కేజ్రీవాల్‌ని తీహార్ జైలు నెంబర్ 5లో ఉంచుతారా? బెయిల్ రాదా?
జైల్లో బాస్, బాస్ కి సేవలందించాల్సింది మాత్రం ఆయన కింద పని చేసేవాళ్లు. విచిత్ర పరిస్థితి ఎదుర్కోబోతున్న ఢిల్లీ తీహార్ జైలు సిబ్బంది..
దేశంలోనే అతిపెద్ద తీహార్ జైలుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తీహార్ జైలు అధికారులు ఎందకంత హాల్ చేస్తున్నారు? కేజ్రీవాల్‌కు బెయిల్ రాదని జైలు అధికారులకు ముందే తెలిసిపోయిందా? ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలు, సిద్ధం చేస్తున్న గది వంటివి చూస్తుంటే కేజ్రీవాల్‌కి బెయిల్ రాదనే నిర్ణయానికే అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖులందరూ తీహార్ జైల్లోనే ఉన్నారు. తాజాగా బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కె.కవిత కూడా తీహార్ జైలుకే వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్ అంత త్వరగా రాదు. అలాగని త్వరగా కూడా వీళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లు వేయవు. ఫలితంగా సుదీర్ఘకాలం పాటు వీళ్లు జైల్లో ఉండాల్సిందే.
ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి చూస్తుంటే కేజ్రీవాల్‌కు బెయిల్ రాదనేది అర్థమవుతుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం అంటే ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ తీర్పు కంటే ముందే జైలు అధికారులు తీహార్ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కేజ్రీవాల్ మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోని కస్టడీలో ఉంటారు. మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన కేజ్రీవాల్ ప్రస్తుత కస్టడీ మార్చి 28తో ముగుస్తుంది. అరెస్టుపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. తన అరెస్టు, తదుపరి రిమాండ్ ‘చట్టవిరుద్ధం– అంటూ కేజ్రీవాల్ పిటిషన్ పెట్టారు. హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొట్టేస్తే ఆయన సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళతారు. అదీ విఫలమైతే తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది.