కులగణనను ‘‘గేమ్ ఛేంజర్ నిర్ణయం’’గా అభివర్ణించిన కేంద్ర మంత్రులు..
కులగణనపై కేంద్ర తీసుకున్న నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మా ఒత్తిడి కేంద్రం తలొగ్గిందని ఒకరంటే.. కాదు అది ప్రధాని ఘనతేనని మరొకరు వాదిస్తున్నారు.;
కుల గణన(Caste Census)కు కేంద్రం ఆమోదం తెలపడంతో.. ప్రతిపక్షాలు అది మా ఘనతే అని ఢంకా బజాయిస్తున్నాయి. మా ఒత్తిడి వల్లే కేంద్రం దిగి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan), చిరాగ్ పాస్వాన్(Chirag Paswan) మాత్రం అది ప్రధాని మోదీ(PM Narendra Modi) ఘనతేనని అంటున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ప్రధాన్.. మోదీని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు.
"ఈ కుల గణన నిర్ణయం అకస్మాత్తుగా తీసుకోలేదు. 'సబ్ కా సాథ్-సబ్ కా వికాస్' అనేది మోదీ ప్రభుత్వ సిద్ధాంతం. సమాజంలోని అన్ని వర్గాలు ప్రయోజనాలు పొందాలన్నదే మా లక్ష్యం" అని ప్రధాన్ పేర్కొన్నారు.
తదుపరి జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చాలనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాశ్వాన్ ప్రశంసించారు. ఆ ఘనత కేవలం ప్రధాని మోదీకే దక్కుతుందని, అయితే ప్రతిపక్ష పార్టీలు దాన్ని తమ ఖాతాలోకి వేసుకుంటున్నాయని విమర్శించారు.
స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి..
నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 30) తదుపరి జనాభా గణనలో కుల గణన ఉంటుందని ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA) ఈ నిర్ణయం తీసుకుంది. అయితే స్వాతంత్య్రం తర్వాత కుల వివరాలను సేకరించడం ఇదే మొదటిసారి. బీహార్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తుండగా.. బీహార్ , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే కుల గణన సర్వేలు పూర్తి చేశాయి.