అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికింది. మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు
ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ దొరికింది. మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఇదే కేసులో అవినీతికి పాలడ్డారని సీబీఐ ఆయనను అరెస్టు చేసినందున ప్రస్తుతం జైలులో ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేయగా.. అవినీతి కేసులో సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది.
మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం కోసం మే 10న సుప్రీంకోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికలు జూన్ 1తో ముగుస్తాయి. ఆ తర్వాత రోజు (జూన్ 2న ) కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వైద్య పరీక్షలు చేయించేందుకు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని పిటీషన్ వేశారు. తన క్లయింట్ అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో కీటోన్ లెవల్స్ పెరగడంతో వైద్య పరీక్షలు చేయించాల్సి ఉందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదించారు. అయినా బెయిల్ లభించలేదు. తర్వాత జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఇదే వ్యవహారానికి సంబంధించిన సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. జూన్ 27 నుంచి సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.