బీజేపీ ఎంపీల బృందం కరూర్‌ను సందర్శించడంపై స్టాలిన్ సీరియస్..

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఎందుకు పంపలేదని ప్రశ్నించిన తమిళనాడు సీఎం..

Update: 2025-10-03 12:26 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) భారతీయ జనతా పార్టీ (BJP)పై నిప్పులు చెరిగారు. కరూర్‌(Karur)కు కేంద్రం ఎంపీల ప్రతినిధి బృందాన్ని పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్ఘటనను సైతం బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చీఫ్ విజయ్(Vijay) ఇటీవల కరూర్‌‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


‘తమిళుల పట్ల వారికి ఏ ఆందోళన లేదు'

‘‘2023 మేలో బీజేపీ(BJP) పాలిత మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. మహా కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రాంతాలకు బీజేపీ ఎలాంటి బృందాలను పంపలేదు. కరూర్‌కు మాత్రం వెంటనే పంపారు. వాస్తవానికి తమిళుల పట్ల వారికి ఎలాంటి ఆందోళన లేదు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పొలిటికల్ మైలేజీ కోసం ఇదంతా చేస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు స్టాలిన్.

మధురైలో జన్మించి, కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయిన నిర్మలా సీతారామన్‌‌పై కూడా స్టాలిన్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో గతంలో మూడు ప్రధాన విపత్తులు సంభవించాయి. అయినా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించలేదు. ఆర్థిక సాయం విడుదల చేయలేదు. కాని కరూర్‌కు మాత్రం రెక్కలు కట్టుకుని వాలిపోయారు.’’ అని విమర్శించారు.

విజయ్ ప్రచార సభకు సరైన వేదిక సమకూర్చలేదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను హేమమాలిని విమర్శించారు. కరూర్‌ను సందర్శించిన బీజేపీ ప్రతినిధి బృందంలో ఆమె కూడా ఉన్నారు. వేదిక మార్చాలని టీవీకే అభ్యర్థించినా.. DMK ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె అనడంపై సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. భారీగా వచ్చిన జనాల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు చేసిన సూచనలను టీవీకే నాయకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని సమాధానమిచ్చారు.


‘టీవీకేను నిలువరించేందుకే’..

తమకు వస్తోన్న ప్రజాదరణను ఓర్వలేకే డీఎంకే ప్రభుత్వం తొక్కిసలాట ఘటనకు కుట్ర పన్నిందని టీవీకే ఆరోపించింది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ విజయ్ తన ప్రసంగంలో సీఎం స్టాలిన్ "ప్రతీకార రాజకీయాలకు" పాల్పడుతున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.


అన్నాడీఎంకేపై స్టాలిన్ విమర్శలు..

బీజేపీతో పొత్తుపెట్టుకున్న AIADMKను పరాన్నజీవిగా పోల్చారు సీఎం స్టాలిన్. కాషాయ పార్టీ నేతల చేతుల్లో అన్నా డీఎంకే నేతలు కీలు బొమ్మలుగా మారిపోయారని విమర్శించారు. కాషాయ పార్టీకి మద్దతు ఇవ్వడానికి AIADMKకు ఏదైనా ప్రజా ప్రయోజనం ఉందా? అని స్టాలిన్ ప్రశ్నించారు.

రాజ్యాంగబద్ధ అధికారం లేకపోయినా.. తొక్కిసలాట ఘటనకు సంబంధించి హేమ మాలిని నేతృత్వంలోని 8 మంది సభ్యుల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నుంచి నివేదిక కోరింది. విషాద ఘటనకు కారణాలు చెప్పాలని అందులో కోరారు.

బృందంలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం స్టాలిన్‌కు లేఖ రాశారు. "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో' చెప్పాలని అందులో డిమాండ్ చేశారు.

తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీవీకే.. కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కరూర్ బాధితులను పరామర్శించడానికి డీఎంకే ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వాలని టీవీకే చీఫ్ విజయ్ కోరుతున్నారు.  

Tags:    

Similar News