కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఆయన మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
By : The Federal
Update: 2024-08-14 08:58 GMT
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం బుధవారం నిరాకరించింది. అదే సమయంలో ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసు జారీ చేసింది.
విచారణ 23కు వాయిదా..
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి జూన్ చివర్లో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ అరెస్టును సవాల్ చేస్తూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించలేదు. అరెస్టు చట్టబద్ధమేనంటూ ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు జులై 12న మధ్యంతర బెయిల్ మంజూరుచేసిన సంగతి తెలిసిందే.