"ఇది కేవలం హిందీ వివాదం కాదు; అసలు సమస్య మరింత లోతయినది..
త్రిభాష విధానంపై చెలరేగిన వివాదాన్ని ‘‘The Federal’’ విశ్లేషించడం ప్రారంభించింది. తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతుందో చెప్పే ప్రయత్నం చేసింది.;
- (MV Narayanan)
మరో "భాషా యుద్ధం" ముంచుకొచ్చినట్టు కనిపిస్తోంది. మూడు భాషల నూతన విద్యా విధానం(NEP-2020) అమలుకు తమిళనాడు(Tamilnadu) సర్కారు ససేమిరా అంటోంది. NEP అమలు చేయని రాష్ట్రాలకు ‘సమగ్ర శిక్షా పథకం’ నిధులు రావని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుండ బద్ధలు కొట్టారు. అయితే ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (MK Stalin) మాత్రం మెట్టు దిగడం లేదు. నిధుల కోసం తాము కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గమని ఘాటుగా స్పందించారు. రూ. 2వేల కోట్లకు బదులుగా రూ. 10వేట్లు ఇచ్చినా త్రి భాషా విధానాన్ని (Language row) అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హిందీ నేర్చుకోడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. "కేంద్రానికి తమిళనాడు కూడా పన్ను వాటా చెల్లించకపోతే ఏమవుతుంది?" అని ప్రశ్నించారు.
NEP ఏం చెబుతోంది?
వాస్తవానికి హిందీని అన్నిచోట్లా బలవంతంగా నేర్పించాలనే నిబంధన పెట్టలేదు. ‘‘ప్రజల ఆకాంక్షలు, ప్రాంతాల అవసరాలు, జాతీయ ఐక్యతను దృష్టిలో ఉంచుకుని త్రిభాషా విధానం కొనసాగుతుంది. ఏ రాష్ట్రంపైనా భాషను బలవంతంగా రుద్దరు. విద్యార్థులు నేర్చుకునే మూడు భాషలను రాష్ట్రాలు, ప్రాంతాలు, విద్యార్థుల ఇష్టానుసారం ఎంచుకోవచ్చు. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. విద్యార్థులు తమ తల్లి భాష/ప్రాంతీయ భాష, ఇంగ్లీష్‌తో పాటు మరో భారతీయ భాషను నేర్చుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు NEP కల్పిస్తోంది.’’
అయితే వివాదం ఎందుకు?
ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునేలా NEP ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు చిన్నప్పుడే మరో భారతీయ భాషను నేర్చుకుని ఇతర ప్రాంతాల భాషలు, సంస్కృతులను అర్థం చేసుకోవడం మంచిదే కదా? ఇది కేవలం భాషా విధానంపై వివాదమా? లేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల మధ్య వివాదమా? అన్న సందేహం కలుగుతోంది.
సుధీర్ఘ పోరాటం..
ఈ భాషా వివాదం కొత్తదేం కాదు. దీని వెనుక చాలా పాత చరిత్ర ఉంది. ఈ వివాదం స్వాతంత్ర్యానికి ముందు నుంచే ప్రారంభమైంది. దేశంలో జాతీయ భాషా విధానం రూపుదిద్దుకున్నప్పటి నుంచే ఈ పోరాటం కొనసాగుతోంది. తమిళ ప్రజలకు తమ భాషపై అపారమైన గౌరవం. ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషలలో తమిళం ఒకటి. అందుకే బలవంతంగా ఏదైనా భాషను రుద్దాలనే ప్రయత్నాలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడు ఎంతో కాలంగా పోరాడి విజయవంతమైంది.
1937లో మొదలైన మొదటి ఉద్యమం..
తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేకంగా తొలి ఉద్యమం 1937లో ప్రారంభమైంది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి సి. రాజగోపాలచారి (C. Rajagopalachari) ఉత్తర్వులు జారీ చేసి పాఠశాలల్లో హిందీ తప్పనిసరి చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ.వి.రామస్వామి (పెరియార్), సోమసుందర భరతియార్, మరైమలై అదిగళ్ లాంటి మహానీయుల నేతృత్వంలో భారీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం రెండున్నర సంవత్సరాలు కొనసాగి.. 1940 ఫిబ్రవరిలో ముగిసింది. ఆ సమయంలో సుమారు 1,200 మంది ఉద్యమకారులు జైలుకు వెళ్లారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చివరకు అప్పటి గవర్నర్ లార్డ్ ఎర్స్కైన్ (Lord Erskine) ఆ ఉత్తర్వును రద్దు చేయడంతో ఉద్యమానికి తెరపడింది.
