‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడికి బెయిల్

దేశంలో చైనా అనుకూల వార్తలు ప్రచారం చేయడానికి డబ్బులు తీసుకుంటున్నాడనే ఆరోపణలపై అరెస్ట్ చేయబడిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ..

Update: 2024-05-15 06:21 GMT

భారత్ లో చైనా అనుకూల ప్రచారం చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను ఢిల్లీ పోలీసులు గత ఏడాది అరెస్ట్ చేశారు. అతనిపై యూఏపీఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మే 6న, న్యూస్‌క్లిక్ మానవ వనరుల విభాగం(హెచ్ ఆర్) చీఫ్ అమిత్ చక్రవర్తిని కస్టడీ నుంచి విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

గత ఏడాది అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం పుర్కాయస్థ, చక్రవర్తిలను అరెస్టు చేసింది. పుర్కాయస్థ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీ పోలీసుల FIR ప్రకారం, "భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించడానికి" దేశంపై ప్రజలలో అసంతృప్తిని కలిగించడానికి చైనా నుంచి న్యూస్ పోర్టల్‌కు పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం (PADS) -తో కలిసి పుర్కాయస్థ కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అనుమానితులపై, డేటా విశ్లేషణలో బయటపడిన వారిపై అక్టోబర్ 3న ఢిల్లీలోని 88 ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో ఏడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, జర్నలిస్టుల నివాసాల నుంచి దాదాపు 300 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల అనంతరం తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులతో సహా 46 మందిని స్పెషల్ సెల్ ప్రశ్నించింది.
అంతా అనుమానాస్పదమే
న్యూస్ క్లిక్ కు నడపడానికి సంవత్సరానికి దాదాపు రూ. 78 కోట్లు ఖర్చు చేస్తున్నారని దీనిపై ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఒక వెబ్ సైట్ నడపడానికి ఇంత ఖర్చు అవసరం లేదని, ఇది దేశంలో చైనా అనుకూల వాదనలు వినిపించడానికి వాడుతున్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్న మాట.
న్యూస్ క్లిక్ కు డబ్బులు మొత్తం అమెరికా నుంచి వస్తున్నాయని, అమెరికాలో ఉన్న వ్యక్తులకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఫండింగ్ చేస్తుందని చాలాకాలంగా కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.  భారత్ లో చైనా అనుకూల వాదనలు వినిపించడానికి ఇంతకుముందు రాజీవ్ శర్మ అనే వ్యక్తిని బీజింగ్ నియమించుకుంది. ఇతనితో పాటు నేపాల్ కు చెందిన ఒక వ్యక్తి, మరో చైనా మహిళను భారత గూఢచారీ వర్గాలు అరెస్ట్ చేసి జైలులో వేశాయి. 


Tags:    

Similar News