆయిల్ పై జరిగితే 21వ శతాబ్దపు యుద్ధాలు నీటిపై జరుగుతాయి " అంటారు ప్రపంచ బ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఇస్మాయిల్ సెరాగెల్డిన్. 30 ఏళ్ల కిందట ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నిజమేఅనిపిస్తున్నాయి. చాలాదేశాలు, రాష్ట్రాలు నీటి కోసమే కుస్తీపట్లు పడుతున్నాయి.


ప్రస్తుతం తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ప్రత్యేకించి కృష్ణా ప్రాజెక్టులపై అంతర్యుద్ధం నడుస్తోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందుకు శాసనసభ, శాసనమండలి వేదికైంది. నీటి ప్రాజెక్టులపై అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ తారసిల్లాయి. నువ్వు మోసం చేశావంటే నువ్వే మోసం అంటూ పరస్పరం విమర్శలకు దిగాయి. ఈ నేపథ్యంలో అసలు వివాదం ఏంటో చూద్దాం.

అసలు కథ ఇలా మొదలైంది...

కేసీఆర్ పాలనలో తెలంగాణలోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు నీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందన్నది కాంగ్రెస్ వాదన. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కేసీఆర్ తీరని అన్యాయం, మోసం చేశారని సాక్షాత్తు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్.

కేసీఆర్ సభకు ఒకరోజు ముందే...

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 13న అంటే మంగళవారం నల్లగొండలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను పెట్టబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కాలి తుంటికి శస్త్రచికిత్స తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ ఇదే. ఈ సభనుంచి బీఆర్ఎస్ కు ఏమాత్రం లబ్ధి చేకూరకుండా ఉండాలంటే ముందే ఎదురు దాడి చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అందుకనే కేసీఆర్ సభకు ఒకరోజు ముందు శాసనసభా వేదికగా బీఆర్ఎస్ పాలనపై ఎదురుదాడికి దిగింది.

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

కృష్ణా నది జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ అంటూ వాస్తవాలను జనం ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా కేసీఆర్ ఏ విధంగా సహకరించారనేది కండ్లకు కట్టినట్టు వివరించబోతున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డే చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

కేఆర్ఎంబీ కి అప్పగించే ప్రసక్తే లేదు...

KRMBకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి వాటాలు కాపాడటంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రధాన జీవనాధారం అని చెప్పిన మంత్రి.. 299 టీఎంసీలు తెలంగాణ వాటాగా బీఆర్ఎస్ ఒప్పుకుందన్నారు. అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై చర్చలో ఉత్తమ్ మాట్లాడారు. నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసుల పెత్తనాన్ని ఉపసంహరించుకోవాలన్నారు ఉత్తమ్. నీటివాటాలు కాపాడటంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రధాన జీవనాధారం అని చెప్పారు.

రూ.27వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకీ నీరివ్వలేదు...

ఉమ్మడి ఏపీలో కంటే పదేళ్లలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. “బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వంద శాతం ఎక్కువ నీళ్లను ఆంధ్రా వాళ్లు తీసుకెళ్లారు. పాలమూరు రంగారెడ్డికి రూ.27 వేల 500కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలోనే పోత్తిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారు. 2015నుంచి 2023 వరకు కృష్ణానదీ జలాల్లో ఆంధ్రాకు ఎక్కువ నీళ్లు అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం” చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి చెప్పారు.

జగన్ ప్రసంగం తెలంగాణ అసెంబ్లీలో...

కేసీఆర్ ప్రభుత్వం ఏపీకి ఎలా ఉపయోగపడిందో, కృష్ణా జలాలను ఎలా కేసీఆర్ ఇచ్చారో, అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు చెబుతూ ఏపీ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని ఇవాళ తెలంగాణ శాసనసభలో వినిపించారు. ఈ విషయమై సభలో గందరగోళం జరిగింది. జగన్, కేసీఆర్ అలయ్ బలయ్ చేసుకున్నారని, బిర్యానీలు తిని గంటల తరబడి మాట్లాడుకున్నారని చెప్పారు మంత్రి ఉత్తమ్. అయినా తెలంగాణకు నదీజలాల వాటాలో అన్యాయం జరిగిందన్నారు. ‘కేసీఆర్ చాలా గొప్పవారని.. తెలంగాణ నీటిని కూడా ఏపీకి ఇస్తారని’ సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారన్నారు ఉత్తమ్. జగన్ ప్రసంగం కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించింది కాదని బీఆర్ఎస్ సభ్యులు వాదించారు.