1960లో ఏమైంది?
1948లో మళ్లీ ప్రజా నిరసనలు చెలరేగాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఓమందూర్ రామస్వామి రెడ్డి ప్రభుత్వం హిందీని తప్పనిసరి భాషగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి వెనక్కు తీసుకుంది.
1964-65లో హిందీ వ్యతిరేక ఉద్యమం..
మూడోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం 1964-65లో మొదలైంది. దీనికి ప్రధాన కారణం 1963లో తీసుకువచ్చిన "ఆధికారిక భాషల చట్టం. ఈ చట్టం ప్రకారం.. హిందీనే ఏకైక అధికార భాషగా ప్రకటించారు. అయితే హిందీ మాట్లాడని రాష్ట్రాలకు "సహాయక భాషగా" ఇంగ్లీషును కొంతకాలం కొనసాగించుకునే అవకాశం కల్పించారు. దీనికి వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రజలు, విద్యార్థులు జైళ్లకు వెళ్లారు. ప్రతిఘటన నేపథ్యంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో అధికార భాషగా ఇంగ్లీష్‌ను కొనసాగించేలా చట్టాన్ని సవరిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యమం కాస్త చల్లబడింది.
ఏం మారింది?
1967లో కేంద్ర ప్రభుత్వం ఆధికారిక భాషల చట్టాన్ని సవరిస్తూ.. హిందీ, ఇంగ్లీష్‌ను అపరిమిత కాలం పాటు అధికార భాషలుగా కొనసాగించేందుకు హామీ ఇచ్చింది. అంతేకాదు.. 1968లో "ఆధికారిక భాష తీర్మానం" తీసుకువచ్చి దేశవ్యాప్తంగా మూడు-భాషల విధానాన్ని (ప్రాంతీయ భాష + హిందీ లేదా మరో భారతీయ భాష + ఇంగ్లీష్) అమలు చేయాలని నిర్ణయించింది.
తమిళనాడుది ప్రత్యేక వైఖరి..
తమిళనాడులో గత ఉద్యమాల ప్రభావం కారణంగా రాష్ట్రం మూడు-భాషల విధానాన్ని తిరస్కరించి, "రెండు-భాషల విధానం" (తమిళం + ఇంగ్లీష్) పాటించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విధానం ప్రకారం.. తమిళ విద్యార్థులు హిందీని బలవంతంగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు. CBSE పాఠశాలల్లో మాత్రమే హిందీ నేర్పిస్తారు.
ఇప్పుడు వివాదం ఎందుకు?
ఇది కేవలం భాషా సమస్య మాత్రమే కాదు. తాజా పరిణామాలను పరిశీలిస్తే.. ఇది భాషకు మించిన అంశమని అర్థమవుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో చోటుచేసుకున్న ఘటనలను గమనిస్తే, ఈ వివాదం వెనుక మరిన్ని అంశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది.
ఐక్యత Vs ఏకరూపత
2022 ఏప్రిల్‌లో 37వ పార్లమెంటరీ అధికారిక భాషా కమిటీ సమావేశం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారిక భాష ద్వారా పరిపాలన చేయాలని నిర్ణయించింది. ఇది హిందీ ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్‌ను పూర్తిగా తొలగించి, హిందీనే అధికారిక భాషగా చేయాల్సిన సమయం వచ్చింది." అని అన్నారు.
స్టాలిన్ స్పందన..
దీనికి వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. "ఐక్యత అంటే ఏకరూపత కాదు. బీజేపీ నేతలు భారత వైవిధ్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా(Amit shah) 'హిందీ రాష్ట్రం' ఉంటే సరిపోతుందనుకుంటున్నారా? భారతదేశం అనేక రాష్ట్రాల సమ్మిళితం!. ఒకే భాషను అందరిపై బలవంతంగా రుద్దడం సరికాదు. ఏకరూపత వల్ల ఐక్యత రావడం అసంభవం. మళ్లీ అదే తప్పు చేస్తున్నారు,"అని స్టాలిన్ అన్నారు.
అమిత్ షా ఆరోపణలు..
ఈ భాషా వివాదం నేపథ్యంలో అమిత్ షా మరో వ్యాఖ్య చేశారు. స్టాలిన్ పార్టీ డీఎంకేను "దేశద్రోహి" పార్టీ అని అన్నారు.
ఎందుకీ ఈ ఆరోపణ?
