సిక్కోలులో ఇక వార్‌ వన్‌సైడేనా!

శ్రీకాకుళం సీటును ఎలా వదిలేస్తాం.. ఈసారి అటో ఇటో తేల్చేయాల్సిందేనంటోంది వైసీపీ అధిష్టానం..

Update: 2024-01-04 03:54 GMT
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ మ్యాప్‌

ఏపీ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. కీలకమైన శ్రీకాకుళం పార్లమెంట్‌ సీటుపై ప్రత్యేక దృష్టి సారించిన వైసీపీ.. సిక్కోలుపై ఫ్యాన్‌ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బలమైన అభ్యర్థిని ఇక్కడి నుంచి రంగంలోకి దింపేందుకు వ్యూహ రచన చేస్తోంది.

ఎలాగైనా శ్రీకాకుళాన్ని గెలవాలి...


శ్రీకాకుళం జిల్లా అంటేనే ఏపీ రాజకీయాల్లో సమ్‌థింగ్‌ స్పెషల్‌. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ సర్వేలకు సైతం అంతుబట్టని తీర్పు ఇస్తుంటారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 సీట్లు వైసీపీ గెలుచుకున్నా.. ఎంపీ స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. టిడిపి నేత కింజారపు రామ్మోహన్‌నాయుడు రెండోసారి సిక్కోలు సీటు గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సిక్కోలు పార్లమెంట్‌ స్థానంలో గెలుపొందలేదు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది.

పార్లమెంటుకు పోటీ చేయం..

ఈ క్రమంలోనే స్పీకర్‌ తమ్మినేతి సీతారాం, ధర్మాన బ్రదర్స్‌ను సంప్రదించినా.. వారు అసెంబ్లీ బరిలోనే ఉంటామని చెప్పినట్లు సమాచారం. ఇక జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయను పోటీ చేయించాలనుకున్నా.. ఆమె కూడా విముఖత వ్యక్తం చేయడంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది వైసీపీ.

ఈసారి శ్రీధర్‌కే లోక్‌సభ సీటు...

2019లో డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ శ్రీకాకుళం పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. ఇప్పుడు ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సేవ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉన్న శ్రీధర్‌ను పోటీ చేయించాలన్న యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు, కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ టికెట్‌ కేటాయిస్తానని సీఎం జగన్‌ తనకు పలుమార్లు హామీ ఇచ్చారనే విశ్వాసంతో ఉన్నారు శ్రీధర్‌.

Tags:    

Similar News