భారతీయులం ఒక్కటేనన్న భావనతో అలయ్ భలయ్
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస
భారతీయులందరూ ఒక్కటేనన్న భావనతో రెండు దశాబ్దాలుగా దత్తాత్రేయ అలయ్ భలయ్ కార్యక్రమం నిర్వహించడం ముదావహమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాడు కొనియాడారు.
కులం, మతం, జాతి , వర్గం, వర్ణం పేరుతో కొందరు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మనదేశంలో అలాంటి ఆశలు పెట్టుకున్నవారు నిరాశ చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చిన్న చిన్న విభేధాలు ఉన్నప్పటికీ భారతీయులందరం ఒక్కటే నన్న భావనతో ముందుకెళ్తున్నామన్నారు. అలయ్ భలయ్ కార్యక్రమంతో ఐక్యతా సందేశాన్నిఅందిస్తున్న బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మిలను శుక్రవారం వెంకయ్యనాయుడు అభినందించారు.
హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయ లక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ భలయ్ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నేతలు, సినీ ప్రముఖులు, సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రముఖలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ ఈ వేడుకను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దసరా మరుసటి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్బంగా ప్రముఖులను దత్తాత్రేయ సత్కరించారు.
భారతీయ, సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెపుతున్న ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. అందర్నీ ఒకే చోట చేర్చి ఐక్యతనుచాటి చెప్పే ప్రయత్నం చేస్తున్న బండారు దత్తాత్రేయను ఆయన ప్రస్తుతించారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మట్లాడుతూ బండారు దత్తాత్రేయ పార్టీల కతీతంగా అలయ్ భలయ్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దత్తాత్రేయ అజాత శత్రువన్నారు. ఈ కారణంతోనే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు.
ప్రముఖ సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ దత్తాత్రేయతో పరిచయం ఉన్నప్పటికీ మొదటిసారి ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. కొత్తగా ఉందన్నారు. 2005 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మొదటి సారి తనను ఆహ్వానించడం పట్ల దత్తాత్రేయకు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ హాస్య నటుడు బ్రహానందం మాట్లాడుతూ అలయ్ భలయ్ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ ఆలింగనం చేసుకుని ప్రేమను పంచుకోవడమేనన్నారు. ప్రేమాను రాగాలు తగ్గిన ఈ సమాజంలో అలయ్ భలయ్ కార్యక్రమం కొత్త స్పూర్తినిచ్చిందన్నారు.