స్టాలిన్ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పునర్విభజన కారణంగా తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ఆయన ఆందోళన. ఇది కేవలం తమిళనాడుకే సంబంధించిన విషయం కాదు. మొత్తం దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంది," అని స్టాలిన్ అన్నారు.
పన్నుల పంపిణీపై అసంతృప్తి..
స్టాలిన్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ విధానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలు తమ ఆదాయపు పన్ను వాటాలో అధిక మొత్తాన్ని కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. అయితే ఆ నిధులు ప్రధానంగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి.స్టాలిన్ ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ.. "తమిళనాడు కూడా ప్రతిస్పందనగా కేంద్రానికి తన పన్ను వాటా చెల్లించకపోతే ఏమవుతుంది?" అని ప్రశ్నించారు.
భాష వివాదం వెనుక అసలు కారణాలు?
ఇక్కడ భాష మాత్రమే కాదు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ అగ్రశ్రేణి మధ్య విభేదాలు కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. భాషా విధానం, పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం, పన్నుల పంపిణీలో అసమానతలు.. ఈ మూడూ కలిసి భాషా వివాదాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి.
అన్యాయమైన పంపిణీ..
కేంద్ర నిధుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. అభివృద్ధిలో ముందుండి, మెరుగైన జీవన ప్రమాణాలున్న దక్షిణాది రాష్ట్రాల కంటే పాలనలో వెనుకబడిన ఉత్తర భారత రాష్ట్రాలను కేంద్రం ఎక్కువగా ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు, స్టాలిన్ దృష్టిలో ఇది కేవలం భాషా సమస్య మాత్రమే కాదు. NEP, మూడు-భాషల విధానం ఒక పెద్ద రాజకీయ, సాంస్కృతిక పోరాటంలో భాగంగా ఉన్నాయి. దీంతో అనేక సమస్యలు అనుసంధానమై ఉన్నాయి.
భాషాపర అసమానతలు..
భాషా విధానం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిలో అసమానత స్పష్టంగా కనిపిస్తుంది. 1968 అధికారిక భాషా తీర్మానం ప్రకారం మూడు-భాషల విధానం ఇలా ఉండాలి: హిందీ రాష్ట్రాలు → హిందీ, ఇంగ్లీష్, మరో భారతీయ భాష (ప్రత్యేకించి దక్షిణాది భాష), హిందీ కాకున్నా ఇతర రాష్ట్రాలు → ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాష. అయితే, ఈ విధానం అసలు అమలుకాలేదు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు దక్షిణాది భాషలను పాఠ్యాంశాల్లో చేర్చలేదు. బదులుగా సంస్కృతం, ఉర్దూ, ఇతర ఉత్తరాది భాషలను మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాయి. చివరికి "దక్షిణాది భాషలను ప్రాధాన్యంగా తీసుకోవాలి" అన్న నిబంధననే పూర్తిగా తీసివేశారు. అయితే హిందీ మాత్రం తమిళనాడు మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలవంతంగా ప్రవేశపెట్టారు.
తమిళనాడుకు ప్రత్యేక వైఖరి ఎందుకు?
ఇక్కడ అసలు వివాదం భాషను మించిపోయింది. భాషా విధానం అమలులో ద్వంద్వ విధానాలున్నాయి. కేంద్రం-రాష్ట్రాల మధ్య అభివృద్ధి, నిధుల పంపిణీ వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం హిందీని వ్యతిరేకించడం మాత్రమే కాదు. దక్షిణాది రాష్ట్రాలకు ఎదురవుతున్న రాజకీయ, ఆర్థిక, భాషా అసమానతలపై పెద్ద స్థాయిలో పోరాటం.
సంస్కృతానికి ప్రాధాన్యం..
ఐక్యత, బహుభాషా విధానం గురించి NEP ఎంతగా మాట్లాడినా.. భాషా వ్యవస్థలో సమతుల్యతకు మాత్రం మార్పును ప్రతిపాదించలేదు. హిందీ మాట్లాడే రాష్ట్రాలకు కొత్త భాషలు బోధించాలని ఎలాంటి నిబంధన లేదు. అయితే హిందీ కాకుండా ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాలు మాత్రం భిన్న భాషలను కలుపుకోవాలన్న ఒత్తిడి ఉంది. ఈ విధానం వాస్తవానికి ద్వంద్వ ప్రమాణాలతో నడుస్తోంది. హిందీ రాష్ట్రాలపై ఎటువంటి భాషా నిబంధనలు లేవు. అయితే హిందీని మాట్లాడని రాష్ట్రాలే బహుభాషా విధానం పాటించాలని ఒత్తిడి పెరిగింది. ఒకవేళ నిజంగా ఐక్యత, భిన్నత్వాన్ని కాపాడాలన్నది కేంద్రం ఉద్దేశమయితే.. హిందీ రాష్ట్రాల్లో కూడా దక్షిణాది భాషలు, ఈశాన్య భాషలు బోధన ఉండేలా చూడాలి. కానీ అలాంటి ప్రతిపాదన ఏదీ NEPలో కనిపించదు!