కేసీఆర్ క్షమాపణ కోరాలి...

కృష్ణా నదిలోని నీటిని ఏపీ దొంగిలించుకుపోతుంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణ జలాల్లో వాటా శాతం ఎంత? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది? గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాలను మంత్రి ఉత్తమ్ వివరించారు. తెలంగాణలో కృష్ణ పరివాహక ప్రాంతం 68 శాతం ఉన్నా, రాష్ట్ర విభజన తర్వాత కేవలం 33 శాతం నీటి వాటాకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను గూగుల్ మ్యాప్ ద్వారా మంత్రి ఉత్తమ్ వివరించారు.

కృష్ణా, గోదావరి బేసిన్లు, వాటిపై ఉన్న ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష సభ్యులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన నీటి వాటాలపై అధ్యయనం చేసి సభలకు ఆధారాలతో సహా వస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏపీ నీళ్ల దోపిడీకి వంతపాడిన కేసీఆర్.. ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని, ఆ డ్రామాలను అసెంబ్లీ, మండలి సమావేశాల్లో కడిగేద్దామని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్రెడ్డి సూచించినట్లు సమాచారం.

నకిలీ జీవోలతో ఏపీకి నీళ్లు... బీఆర్ఎస్ ప్రభుత్వం నకిలీ జీవోలతో ఏపీకి నీళ్లు ఎలా ఇచ్చిందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. నీటి వాటాల విషయంలో పలు సందర్భాల్లో కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్లనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినిపించారు. నీటి వాటాల పంపకం కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్, కేఆర్ఎంబీ ఏర్పాటు, కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలతో సమావేశాలు, ఆ సమావేశాల మినిట్స్ వివరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వివరించారు.

బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిందే...

కృష్ణా జలాలపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తాము అడిగే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. నల్గొండలో కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు ప్రాజెక్టులపై ప్రజలకు నిజాలను వివరిస్తామన్నారు. నీళ్లను జగన్ కోసం ఏపీకి కేసీఆర్ తరలించారని, ఇప్పుడు సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. నీళ్ల విషయంలో ఏపీకి కేసీఆర్ సాయం చేశారని సాక్షాత్తూ జగనే ఏపీ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవాలన్న కుట్రల్లో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్ ఫైర్ అయ్యారు. ఏపీకి కృష్ణా నీళ్లను ధారాదత్తం చేశారన్నారు. నీళ్ల విషయంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే.. కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువని మండిపడ్డారు

అప్పగించిందే కేసీఆర్...

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్ అని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. నీటి వాటాలు తేల్చేంతవరకు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లుగా తానుగానీ, ప్రస్తుత ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గానీ సంతకాలు చేయలేదని తేల్చిచెప్పారు. ప్రాజెక్టులను మళ్లీ రాష్ట్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉద్యమించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా సోమవారం అసెంబ్లీలో రెండు తీర్మానాలను ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఒకటి.. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని కేంద్రానికి తేల్చి చెప్పే తీర్మానం కాగా.. రెండోది నాగార్జునసాగర్ డ్యామ్పై మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో కూడిన తీర్మానమని సమాచారం.

నీటి వాటాల కోసం కొట్లాటే.. రేవంత్

ప్రస్తుతం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇస్తున్నారు. నీళ్ల వాటా తగ్గడానికి గత కేసీఆర్ సర్కారు తీరే కారణమని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతున్నది. నీళ్లలో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెడీ అయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలన్నింటికీ (మహారాష్ట్ర, కర్నాటక సహా) మరోసారి నీటి వాటాల పంపిణీ కోసం ఉద్యమించాలన్నారు సీఎం రేవంత్.

Tags:    

Similar News