‘పశ్చిమ బెంగాల్‌ను పూర్తిగా విస్మరించారు’

బడ్జెట్ కేటాయింపులో పక్షపాత వైఖరి అనుసరించారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Update: 2024-07-23 12:41 GMT

కేంద్ర బడ్జెట్ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారానికి తెరతీసింది. తమ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ ఆరోపణలను కొట్టి పారేయడం బీజేపీకి అంత తేలిక కాదు.

‘పక్షపాత బడ్జెట్’

నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ‘పక్షపాత బడ్జెట్’గా అభివర్ణించారు మమతా. “కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపింది. దాన్ని నేను వ్యతిరేకించను. కానీ ఏ రాష్ట్రాన్ని దూరం పెట్టడం సరికాదు. బెంగాల్ వరద పీడిత రాష్ట్రం. బీహార్, అస్సాం, సిక్కిం రాష్ట్రాలకు వరద సాయంగా నిధులు కేటాయించారు. అయితే బెంగాల్‌ను పూర్తిగా విస్మరించారు. బడ్జెట్ కేటాయింపులో పక్షపాతం చూపారు.” అని మమతా బెనర్జీ విమర్శించారు.

అసలు బెంగాల్‌కు కేంద్రం ఏం ఇవ్వాలి?

MGNREGA, PMAY లాంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్రానికి నిధులు చెల్లించకపోవడాన్ని మమత తప్పుబట్టారు. ఆ పథకాలకు సంబంధించి రాష్ట్రానికి ఇంకా రూ.1.71 లక్షల కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. “ఈ బిజెపి ప్రభుత్వం బెంగాల్‌ను నిరంతరం ఎలా నష్టపరుస్తుందో మీరు చూశారు. బెంగాల్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు” అని TMC ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విమర్శించారు.

బీజేపీని టార్గెట్ చేసిన టీఎంసీ..

సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ విధానానికి బదులుగా జో హుమారే సాథ్, హమ్ ఉంకే సాథ్ విధానాన్ని అనుసరించాలని బీజేపీ సమావేశంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సూచించారు. ఆయన ప్రకటన బడ్జెట్‌లో ప్రతిబింబిస్తుందని అభిషేక్ అన్నారు.

"స్వాతంత్య్ర పోరాటంలో బెంగాల్ ఎప్పుడూ ముందుండి నడిపించింది. స్వాతంత్ర్య సమరయోధులను తయారు చేసింది. కానీ అదే బెంగాల్ నేడు నష్టపోయింది. బెంగాల్ ప్రజలు తప్పకుండా తగిన సమాధానం ఇస్తారు" అని TMC ప్రధాన కార్యదర్శి అన్నారు.

డిఫెన్స్‌లో బీజేపీ..

బడ్జెట్‌ను టిఎంసి రాజకీయం చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ పేర్కొన్నారు. “మొత్తం బడ్జెట్ నుంచి బెంగాల్ ప్రయోజనం పొందుతుంది. ఉదాహరణకు..సిక్కింలో తీస్తా నదికి వరద నియంత్రణ చర్యలు చేపడితే, అది బెంగాల్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. బడ్జెట్‌లో పేర్కొన్న ఇతర సాధారణ పథకాలు, విధానాల నుంచి కూడా రాష్ట్రం ప్రయోజనం పొందుతుంది’’. అని అన్నారాయన.

Tags:    

Similar News