సంస్కృతానికి మొగ్గు..
NEPలో మరో ఆసక్తికరమైన అంశం.. సంస్కృతాన్ని ప్రోత్సహించడం. ఉత్తరాది సంస్కృతి, సంస్కృత భాషను ప్రోత్సహించడం. అధికారిక విధానాల్లో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.
ఇతర సంస్కృతులకు తక్కువ స్థానం
NEPలో భారతీయ జ్ఞాన సంపద గురించి చెప్పినప్పుడు.. భారతదేశంలోని ఇతర భాషల గొప్ప సాహిత్య సంపదను పూర్తిగా విస్మరించారు! తమిళ, ఈశాన్య, బౌద్ధ, జైన, సఫీ సాహిత్య సంపదలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం నాన్-సంస్కృత సంప్రదాయానికి కేవలం రెంటిని మాత్రమే ప్రస్తావించారు – తిరువల్లువార్ (తమిళం), శంకర్ దేవ్ (అస్సాం).
తమిళనాడు ఎందుకు కఠినంగా స్పందిస్తోంది?
భాషా విధానంలో వివక్ష, సంస్కృతేతర జ్ఞాన సంపదను పక్కన పెట్టడం, భారతీయ వైవిధ్యాన్ని గుర్తించకుండా, ఏకపక్ష ధోరణిని ప్రోత్సహించడం.. ఈ కారణాల వల్లే తమిళనాడు NEPకు గట్టిగా ప్రతిఘటిస్తోంది. రాష్ట్రాలకు అధికారాలను తగ్గించే చర్యలు..UGC (University Grants Commission) కొత్త నిబంధనల ప్రకారం..రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై గవర్నర్-కులపతిగా నియంత్రణ పెంచడం, రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక విద్యా విధానాలను కేంద్రం నియంత్రణలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలను విద్యా రంగంలో బలహీనంగా మార్చేలా ఉన్నాయి. ఈ పరిస్థితులను బట్టి తమిళనాడు NEPని వ్యతిరేకిస్తోందని అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడుకున్న అసలు ఆందోళన..
NEP వల్ల రాష్ట్ర విద్యా విధానంపై నియంత్రణను కోల్పోతామన్న భయం పట్టుకుంది. విద్యావిధానాన్ని ఏకపక్షంగా రూపొందించి, రాష్ట్రాల ప్రాధాన్యతలను పక్కన పెట్టడమే కేంద్రం లక్ష్యమా? కేంద్రం తీరుతో తమిళనాడు మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలూ తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది.
సామాజిక న్యాయానికి విఘాతం..
విద్యా అవకాశాలను సమానంగా విస్తరించాలనే ఉద్దేశం కేంద్ర వద్ద స్పష్టంగా కనిపించడం లేదు. వంచిత వర్గాల విద్యార్థుల కోసం ప్రత్యేకమైన రక్షణలు, అవకాశాల గురించి NEPలో ప్రస్తావన తక్కువే ఉంది. దీంతో NEP అమలయితే.. సామాజిక న్యాయం మరింత దెబ్బతింటుందనే ఆందోళన గూడుకట్టుకుంది. ఇది కేవలం ఉత్తర-దక్షిణ విభేదంగా చూడదగిన సమస్య కాదు. రాజకీయంగా మరింత లోతైన విభేదాలకు ఇది ప్రతిబింబం. ఇది దేశ రాజకీయ వ్యవస్థలో పెరుగుతున్న తీవ్ర రాజ్యాధికార అణచివేతకు సంకేతం. ఒక నిర్దిష్ట ఆలోచన, సంస్కృతి మాత్రమే జాతీయమైనదని, మిగతా వాటిని పక్కన పెట్టే ప్రమాదకర ధోరణికి ఇది నిదర్శనం. భారతదేశంలోని భిన్నత్వాన్ని అంగీకరించకుండా.. ఒకే ఒక ధోరణిని రుద్దాలనే ధోరణి పెరిగితే దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.