‘బెంగాల్‌లో వక్ఫ్ చట్టం అమలుకానివ్వం’
మైనార్టీల ఆస్తులకు రక్షణగా ఉంటానన్న మమత బెనర్జీ;
పశ్చిమ బెంగాల్(West Bengal)లో వక్ఫ్ (సవరణ)(Waqf Amendment Bill) చట్టాన్ని అమలు చేయనివ్వమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) బుధవారం (ఏప్రిల్ 9) స్పష్టం చేశారు. కోల్‌కతాలో జైన సమాజం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మైనారిటీ వర్గాలను, వారి ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు.
‘రెచ్చగొడితే రెచ్చిపోవద్దు’
"వక్ఫ్ చట్టం వల్ల మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. ధైర్యంగా ఉండండి.. విభజించి పాలించే అవకాశం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. కొంతమంది మిమ్మల్ని సమావేశపరిచి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అందరూ కలిసి ఉండాలని కోరుతున్నా. ఐక్యంగా ఉంటేనే ప్రపంచాన్ని జయించగలం," అని ప్రజలను కోరారు.
మంగళవారం ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన హింసను ప్రస్తావిస్తూ..“బంగ్లాదేశ్ సరిహద్దులో పరిస్థితిని చూడండి. ఇది (వక్ఫ్ బిల్లు) ఇప్పుడు ఆమోదం పొందకూడదు. తొలుత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. భారతదేశం అన్నీ కలిసి ఉన్నాయని, తర్వాత విభజన జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ నివసిస్తున్న వారికి రక్షణ కల్పించడం మా పని" అని పేర్కొన్నారు.
‘ఐక్యత నుంచి వేరుచేయలేరు’
"మీరు నన్ను కాల్చి చంపినా, ఈ ఐక్యత నుంచి నన్ను వేరు చేయలేరు. ప్రతి మతం, కులం, మతం... అన్నీ మానవత్వం కోసం ప్రార్థిస్తాయి. మేం వాటికి కట్టుబడి ఉన్నాం," అని చెప్పారు.
తాను అన్ని మత ప్రదేశాలను సందర్శిస్తానని, అది అలాగే కొనసాగుతుందని చెబుతూ.. దుర్గాపూజ, కాళీపూజ, జైన, బౌద్ధ దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, గురు రవిదాస్ ఆలయాలకు వెళతానని మమత చెప్పారు. "రాజస్థాన్‌లో అజ్మీర్ షరీఫ్‌తో పాటు పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించాను’’ అని గుర్తుచేశారు.
పార్లమెంటులో బిల్లుకు ఆమోదం..
పార్లమెంటు ఉభయ సభలలో సుదీర్ఘ చర్చల తర్వాత ఏప్రిల్ 3న లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు ఆమోదం పొందింది. మరుసటి రోజు తెల్లవారుజామున రాజ్యసభలో ఆమోదం పొందింది. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు తన ఆమోద ముద్ర వేశారు.