తమిళనాడులో ‘పీఎంకే’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

కేంద్రంతో డీఎంకేకు పెరిగిన విభేధాలు, కొత్త పార్టీల ఆవిర్భావంతో పార్టీలకు అంబుమణి రామదాస్‌ మద్దతు కీలకం కానుందా?;

Update: 2025-03-19 08:41 GMT
Click the Play button to listen to article

వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పత్తాళి మక్కల్ కచ్చి (పీఎంకే) అధ్యక్షుడు అంబుమణి రామదాస్ (Anbumani Ramadoss) రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెంచారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన పార్టీలకు మద్దతు ఇచ్చి..పీఎంకే కీలక పదవులు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంబుమణి రామదాస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం జూలై 24, 2025న ముగియనుంది. 2019లో ఏఐఏడీఎంకే మద్దతుతో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగుస్తుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే లక్ష్యంతో పీఎంకే ముందుకు సాగుతోంది.

మారనున్న ఓటింగ్ ధోరణి..

చిన్న పార్టీలు డీఎంకే(DMK)ఓట్లు చీల్చి, ఏఐఏడీఎంకే(AIADMK) నేతృత్వాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని అంచనా. "సినీ నటుడు విజయ్‌ TVK (Tamilaga Vettri Kazhagam)ఆవిర్భావం, నామ్ తమిళర్ కచి (NTK)కు పెరుగుతున్న మద్దతు, బీజేపీ తన ఉనికిని బలపర్చే ప్రయత్నాలు, రాష్ట్రంలో ఓటింగ్ ధోరణులను మార్చుతున్నాయి" అని పీఎంకే సీనియర్ నేత పేర్కొన్నారు.

గత ఎన్నికలలో..

2021లో డీఎంకే 133 స్థానాలు గెలుచుకోగా, దాని కూటమి మొత్తం 159 స్థానాలు సాధించింది. ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 75 స్థానాలు గెలుచుకుంది. 2026లో TVK 10% ఓట్లు పొందే అవకాశం ఉందని పీఎంకే అంచనా వేస్తోంది, దీంతో ఏకపక్ష మెజారిటీ సాధించటం కష్టమవ్వొచ్చు. ఈ పరిస్థితి పీఎంకేలాంటి చిన్న పార్టీల ప్రాధాన్యతను పెంచనుంది. 2021లో పీఎంకే 3.84% ఓట్లు పొందింది.

డిప్యూటీ సీఎం పదవిపై ఆశలు..

రానున్న ఎన్నికల్లో పీఎంకే మద్దతు ఇచ్చే పార్టీగా కాకుండా కీలక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. వన్నియార్ ఓటు బ్యాంక్‌పై ఆధారపడిన ఈ పార్టీ.. 2021లో ఏఐఏడీఎంకే కూటమిలో ఐదు స్థానాలు గెలుచుకుంది. 2016లో అంబుమణి సీఎం అభ్యర్థిగా పోటీ చేసినా, విజయాన్ని సాధించలేకపోయారు, దీంతో ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. పార్టీ వర్గాల ప్రకారం.. అంబుమణి డిప్యూటీ సీఎం పదవి లేదా కూటమి ప్రభుత్వంలో కీలక పోస్టు ఆశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ(BJP)తో జతకడతారా?

మారుతున్న రాజకీయ పరిణామాలను పీఎంకే తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతానికయితే పీఎంకే తన వ్యూహాన్ని బయటపెట్టకపోయినా.. బీజేపీతోనే జత కట్టడం వల్ల 2026లో మెరుగైన అవకాశాలు దక్కుతాయని ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

ఏఐఏడీఎంకేతో పొత్తుపై చర్చలు..

ఏఐఏడీఎంకేతో మళ్లీ పొత్తుకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 2021లాగా పీఎంకే మద్దతు లేకుండా ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిసామి పశ్చిమ తమిళనాడులో సీట్లు గెలుచుకోవడం కష్టమని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఈ సారి డీఎంకే, ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకును TVK చీల్చే అవకాశం ఉండటంతో సీట్ల పంపక సమయంలో పీఎంకే కీలకంగా మారనుందని చెబుతున్నారు.

తమిళనాడులో కూటమి ప్రభుత్వాల చరిత్ర...

2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 118 మేజిక్ నంబర్‌ను చేరుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్, పీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే ఈ రెండు పార్టీలూ ప్రభుత్వంలో మంత్రిపదవులను మాత్రం తీసుకోలేదు. 2016లో ఏఐఏడీఎంకే 136 స్థానాలను గెలుచుకొని తిరిగి అధికారంలోకి వచ్చింది.

పీఎంకేకు అధిక ప్రాధాన్యం..

అంబుమణి అభ్యర్థిత్వాన్ని, పీఎంకే కూటమి వ్యూహాలను రాజకీయ విశ్లేషకులు తెలివైన వ్యూహంగా భావిస్తున్నారు. "ఏఐఏడీఎంకే బీజేపీతో కలిసి తమిళనాడులో బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్న నేపథ్యంలో.. పీఎంకేకు ప్రాధాన్యం పెరుగుతుందని," రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వ్యూహాత్మకంగా వెళితే తప్ప..

స్వతంత్రంగా అధికారంలోకి రావడం అసాధ్యమైనా.. విభజిత అసెంబ్లీలో పీఎంకే కీలక పాత్ర పోషించేందుకు అవకాశముంది. ఇది గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న ద్రవిడీయన్ పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీయవచ్చు. చివరకు పీఎంకే విజయం ప్రధానంగా దాని ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడం, వ్యూహాత్మక కూటములను ఏర్పాటు చేసుకోవడం, విభజిత ఓటర్లను ఆకర్షించడంపై ఆధారపడి ఉంటుంది. 

Tags:    

Similar News