‘గుజరాత్‌లో ఈ సారి వాళ్లను ఓడిద్దాం’
లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని ఓడించినట్లే ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం ప్రతిజ్ఞ చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని ఓడించినట్లే ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం ప్రతిజ్ఞ చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"వారు (బిజెపి) మన కార్యాలయాన్ని ధ్వంసం చేసి మనకు సవాల్ విసిరారు. మన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లుగా.. మనం వారి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతాం " అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) కంచుకోటగా భావించే గుజరాత్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యాలయంపై దాడి..
బీజేపీ హిందూ వ్యతిరేకి అని పార్లమెంట్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువజన విభాగం సభ్యులు అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటన జూలై 2న జరిగింది.
అయోధ్య వాసుల కోపం వల్లే..
అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో బిజెపి ఓటమిపాలైన విషయం తెలిసిందే. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఒక్క స్థానిక వ్యక్తిని కూడా ఆహ్వానించలేదని..ఆ కారణంగానే అయోధ్య ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు తీసుకున్న రైతులకు నేటికీ సరైన పరిహారం అందలేదని ఆరోపించారు. తమ భూములు, దుకాణాలు, ఇళ్లకు పరిహారం చెల్లించనందుకే ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు.
మోదీ అయోధ్య నుంచి పోటీ చేయాలనుకున్నారని ఓడిపోతారని సర్వేలు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారని చెప్పారు.