‘ఆపరేషన్ సింధూర్’ను వివరించేందుకు విదేశాలకు బయలుదేరిన భారత బృందాలు
'వన్ మిషన్, వన్ మెసేజ్, వన్ భారత్' కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు బృందాల్లో ఈ రోజు (మే 21) మూడు బృందాలు తమకు కేటాయించిన దేశాలను బయలుదేరుతున్నాయి.;
జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor), గతంలో భారత్ - పాక్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి గల కారణాలు, ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన వైఖరిని కేంద్రం ప్రభుత్వం ప్రపంచ దేశాలకు బలంగా వినిపించాలనుకుంది. అందుకోసం 51 మంది సభ్యులతో కూడిన ఏడు ప్రతినిధి బృందాలను వివిధ దేశాల రాజధానులకు పంపాలని నిర్ణయించింది. ఒక్కో బృందంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు ఉంటారు. వీరందరిని కేంద్రమే ఎంపిక చేస్తుంది. మొత్తం ఏడు బృందాలు (Delegation) 33 దేశాలను సందర్శిస్తాయి. ఈ కార్యక్రమానికి 'వన్ మిషన్, వన్ మెసేజ్, వన్ భారత్' అని పేరు పెట్టారు. ఒక్కో బృందం తమకు కేటాయించిన దేశాలకు చేరుకుని అక్కడి శాసనసభ్యులు, మేధావులు, పౌర సమాజానికి పాక్ దుశ్చర్యలను వివరిస్తూ ఉగ్రవాదంపై భారత వైఖరిని వివరిస్తారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఇతర అధికారులు ఇప్పటికే ఈ బృందాలకు శిక్షణ నిచ్చారు. వివరించాల్సిన వివరాలపై అవగాహన కల్పించారు.
నేడు బయలుదేరనున్న మూడు బృందాలు..
జేడీ (యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కె కనిమొళి, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మూడు బృందాలు బుధవారం (మే 21) తమకు కేటాయించిన దేశాలకు బయలుదేరుతున్నాయి.
ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారువా, హేమాంగ్ జోషి (బీజేపీ), సీపీఎం జాన్ బ్రిట్టాస్, మాజీ విదేశాంగ మంత్రి కాంగ్రెస్ ప్రముఖుడు సల్మాన్ ఖుర్షీద్, రాయబారి మోహన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇండోనేషియా, మలేషియా, జపాన్, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాను సందర్శిస్తారు.
కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీజేపీకి చెందిన బ్రిజేష్ చౌతా, ఎస్పీకి చెందిన రాజీవ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్, ఆర్జేడీకి చెందిన ప్రేమ్ చంద్ గుప్తా, ఆప్‌కు చెందిన అశోక్ మిట్టల్, రాయబారులు మంజీవ్ పూరి, జావేద్ అష్రఫ్ ఉన్నారు. వీరు స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాకు వెళ్తారు.
శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బీజేపీకి చెందిన బన్సూరి స్వరాజ్, అతుల్ గార్గ్, ఎస్ఎస్ అహ్లువాలియా, మనన్ కుమార్ మిశ్రాతో పాటు ఐయుఎంఎల్‌కు చెందిన ఇటి మొహమ్మద్ బషీర్, బిజెడికి చెందిన సస్మిత్ పాత్రా, రాయబారి సుజన్ చినాయ్ ఉన్నారు. వీరు యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్‌లను సందర్శిస్తారు.
కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా నేతృత్వంలోని మిగిలిన నాలుగు ప్రతినిధి బృందాలు గురువారం వారికి కేటాయించిన దేశాలకు బయలుదేరి వెళ్తాయి. అయితే
కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి లేకుండా కేంద్రం శశి థరూర్‌ను ప్రతినిధి బృందానికి సారధ్య బాధ్యతను అప్పగించడంతో కాంగ్రెస్ నాయకత్వం గుర్రుగా ఉంది.
ఈ సందర్భంగా షిండే విలేఖరులతో మాట్లాడుతూ.. “విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని గ్రూపులకు గైడ్ చేసింది. ఆయా దేశాల్లో ఏం మాట్లాడాలో వివరించారు. భారతపై గతంలో జరిగిన ఉగ్రవాద దాడుల వివరించారు.’’ అని తెలిపారు.