అధికారిక నివాసాన్ని వీడిన కేజ్రీవాల్ ఎక్కడ ఉండబోతున్నారు?
‘నిజాయితీ సర్టిఫికెట్’ పొందిన తర్వాతే మళ్లీ సీఎం అవుతానన్నకేజ్రీవాల్ .. గతంలో చెప్పినట్లుగానే దసరా నవరాత్రుల్లో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఇక నుంచి మండి హౌస్ సమీపంలోని ఫిరోజ్‌షా రోడ్‌లోని ఆప్ సభ్యుడు అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కాసేపటి క్రితం తన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ఆ ఇంటికి బయలుదేరారు. పంజాబ్ నుంచి ఎంపికయిన రాజ్యసభ ఎంపీ మిట్టల్‌కు ప్రభుత్వం సెంట్రల్ ఢిల్లీలో బంగ్లా కేటాయించింది.
ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల నుంచి ‘నిజాయితీ సర్టిఫికెట్’ పొందిన తర్వాతే మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపడతానని కేజ్రీవాల్ గత నెలలో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దసరా నవరాత్రుల్లో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని కేజ్రీవాల్ గతంలో చెప్పారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఐదు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి బెయిల్‌పై సెప్టెంబర్ 13న విడుదలయ్యారు.