దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం నివాళి
కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు.. ‘టైగర్ దామన్న’ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే రెండు రోజుల క్రితం దామోదర్ రెడ్డి.. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కుటుంబీకులు.. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ సహా పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆయన కుటుంబీలనూ సీఎం రేవంత్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా ఆయన ఫేమస్. అందరూ ఆయనను టైగర్ దామన్న అనే పిలిచేవారు. అందుకు రాజకీయ పరంగా నల్లగొండలో ఆయన సాధించిన విజయాలే కారణం. టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తుంగతుర్తిలో దామోదర్‌రెడ్డి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. తన సతీమణి వరూధినీదేవితో కలిసి పర్యటించి.. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్ట్‌లు, టీడీపీ వాళ్లు తప్ప మరెవరూ ఇక్కడ గెలవలేరు అన్న తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయన రాకతో కమ్యూనిస్ట్ కంచుకోట బీటలువారింది. అంతేకాకుండా పార్టీకి ఆయన చేసిన సేవలు అన్నీఇన్నీ కావు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.