గోల్డ్ లోన్‌కు ఆర్బీఐ కొత్త నిబంధనలు..
బంగారు ఆభరణాలపై రుణాల విషయంలో మోసాలను అరికట్టేందునని ప్రకటన..;
బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త సూచనలు చేసింది. కొత్త నిబంధనలను పాటించి ఖాతాదారులకు గోల్ట్ లోన్లు(Gold Loans) ఇవ్వాలని కోరింది. లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని 80 శాతం నుంచి 75 శాతానికి తగ్గించాలని, బంగారు నగలు కొన్న రశీదు లేదా సెల్ఫ్ డిక్లరేషన్‌ను లోన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి తీసుకోవాలని సూచించింది.
అయితే ఈ కొత్త నిబంధనలపై తమిళనాట(Tamil Nadu) తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకు ఆశ్రయించేందుకు దారి చూపే ఈ కొత్త మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్బీఐ కొత్త రూల్స్‌ను బ్యాంకర్లు (Bankers) స్వాగతిస్తున్నారు.
అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి ఆర్బీఐ కొత్త నిబంధనలను ఖండించారు. సన్నకారు రైతులు, చిరు వ్యాపారులకు లోన్లు పొందడం ఇకపై చాలా ఇబ్బంకరమని, అల్పాదాయ వర్గాలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే అవకాశం ఉందన్నారు.
బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ బంగారు రుణాలకు LTV నిష్పత్తిని 75 శాతంగా పరిమితం చేయడం కొత్త నిబంధన కాదన్నారు. గతంలో ఇదే నిబంధన ఉండేదని, కోవిడ్ సమయంలో 80 శాతానికి పెంచారని గుర్తుచేశారు.
అందుకే నిబంధనల్లో మార్పు..
నగలు తనఖా పెట్టి రుణాలు పొందడంలో అక్రమపద్ధతులను అనుసరిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో నిబంధనల్లో కొన్ని మార్పులు చేశామని ఆర్‌బీఐ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ తరుణ్ సింగ్ ఓ ప్రకటన జారీ చేశారు. క్లయింట్ లేకుండానే బంగారానికి విలువ కట్టడం, బంగారు, ఆభరణాల రుణాలపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడం, రుణాలు చెల్లించని పక్షంలో ఆ బంగారాన్ని వేలం వేసే విషయంలో పారదర్శకత లేకపోవడం తదితర ఇబ్బందులను ఆయన ఎత్తిచూపారు.