అన్న పిలిచినా పలకని చెల్లి.. కయ్యం కంటిన్యూ

నిశ్చితార్థం వేడుకలో అంటీ ముట్టనట్టు కనిపించారు. వాళ్లిద్దరూ ఎవరో మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది.

Update: 2024-01-19 05:04 GMT
చెల్లి షర్మిల దంపతుల్ని ఫోటో షూట్ కి రమ్మని పిలుస్తున్న జగన్

పిల్చారు గనుక వచ్చాం, వచ్చాం గనుక ఆశీర్వదించాం అన్నట్టుగా సాగింది ఈ అన్నా చెల్లెళ్ల అనుబంధం. నిజానికి వీరిద్దరూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి మచ్చుతునకగా ఉండే వాళ్లు. అటువంటిది.. అదీ తన మేనల్లుడి పెళ్లి ముహూర్తం వంటి సంబరంలో కనిపించాల్సినంత అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత కనిపించలేదు. నిశ్చితార్థం వేడుకలో అంటీ ముట్టనట్టు కనిపించారు. వాళ్లిద్దరూ ఎవరో మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది. వాళ్లే వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతుల పిల్లలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల. ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరొకరు అదే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. రాజకీయంగా ఉప్పూ నిప్పు లాంటి వాళ్లే. ఒకరు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు రాష్ట్రముఖ్యమంత్రి అయితే చెల్లెలు ఇప్పుడదే పార్టీకి అధ్యక్షురాలయ్యారు.

ఇలా మొదలై.. అలా ముగిసింది...


ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక గురువారం రాత్రి హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. ఈ వేడకకు షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్‌ సతీసమేతంగా వచ్చారు. ఆయన వెంట సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి మహామహులు సైతం ఉన్నారు. అయితే ఆయన వచ్చినంత సేపు పట్టలేదు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి.. అసలేమైందంటే.. వేడుకలో పాల్గొనేందుకు రాత్రి 8 గంటల ప్రాంతంలో రిసార్టుకు చేరుకున్నారు. కారు దిగుతూనే అందరికీ నమస్కరిస్తూ తన సతీమణి భారతితో కలిసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. మధ్యలో తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు. పక్కనే ఉన్న షర్మిలను పలకరించి కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు.

రెండు సార్లు పిలిచినా రాని షర్మిల...


తర్వాత పుష్పగుచ్ఛం ఇస్తుండగా గ్రూపు ఫొటో తీసే సమయంలో షర్మిల దూరంగా ఉండటం గమనించి దగ్గరకు రావాలని పిలిచారు. ఆమె భర్త అనిల్‌ కూడా అంటీముట్టనట్టుగానే కనిపించారు. ఫొటో కోసం రావాలని రెండోసారి పిలిచినా రాలేదు. షర్మిల తన కుమార్తను వాళ్ల అత్త భారతి పక్కకు పంపి తాను దూరంగా నిలబడ్డారు. జగన్ మూడోసారి పిలిచాక.. అనిల్ హడావిడిగా వస్తూ షర్మిలను ముందుకు రమ్మన్నారు. ఆమె మాత్రం తన కుమార్తె పక్కనే నిల్చొని.. మీరు కానివ్వండన్నట్టు సైగ చేశారు. దీంతో అనిల్ వచ్చి విజయమ్మ పక్కన నిల్చుని ఫొటో దిగారు. తర్వాత షర్మిలను, తల్లి విజయమ్మను పలకరించిన జగన్‌.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన వదిన భారతి పక్కన నిలబడడానికి కూడా షర్మిల పెద్దగా ఇష్టపడినట్టు లేదు. ప్రేమాప్యాయతలు కనిపించలేదు. వేదికపైకి వచ్చేటపుడు భారతి సమీపంలోకి వచ్చిన షర్మిల.. భారతి తిరిగి వెళ్లే సమయంలో నమస్కరించడం దేనికి సంకేతమన్న గుసగుసలు పోయారు అక్కడున్న జనం. ఇదంతా కేవలం ఐదు నిమిషాలలోపే ముగిసింది.

వైఎస్సార్ స్టైల్ కి భిన్నంగా...


సహజంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలోనా ఏదైనా పెళ్లికి వెళితే కనీసం పదీపదిహేను నిమిషాలు గడుపుతారు. వచ్చిన వెంటనే వేదికపైకి పోకుండా కింద తనకు వేసిన సీట్లో కూర్చొని అందర్నీ పలకరించి వీలయితే రెండు జోకులు వేసి ఆ తర్వాత అక్షింతలు వేసి వెళుతుంటారు. బంధువుల పెళ్లిళ్లకు వెళ్లినప్పుడైతే ఇంకోంచెం ఎక్కువ సేపు గడపడం ఆనవాయితీగా ఉండేది. కాని చిత్రంగా తన సొంత చెల్లి కొడుకు, తనంటే బాగా ఇష్టపడే మేనల్లుడి పెళ్లికి వచ్చిన జగన్ పట్టుమని రెండే రెండు నిమిషాలు వేదికపై ఉండడం, ఆసమయంలో ఎక్కడా నవ్వుముఖం కనిపించకపోవడం చూస్తుంటే అన్నా చెల్లెళ్ల అనురాగానికి ఎక్కడో విఘాతం కలిగినట్టేనని వ్యాఖ్యానించారు పెళ్లికి హాజరైన పెద్దలు.

నిశ్చితార్థ వేడుకకు ఎంతోమంది పెద్దలు..


నిశ్చితార్థ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, సినీ నటులు మోహన్‌బాబు, విష్ణు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, ఏపీ కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌, జేడీ శీలం, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్‌ తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News